న్యూఢిల్లీ: భారత గడ్డపై జరుగనున్న చారిత్రక డే నైట్ టెస్టు మ్యాచ్ సమరానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరుకానున్నారు. ఈ నెల 22 నుంచి భారత్బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్‌కతాలో ని ఈడెన్ గార్డెన్స్‌లో డేనైట్ టెస్టు మ్యాచ్ జరుగనుంది. భారత్‌లో డేనైట్ టెస్టు జరుగడం ఇదే తొలిసారి. ఈ చారిత్రక టెస్టు మ్యాచ్‌కు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అమిత్‌షా కూడా ఈ మ్యాచ్‌ను చూసేందుకు వస్తున్నారు.
ఈ విషయాన్ని బెంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శి అవిషేక్ దాల్మియా వెల్లడించారు. ఆయ న రాజధాని ఢిల్లీలో మంత్రి అమిత్‌షాను కలిసి మ్యాచ్‌ను చూసేందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అమిత్‌షా సానుకూలంగా స్పందించారు. కాగా, డేనైట్ క్రికెట్‌ను పురస్కరించుకుని బెంగాల్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో భారత క్రీడా ప్రముఖులను సత్కరించనున్నారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స్టార్ షట్లర్ పి.వి.సింధు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా, బాక్సింగ్ క్వీన్ మేరీకోమ్ తదితరులను సన్మానించనున్నారు.
Amit Shah To Attend Historic Day Night Cricket Test