Home ఎడిటోరియల్ కాంగ్రెస్ ‘అధినాయక’ సంస్కృతికి ప్రతిబింబం అమిత్ షా రెండవ పదవీకాలం

కాంగ్రెస్ ‘అధినాయక’ సంస్కృతికి ప్రతిబింబం అమిత్ షా రెండవ పదవీకాలం

amith-shahభారతీయ జనతాపార్టీ అధ్యక్షునిగా అమిత్ షా రెండవ పదవీకాలం పొందటం పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ కంట్రోలును నిస్సందేహంగా తెలియచేస్తున్నది. గత ఆదివారం షా ఎన్నిక పాలకపార్టీ, ప్రభుత్వం మధ్య పూర్తి ఏకీభావంతో పనిచేస్తాయని సూచిస్తున్నది. బిజెపి, ‘నాయకునికి’ పూర్తిగా లోబడి ఉంటుంది. ఆయన ప్రత్యక్షంగా లేదా రిమోట్ కంట్రోల్ ద్వారా దాన్ని నడిపిస్తాడు. ఇక్కడ, పార్టీపై పూర్తి నియంత్రణకు మోడీ ‘గాడ్జెట్’ షా.
పార్టీని తన వ్యక్తిగత, రాజకీయ ఎజండాకు తోకగా మార్చుకున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీ అని అనలేము. ఇందిరాగాంధీ యాభై ఏళ్లక్రితం 1966 జనవరిలో తొలిసారి ప్రధానమంత్రి అయినాక క్రమంగా ప్రభుత్వం, పార్టీ రెండింటిని తన అజమాయిషీలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రధానులందరూ (ఇద్దరే – రాజీవ్‌గాంధీ, పి.వి.నరసింహారావు) పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. బిజెపి ఒక వ్యక్తి – ఒక పదవి సూత్రం పాటిస్తున్నందున అతల్ బిహారీ వాజ్‌పేయి ఆ పదవిలో ఉండలేకపోయారు. పార్టీ అధ్యక్షునిగా ఎల్.కె.అద్వానీ తప్పుకున్నాక, కుశభావ్ థాక్రేని అధ్యక్షుణ్ణి చేశారు. పార్టీని వాజ్‌పేయి కంట్రోల్ చేయటం మొదలుకాగానే, 1999 అక్టోబర్‌లో ప్రధానిగా తిరిగి ఎన్నికైనాక, ఆయన బంగారు లక్ష్మణ్‌ను అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టారు. పార్టీని నియంత్రించటంలో వాజ్‌పేయి స్టాలినిస్టు స్థాయిలకు చేరలేకపోయాడు. అయితే మోడీ మొదటినుంచీ ఆ పనిచేశారు. ఇప్పుడది మళ్లీ పునరు ద్ఘాటన పొందింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బిజెపి విజయం సాధించగానే, రాజ్‌నాథ్‌సింగ్ మంత్రివర్గంలో చేరటంతో పార్టీ అధ్యక్షపదవిని ఎవరు చేపట్టాలని సంఘ్‌పరివార్ లోపల చర్చలు జరిగాయి. ఆ సమయంలో జె.పి. నడ్డా పేరు ముందుకొచ్చింది. ఆయన విద్యార్థి దశనుంచి క్రియాశీలంగా ఉన్నందున ఆర్‌ఎస్‌ఎస్ తోడ్పాటు, వివాదరహిత గతం – అన్నీ అనుకూలం గా ఉన్నాయి. ఆయన మోడీకి కూడ పాత విధేయుడు. మోడీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ వ్యవహారాలు చూచే టప్పుడు నడ్డా ఆ రాష్ట్ర యూనిట్‌లో పనిచేశాడు. అయితే మోడీ తన అభిప్రాయం వెల్లడించినపుడు – విధేయతలో, ఫలితాలు సాధించటంలో షా స్కోరు చేశాడు – ఆ పేరును వ్యతిరేకించినవారు బహుకొద్ది మందే. ఆ విధంగా, జిత్తులమారి, అహంభావి, నిర్దాక్షిణ్యు డుగా పార్టీలోపల, వెలుపల ప్రత్యర్థులు పరిగణించే అమిత్‌షా అధ్యక్షుడైనాడు.
సోహ్రాబుద్దీన్, స్నూప్ గేట్
మోడీ ఎదుగుదలలో షా ప్రాముఖ్యతను అవగా హన చేసుకోవాలంటే, సోహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో షా పై సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేసిన 2010 జులై కాలాన్ని ఎవరైనా గుర్తు చేసుకోవాలి. అతను అరెస్టయి, అనేకమాసాలు జైల్లో ఉన్నాడు. షా కేసు దర్యాప్తుల్లో చిక్కుకునేవరకు, మోడీని అంతిమంగా ఢిల్లీకి చేర్చే ప్రయాణంలో అతను అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించ బడ్డాడు. మోడీ కేంద్ర రాజకీయాల్లోకి వచ్చాక అతడు గుజరాత్ ముఖ్యమంత్రి అవుతాడని స్థూల ఏకాభిప్రాయం కూడా ఉండింది.
