Home ఆఫ్ బీట్ ప్రకృతి పండుగ తీజ్

ప్రకృతి పండుగ తీజ్

Extraordinary festival that takes place between the tailgates

ఆగస్టు నెల రెండవవారం నుంచి నెలాఖరు వరకు తెలంగాణాలోని లంబాడీలు, బంజారాల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే తీజ్ పండుగను జరుపుతారు. ఇదొక ప్రకృతి పండుగ. తొలకరి చినుకుల మధ్య జరిగే అపురూప పండుగ.

తొమ్మిది రోజులు నిష్టతో …
”తీజ్ అంటే, పచ్చని గరికలా ఉండే గోధుమ నారు అని అర్థం. ఈ పండుగను వివాహం కావాల్సిన లంబాడీ యువతులు జరుపుకుంటారు. వీరు తొమ్మిది రోజులు నిష్టతో ఉండి రోజుకు ఒక పూట శాకాహారం తీసుకుంటారు. భక్తిశ్రద్ధలతో వీరి కుల దేవతలైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, దండీ మేరమయాడీలను పూజిస్తాం. మా సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతిరోజూ ఆడి,పాడి తొమ్మిదవ రోజు చెరువులో నిమజ్జనం చేస్తాం. ” అని మనతెలంగాణతో ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌జిల్లా) జంగూ బాయి తెలిపింది.

గిరిజన జాతుల్లో అధికశాతం ఉన్న లంబాడీలది ప్రత్యేక సంస్కృతి. వైవిధ్యమైన వేషధారణతో వీళ్లు అతి తక్కువ మంది దేవతలను పూజిస్తారు. అరుదుగా పండుగలను జరుపుకుంటారు. అందులో ఒకటి తీజ్. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వీరు ఎన్ని ఇబ్బందులున్నా తీజ్ పండుగను సందడిగా నిర్వహించుకుంటామని, ’తీజ్ ’ విశిష్టతను ఆదిలాబాద్‌జిల్లాకు చెందిన కొందరు గిరిజనులు మనతెలంగాణ ప్రత్యేక ప్రతినిధికి వివరించారు.

తీజ్ అంటే… బంజారాలకు ఏడుగురు దేవతలున్నారు. వారు తీజ్ బం జార, హింగళ, మోరామ, తోల్జా, ధ్వాలంగన్, కేంకాలి, మసూరి. కన్నె పిల్లలు ప్రధానంగా పెద్దల ఆశీస్సులతో జరిపే పండుగ తీజ్. పెళ్ళీడు అమ్మాయిల నాయకత్వంలో మిగతా అమ్మాయిలు కలిసి భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తీజ్ దేవత పంటలను, ప్రకృతిని కాపాడుతుంది అని గిరిజనుల విశ్వాసం.
మాతృస్వామ్య వ్యవస్థ.. ఈ గిరిజనుల్లో ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ బలంగా ఉండేది. దానికి నిదర్శనంగా వారికి ఏడుగురు స్త్రీ దేవతలున్నారు. ఈ స్త్రీ దేవతల పేర్ల మీదుగానే వీరు పండుగలు నిర్వహిస్తారు. మెరామ్మ, తీజ్, మత్రాల్, సీత్ల అనేవి బంజారాలకు ప్రధానమైన పండుగలు. మెరామ్మ దేవత తండాను రక్షిస్తుందని నమ్ముతారు. సీత్ల అనే దేవత పశు సంపదను వృద్ధి చేస్తుంది. మత్రాల్ పేరుగల దేవత పిల్లలకు ఎటువంటి రోగాలు రాకుండా చూస్తుంది. వీరిని గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, ముత్యాలమ్మ దేవతలతో పోల్చవచ్చు. గ్రామ రక్షణను ఈ దేవతలు నిర్వర్తించే పాత్రను బంజార దేవతలు తండాను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

