Sunday, December 3, 2023

నక్సల్స్‌పై నజర్!

- Advertisement -
- Advertisement -

Amit shah holds meeting with CMs on Naxalism

 

నక్సలిజా(మావోయిజం)న్ని అరికట్టే విషయమై రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్ష జరిపింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర మరి కొన్ని రాష్ట్రాల ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారు. బలగాల ప్రయోగం ద్వారా సమస్యను తుద ముట్టించాలని, నక్సలైట్ల ఆర్థిక మూలాలను తెగ నరకాలని, సెల్‌ఫోన్ వ్యవస్థను మారుమూలకు విస్తరింప చేయాలని, కమ్యూనికేషన్లను మెరుగుపరచడం ద్వారా వెనుకబడిన ప్రాంతాల ప్రజలను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకు రావాలని తదితర చర్యలపై ఈ సమావేశం దృష్టి పెట్టినట్టు వార్తలు వచ్చాయి. వామపక్ష తీవ్రవాదం ప్రబలుతున్న రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తున్నదని అమిత్ షా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రకటించారు. మావోయిస్టు దాడులు 23 శాతం, ఆ దాడుల కారణంగా మృతుల సంఖ్య 21 శాతం తగ్గాయన్నారు. నక్సలిజాన్ని సమూలంగా అరికట్టలేకపోతే దేశాభివృద్ధి, ఆ సమస్యతో సతమతమవుతున్న రాష్ట్రాల ప్రగతి సాధ్యం కావన్నారు.

స్వాతంత్య్రానంతరం ఆరు దశాబ్దాలుగా అభివృద్ధి కింది వరకు చేరకపోడమే ఆయా ప్రాంతాల ప్రజల అసంతృప్తికి కారణమని కూడా అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ సమస్యపై ప్రతి మూడు మాసాలకొకసారి డిజిపిలతో, సంబంధిత కేంద్ర సంస్థల అధికారులతో సమావేశమవ్వాలని సూచించారు. గతంలోని కేంద్ర హోం మంత్రులు కూడా ఈ సమస్యపై ఇదే విధంగా దృష్టి కేంద్రీకరించి దీని నిర్మూలనకు అనుసరించవలసిన మార్గాలన్నింటినీ అన్వేషించారు. ఆయా రాష్ట్రాలూ తమకు చేతనైనన్ని విధాలుగా బలగాలను ప్రయోగించి నక్సల్స్‌ను తుది ముట్టించడానికి కృషి చేశాయి. అయినా సమస్య కడతేరలేదు. అప్పుడప్పుడూ తగ్గినట్టు కనిపించినా మళ్లీ దూసుకొస్తున్నది. ప్రభుత్వ బలగాలు విరుచుకుపడి అధిక సంఖ్యలో నక్సల్స్‌ను అంతమొందించినప్పుడెల్లా వారు కూడా అదే స్థాయిలో ఎదురు దెబ్బ తీయగలుగుతున్నారు. వాస్తవానికి ఎమర్జెన్సీ కాలంలో పోలీసులు విచ్చలవిడిగా విజృంభించి తీసుకున్న చర్యల వల్ల నక్సలిజం బాగా తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. కాని ఆ చర్యల వల్ల కలిగిన మానవ హక్కుల హరణం, హననం ఆ తర్వాత ఆ సమస్య మళ్లీ పేట్రేగడానికే దోహదం చేశాయి.

సమస్య ప్రధానంగా ప్రజలపై సాగుతున్న ఆర్థిక దోపిడీతో ముడిపడి ఉన్నదనే అంశాన్ని ప్రభుత్వాలు అంగీకరిస్తూనే ఆచరణలో తుపాకులు, తూటాల ప్రయోగంతో నక్సలైట్లను వధించడం ద్వారా ఆ ఉద్యమానికి తెర దించడానికే ప్రాధాన్యమిస్తున్నాయి. అందుచేతనే ఇది ఎప్పటికీ కొరకరాని కొయ్యగా మిగిలిపోతున్నది.1967లో పశ్చిమ బెంగాల్‌లోని మారుమూల ప్రాంతంలో అక్కడి భూస్వామ్య అమానుషాలపై దాడిగా మొదలై అనేక రాష్ట్రాల్లోని దట్టమైన ఆదివాసీ ప్రాంతాలకు వ్యాపించిన నక్సలిజం నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ ఉండడమే దాని మూలాల పట్టును నిరూపిస్తున్నది. తెలంగాణలో సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సాగుతున్న అభివృద్ధి కృషి ఇక్కడి మారుమూల ప్రాంతాల ప్రజలను ముఖ్యంగా ఈనాటి తరాన్ని నక్సలిజానికి దూరంగా ఉంచిందనే చెప్పాలి. ఇందులో పోలీసుల అప్రమత్తత పాత్ర కూడా ఉంది. ‘కొన్ని సార్లు ప్రజల ఓర్పుకి కూడా హద్దుంటుంది. న్యాయ వ్యవస్థపైన వారికి నమ్మకం సడలిపోతుంది. ప్రజా ప్రభుత్వం బూర్జువా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారీ వ్యాపార వర్గాల చేతుల్లో ఆటబొమ్మ అయిపోతుంది.

తమ దైనందిన జీవితాల మీద కూడా వారు పట్టుకోల్పోతారు. దానితో వారి లోపలి నుంచి అరాచక భావజాలం పెల్లుబుకుతుంది. అది తాత్కాలికంగా వచ్చిపోయేది కాదు. తమ సొంత గడ్డ మీదనే తాము అన్యాయానికి గురై సొంత ఆస్తుల నుంచే దూరమైపోతున్నామనే అభిప్రాయం వారిలో వేళ్లూనుకుంటుంది. ఈ పరిస్థితి నుంచే ఇటువంటి ఉద్యమాలు ప్రారంభమై బలం పుంజుకుంటాయి’ అని జర్నల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో ప్రచురితమైన ఒక వ్యాసం పేర్కొన్నది. ఇది నూటికి నూరు పాళ్లు వాస్తవమని చెప్పడానికి వెనుకాడవలసిన పని లేదు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటివి రూపొందించి అందిస్తున్న అభివృద్ధి నమూనాలను యధాతథంగా అమలు చేస్తున్నందున ఆదివాసీ ప్రాంతాలలోని ప్రజలు తమకు ఆటపట్టులైన అడవుల నుంచి అక్కడి ఉత్పత్తుల నుంచి ఆ భూగర్భంలోని వనరుల నుంచి దూరమైపోయి నిలువ నీడలేని పరిస్థితి సంభవించి తప్పనిసరి పరిస్థితుల్లో నక్సల్స్‌కు అనువుగా మారుతున్నారు. అలాగే వ్యవసాయాన్ని, ప్రభుత్వ రంగంలోని విలువైన సంస్థలను, వాటి ఆస్తులను గంప గుత్తగా కార్పొరేట్ రంగానికి అప్పగించే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యే ప్రమాదముంది. అందుచేత ప్రభుత్వాలు తమ విధానాలను పునః పరిశీలించుకొని సరైన పరిష్కార మార్గాలను ఎంచుకోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News