2013 నవంబర్‌లో ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీపేరు ప్రకటించబడినాక, పార్టీ ప్రధాన కార్యదర్శిగా అత్యంత ప్రధానమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ప్రచార బాధ్యతలను షా చేపట్టటంతో వారిరువురి సహవాసం ఎంత గట్టిదో వెల్లడైంది. షా గుజరాత్ హోంమంత్రిగా ఉండగా గుజరాత్‌లో, బెంగళూరులో సైతం సంచారం చేస్తున్న ఒక స్త్రీ ఫోన్‌ను టాప్ చేయాల్సిందిగా షా ఉత్తర్వు చేశారన్న కథ ఈ సమయంలోనే వెలుగుచూసింది. ఆమె మోడీని కూడా కలిసి మాట్లాడినందున, ఆ మహిళపై నిఘా పెట్టటంలో మోడీకి ఆసక్తి వుందన్న కథనాలు విపించాయి. అయితే మోడీ ప్రభుత్వం అధికారం లోకి రాగానే, షా పైఉన్న కేసులన్నీ -సోహ్రా బుద్దీన్ కేసుసహా – ఒక్కొక్కటిగా కుప్పకూలాయి. స్నూప్ గేట్‌గా పిలవబడిన ఈ కేసు కూడా -ఆ మహిళ, వారి కుటుంబం నుంచి సానుకూల ప్రకటనలు తీసుకున్నాక మూసివేయబడింది.
2010 నుంచి 2012 మధ్యకాలం షా రాజ కీయ జీవితంలో అత్యంత కష్టకాలం కాగా, 2012 సెప్టెంబర్ తో మొదలిడి-సోహ్రాబుద్దీన్ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు బెయిలిచ్చింది, గుజరాత్ సందర్శనకు అనుమతి ఇచ్చింది – 2015 తొలి మాసాలవరకు అతనిది స్వర్ణయుగంగా చెప్పవచ్చు.
ఈ కాలంలో గుజరాత్ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికైనాడు. బిజెపి ప్రధాన కార్యదర్శిగా నియమి తుడై ఉత్తరప్రదేశ్‌లో ఇన్‌ఛార్జి బాధ్యతలు స్వీకరిం చాడు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి మెజారిటీ సాధించి మోడీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ప్రకటించ బడ్డాడు. ఆ తదుపరి మాసాల్లో కూడా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ-కాశ్మీర్ ఎన్నికల్లో బిజెపికి మంచి ఫలితాలు సాధించాడు. ‘ఒంటరిగా పోటీ’ వాదనను ప్రతిపాదించింది అతడే. జమ్మూ-కాశ్మీర్‌లో ‘మిషన్-44’ నెరవేరకపోయినా తొలిసారి బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయింది. ఆయనకు హస్తవాసిఉంది, పట్టుకున్నదేదీ నెరవేరక పోదన్న భావన ఏర్పడింది.
2014 చివరకు, గుసగుసలు మొదలైనాయి. అతని అహంభావం పార్టీ సర్కిల్స్‌లో చర్చనీయాంశ మైంది. పార్టీ అధ్యక్షపదవిని మధ్యస్థాయి నాయకు లకు, కార్యకర్తలకు దూరం చేశారు; నిర్ణయాలను కూడా సంప్రదింపుల ద్వారా తీసుకోకుండా ఆదేశాలు జారీ చేస్తున్నాడన్నవి ప్రధాన అభియో గాలు; ఢిల్లీ, బీహార్ ఎన్నికల పరాజయాలను ఈ రెండు లక్షణాలకు ఆపాదించారు. నిందను మోడీపై పెట్టటానికి ఎవరూ సిద్ధంగా లేరు.
బీహార్ ఓటమి తర్వాత తుపానును షా తట్టుకున్నాడు; మోడీ కాలంలో అదే తొలి తిరుగు బాటు. ఏదిఏమైనా, మోడీ తన మిత్రునికి రెండవ పదవీకాలం సాధించారు. ఏదో కొంత ఇచ్చి-పుచ్చు కునే పద్ధతిలో ఇది జరిగినట్లు కనిపిస్తున్నది. షా రెండవ పదవీకాలం కర్తవ్యం స్పష్టం. తీరు మార్చు కోవాలి. పార్టీలో అభిమానం సంపాదించు కోవాలి. బిజెపి సాంప్రదాయం, రాజకీయ తాత్వికత కాంగ్రెస్ ‘అధినాయక’ సంస్కృతికి భిన్నమైంది. ఈ వాస్తవి కతను గ్రహించి, పాటించగల తన సమర్థత పైనే షా సాఫల్యం లేదా వైఫల్యం ఆధారపడి ఉంటుంది.
రచయిత ః నరేంద్రమోడీ జీవిత చరిత్ర రచించారు.
ఆయన తాజా పుస్తకం – సిక్కులు, 1984,
విస్మృత ఆవేదన.
Email: nilanjan.mukhopadhyay@ gmail.com