Home ఎడిటోరియల్ అంతటా ఎన్‌ఆర్‌సి!?

అంతటా ఎన్‌ఆర్‌సి!?

Sampadakiyam       జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్‌ఆర్‌సి) తేనెటీగల తుట్టెను కేంద్ర హోం మంత్రి అమిత్ మళ్లీ కదిలించారు. అసోంలో మాదిరిగానే దేశ వ్యాప్తంగా పౌర జాబితాను తయారు చేస్తామని బుధవారం నాడు రాజ్యసభలో ఆయన ప్రకటించారు. అదే సమయంలో అసోం జాతీయ పౌరసత్వ జాబితాను తిరస్కరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి సంకల్పాన్ని చీల్చి చెండాడారు. అసోంలో ఎన్‌ఆర్‌సి తయారీ నిర్వాకం అత్యంత లోపభూయిష్టంగానూ అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో వడ్డించిన చందంగానూ ఉందని సందేహాతీతంగా రుజువైన తర్వాత అటువంటి విధి విధానాన్నే దేశ వ్యాప్తంగా చేపట్టదలచామని దేశీయాంగ మంత్రి పార్లమెంటు వేదిక మీద నుంచి జాతికి తెలియజేయడంలోని తెగువను ఏమనాలి? ఎన్‌ఆర్‌సి కల్లోలాన్ని దేశ మంతటా సృష్టించి తాము పరిష్కరించలేకపోతున్న అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరి కొంత కాలం పాటు మళ్లించాలనే దురుద్దేశమేదో ఆయన ప్రకటన వెనుక దాగి ఉన్నట్టు అనుకోడానికి ఆస్కారం కలుగుతున్నది.

అక్రమంగా చొరబడిన పొరుగు దేశాల పౌరుల వల్ల స్థానికులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించడానికి సరిహద్దు రాష్ట్రాలలో ఇటువంటి జాబితా సిద్ధం చేయడానికి, దేశ మంతటా దానిని చేపట్టడానికి చాలా తేడా ఉంది. ఆసేతు సీతాచలం ఎన్‌ఆర్‌సికి సమకట్టడమంటే ప్రశాంతమైన సరోవరంలో అపరిమితమైన అలజడిని సృష్టించడమే. ఎటువంటి అధికారిక పత్రాలను భద్రపరుచుకునే అలవాటుగాని అందుకు తగిన సౌకర్యాలుగాని ఉండని నిరక్షరాస్యులైన అసంఖ్యాక పేదలను భయభ్రాంతులను చేయడమే అవుతుంది. ప్రభుత్వానికి అటువంటి అగత్యం ఎందుకు కలిగినట్టు? ‘దేశ వ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి తయారీకి తలపడడమంటే మన సామాజిక పొందికకు ప్రళయాన్ని ఉద్దేశించడమే, సెక్యులర్, ప్రజాస్వామిక భారతావనికి ఉన్న మంచి పేరును చెరపదలచడమే’ అని ప్రఖ్యాత మానవ హక్కుల ఉద్యమకారుడు హర్ష్ మందెర్ చేసిన హెచ్చరిక గమనించదగినది.

అసోంలో ఎన్‌ఆర్‌సి వల్ల కలిగిన కష్టాలు చూసి వచ్చానని పౌరసత్వ బిల్లుకు సవరణ తెచ్చి దేశమంతటా అటువంటి జాబితాను చేపట్టడమంటే రాజ్యాంగం హామీ ఇస్తున్న సమానత్వ సూత్రానికి తూట్లు పొడవడమే కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌ల నుంచి వచ్చే మతపరమైన మైనారిటీలకు చెందిన శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తూ చట్టానికి సవరణ తీసుకురాగలమని కూడా అమిత్ షా ప్రకటించారు. అంటే ఆ మూడు దేశాల నుంచి వచ్చే హిందువులను ఇతర ముస్లిమేతరులను మాత్రమే పౌరులుగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. ఆ మూడింటి నుంచిగాని మయన్మార్ నుంచి ప్రాణాలరచేత పెట్టుకొని వచ్చిన రోహింగ్యాల వంటి ముస్లింలనుగాని భారత పౌరులుగా పరిగణించడానికి సిద్ధంగా లేమని పరోక్షంగా అమిత్ షా తెలియజేశారు. ఇది భారత రాజ్యాంగం అభయమిస్తున్న సర్వసమానత్వ సిద్ధాంతానికి విరుద్ధమైనది.

కేవలం ఒక మతం వారిని లక్షంగా చేసుకొని జాతీయ పౌరసత్వ జాబితాను తయారు చేయబోతున్నారని బోధపడుతున్నది. ఇది తన హిందూత్వ వ్యూహానికి ఉపయోగపడుతుందని పాలక భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉండవచ్చు. ఇటువంటి చర్యల ద్వారా హిందూ మెజారిటీని మరింతగా అనుకూలం చేసుకొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని అది ఆశిస్తూ ఉండవచ్చు. కాని ఇంత కాలం దేశం నిర్మించుకున్న సెక్యులర్ ప్రజాస్వామిక స్వరూపానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. భిన్న వర్గాల ప్రజల మధ్య వర్థిల్లుతున్న సహజీవన సిరి దెబ్బ తింటుంది. అసోంలో ఖరారు చేసిన ఎన్‌ఆర్‌సి వల్ల 19 లక్షల మందికి పైగా అక్కడి పౌరులు భారత పౌరసత్వాన్ని కోల్పోయారు. తమ పరిస్థితి ఏమిటో తెలియక వారు తల్లడిల్లుతున్నారు.

కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వారిని ఏమి చేయాలో తెలియక ఆ రాష్ట్ర ప్రభుత్వం తల పట్టుకొని కూర్చున్నది. చిరకాలంగా దేశంలో ఉంటున్న అర్హులైన పౌరులను జాబితా నుంచి తొలగించి అనర్హులను చాలా మందిని చేర్చారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జాబితాను నిరసిస్తున్న తిరస్కృతులు ట్రిబ్యునల్స్ వద్ద మళ్లీ దరఖాస్తులు చేసుకోడానికి ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం వారి హోదా ఏమిటో వారి పట్ల ఏ విధానాన్ని పాటించాలో తెలియని గందరగోళం ఏర్పడింది. దేశమంతటా ఇదే అయోమయ స్థితిని అమిత్ షా కోరుకుంటున్నారా? సమగ్రమైన పునః పరిశీలన జరిపి ఈ అనుచిత సంకల్పాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం విరమించుకుంటే మంచిది.

Amit Shah says NRC applies across India