Friday, December 2, 2022

మళ్లీ హిందీ బెదిరింపు

- Advertisement -

Sampadakiyam      మానుతున్న గాయాలను కెలికి రాజకీయ ప్రయోజనాలు పొందడంలో తనకు సాటి లేరని కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పదేపదే రుజువు చేసుకుంటున్నది. దేశంలోని అన్ని అల్ప సంఖ్యాక వర్గాలు అనుభవిస్తున్న స్వేచ్ఛలను కబళించడం ద్వారా మెజారిటీ వర్గం ఓటు బ్యాంకును పదిలపర్చుకోడం, పెంచుకోడమే లక్షంగా ప్రధాని మోడీ ప్రభుత్వం పని చేస్తున్నట్టు భావించవలసి వస్తున్నది. ప్రజల తక్షణ సమస్యలను గాలికి వదిలేసి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి అధిక సమయం కేటాయిస్తున్నదనే అభిప్రాయానికి తావు కలుగుతున్నది. నూతన విద్యా విధాన ముసాయిదాలో అన్య భాషా రాష్ట్రాల విద్యార్థులపై హిందీని బలవంతంగా రుద్దే దుస్సాహసానికి ప్రయత్నించి ఇటీవలే తిన్న ఎదురు దెబ్బ తడి ఇంకా ఆరక ముందే దానిని జాతీయ భాషగా చేసి తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించడం దేశంలో ప్రజాస్వామ్యాన్ని కేవలం మెజారిటీ స్వామ్యంగా మార్చి స్థిరపర్చడానికి సాగుతున్న కుట్రను చాటుతున్నది.

హిందీ దినోత్సవం సందర్భంగా శనివారం నాడు అమిత్ షా ఆ భాషలో పలు ట్విటర్ సందేశాలిచ్చారు. దేశానికి ఉమ్మడి భాష అవసరమన్నారు. అందుకు తగినది అధిక సంఖ్యాకులు మాట్లాడే హిందీ ఒక్కటేనని నొక్కి పలికారు. హిందీయే భారత్‌ను ఐక్యంగా ఉంచగలదని కూడా అభిప్రాయపడ్డారు. ఇలా మాట్లాడితే ఎలాంటి స్పందన వస్తుందో బాగా అనుభవముండి కూడా అమిత్ షా తన ధోరణి మార్చుకోకపోడం ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది. భిన్న భాషలు, యాసలు మాట్లాడే ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్నందు వల్లనే దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం భిన్నత్వంలో ఏకత్వ సూత్రం ఆవిర్భవించింది. బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్ర సాధించుకొని ఇంతకాలం అయినా జాతీయ స్థాయిలో అధికార భాషగా అధికంగా ఆంగ్లమే కొనసాగడానికి కూడా దేశ భాషల బాహుళ్యమే కారణం.

ఉత్తరాది రాష్ట్రాలలో హిందీయే ప్రజల భాష అనడంలో అసత్యం ఎంత మాత్రం లేదు. ఆ విధంగా అధిక సంఖ్యాకుల భాష అదే. అయితే దేశంలో గణనీయ భాగంగా ఉన్న దక్షిణాదిలో ఏ రాష్ట్రం ఆ భాషను తన భాషగా జన భాషగా వాడుతూ దానితో సర్వతోముఖ బంధాన్ని అనుభవిస్తున్నాయి. మొత్తం దేశ జనాభాలో 44% మంది ప్రజలు హిందీ, దానితో అనుబంధమున్న భాషలు మాట్లాడుతున్నారు. కేవలం హిందీ మాట్లాడుతున్న వారు 25% మంది. ఒక్కొక్క హిందీయేతర ప్రాంతీయ భాష మాట్లాడే వారి సంఖ్య 10% వరకు ఉంటుంది. ఆ విధంగా హిందీయేతర భాషల వారి ఉమ్మడి శాతమే దేశ జనాభాలో ఎక్కువ. దేశం మొత్తమ్మీద 22 భాషలు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి. గతంలో దక్షిణాదిలో హిందీ వ్యతిరేకోద్యమం ఉధృతంగా సాగింది. పర్యవసానంగా ఇంగ్లీషును జాతీయ అనుసంధాన భాషగా కొనసాగించవలసి వచ్చింది. ఇప్పటికీ అదే జరుగుతున్నది.

భారత రాజ్యాంగంలో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తించినప్పటికీ రోజువారీ అధికారక కార్యక్రమాల కోసం ఇంగ్లీషును కూడా వాడాలని స్పష్టం చేశారు. అక్కడ హిందీ లేదా ఇంగ్లీషు అని పేర్కొన్నారు. రాజ్యాంగం 29వ అధికరణ దేశంలోని ఏ ప్రాంతంలో నివసించే ఏ వర్గానికి చెందిన పౌరులైనా తమకు గల భిన్నమైన భాషను, లిపిని, సంస్కృతిని కాపాడుకొనే హక్కు కలిగి ఉంటారు అని సందేహాతీతంగా పేర్కొన్నది. ఇంత వైవిధ్యభరితమైన భాష, సాంస్కృతిక నేపథ్యమున్న దేశంలో ఒక్క హిందీ భాషను అందరి మీద రుద్దాలనుకునే ధోరణి అంతిమంగా దేశ సమైక్యతను బలహీనపరుస్తుంది. బాధ్యతగల స్థానాల్లో గల కేంద్ర పాలకులు ఇటువంటి విచ్ఛిన్నకర పోకడలు పోవడం ఎంతమాత్రం సమర్థించదగినది కాదు. అమిత్ షా హిందీ ఔన్నత్యాన్ని నెలకొల్పుతానంటూ శనివారం నాడు చేసిన ప్రకటనకు దక్షిణాది నుంచి ఎప్పటి మాదిరిగానే తీవ్ర ప్రతిస్పందన ఎదురైంది. తమిళనాడు నేతల్లో బలవంతుడైన డిఎంకె అధినేత స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది ఇండియానా, హిండియానా అని ఎద్దేవా చేశారు. కర్నాటక నుంచి కూడా అదే మాదిరి వ్యతిరేక స్పందన వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, కుమార స్వామి అమిత్ షా ప్రకటనను వ్యతిరేకించారు. ఈ స్పందనలను దృష్టిలో పెట్టుకొని అమిత్ షా తన దూకుడును తగ్గించుకోవలసి ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే భాష నినాదాలు దేశ ప్రజాస్వామ్యాన్ని, భిన్నత్వాన్ని బలి తీసుకొని సమైక్యతను పాతరేస్తాయి. రాజకీయ ప్రయోజనాల కోసం, తక్షణ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఇటువంటి ఎత్తుగడ అక్కరకు రావచ్చుగాని జాతి క్షేమానికి మాత్రం ఎంత మాత్రం దోహదపడదు.

Amit Shah says Hindi should be made national language

Related Articles

- Advertisement -

Latest Articles