తీజ్ ప్రత్యేకత.. పండుగ మొదలైన రోజు రాత్రి నుంచి అమ్మాయిలు తమ తండా నాయకుని ఇంటి ముంగిట్లో వారం రోజులపాటు ఆనందోత్సాహాలతో ఆటలు, పాటలు నృత్యం చేస్తూ గడుపుతారు పెళ్ళికాని అమ్మాయిలు ప్రతి ఇంటికి సోలెడు అరకిలో బియ్యం చొప్పున పోగుచేసుకొని వాటిని తండా నాయకునికి ఇస్తారు. ఆ నాయకుడు తన తోటి నాయకుణ్ణి పిలిపించి ఆ బియ్యాన్ని అమ్ముకొని గోధుమలు, శెనగలు తెమ్మంటాడు. ఆ గోధుమలను కన్నెపిల్లలు, స్త్రీలు తండా నాయకునితో పాటు తండా పెద్దల సమక్షంలో పాటలు పాడుకుంటూ ఇత్తడి బిందెలో నానబెడతారు. తరువాత రోజు సాయంకాలం అమ్మాయిలంతా కలిసి ఇంటింటికి పోయి గోధుమలు చల్లుదామని అందరికీ చెబుతారు. అప్పుడు తండా ప్రజలంతా ప్రతి ఇంటి నుంచి ఒక బుట్టను తయారు చేసుకొని ఆవు ఎరువును తమ తమ బుట్టలలో వేసుకొని కుటుంబ సమేతంగా నాయకుని ఇంటి ముందుకు వస్తా రు. ఆ బుట్టలను ఒకే చోట వరుస క్రమంలో పెట్టి నానబెట్టి గోధుమలను బుట్టలో చల్లుతాడు. అతను గోధుమలు చల్లుతున్నపుడు చుట్టూ కూర్చున్న అమ్మాయిలు, స్త్రీలు పాటలు పాడుతారు.

తొమ్మిది రోజులపాటు .. ఈ కార్యక్రమాలన్నింటికి ఒక అమ్మాయి నాయకురాలిగా వ్యవహరిస్తుంది. ఆ మె తొమ్మిది రోజులపాటు ఆకుకూరలు తింటూ శుచిగా ఉంటుంది. కన్నె పిల్లలు కలిసి బావి దగ్గరికి వెళ్ళి పరిశుభ్రమైన ఇత్తడి బిందెల్లో నీళ్ళు తెచ్చి పాటలు పాడుతారు. తరువాత గోధుమలు చల్లిన బుట్టలను తండా నాయకునికి ఇంటిముంగిట్లో అరుగుపై కానీ, వేదికపై గానీ పెడతారు. మరుసటి రోజు నుంచి తొమ్మిది రోజులపాటు రోజుకు మూడుసార్లు అమ్మాయిలు బుట్టల్లో నీళ్ళు పోస్తు పాటలు పాడుతారు. తీజ్ పండుగను సేవాభాయ దండియాడి అనే దేవత జరిపిస్తుందని, తీజ్ బుట్టలను పెట్టించిన దేవతనే స్వయంగా ఈ పండుగను జరిపిస్తుందని వారు విశ్వసిస్తారు.ఏడవ రోజు ఢమోళి అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతి ఇంట్లో బియ్యం పిండితో చుర్మో రొట్టెలు చేసి వాటిని బెల్లంతో కలిపి ముద్దలు చేస్తారు. మరోవైపు తీజ్‌వున్న ఇంటి ఆవరణలో సేవాభాయ, మెరామల పూజలు నిర్వహిస్తారు.

మెరామల పూజ ఇంటి ముందు జొన్నలు నింపిన గోనే సంచులు ఉంచి,దానిపై ఒక చిన్న బిందెలో నీళ్ళు పోసి అందులో వేపమండలు వేస్తారు. మేకపోతులను తెచ్చి గోనెసంచులకు ఎదురుగా నిలబెట్టి దాని తలకు కాళ్ళకు పసుపు రాస్తారు. నోటిలో నీళ్ళు పోస్తారు. మెరామతల్లికి బలి ఇవ్వడం లంబాడీల ఆచారం.

సేవాబాయి పూజ మెరామల పూజ జరిగిన చోటుకు కొంత దూరంలో సేవాభాయ పూజ చేస్తారు. ఈ పూజను కడావో అంటారు. సేవాభాయ శాకాహారి. దీర్ఘ చతురస్రాకారములో గొయ్యి తీసి అందులో కట్టెలు పెట్టి మంట చేసి ఒక పెద్ద గిన్నెలో కడావ్ వండుతారు. కడావ్ సిద్ధ్దమైన తరువాత తమ తమ ఇండ్లలో తయారు చేసిన బెల్లం, రొట్టెలు కలిపిన ఏడు ముద్దలను మహిళలు ఒక పల్లెంలో పెట్టుకొని వచ్చి తండా నాయకుని ఒడిలో పెడతారు. అప్పుడే సేవాబాయి కడావ్ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఎనిమిదవరోజు సాయంత్రం గణగోర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తండాలో నాయకుని అనుమతితో అమ్మాయిలంతా కలిసి చెరువు దగ్గరికి వెళతారు. నల్లరేగడి మట్టిని తీసుకొని తండాలోని అనుభవజ్ఞురాలు దగ్గరకు వెళతారు. ఆమె చెరువు మట్టితో ఒక ఆడ బొమ్మను మరొక మగ బొమ్మను తయారు చేస్తుంది. ఆడబొమ్మకు లంబాడీ వివాహిత వేసుకొనే సంప్రదాయ వస్త్రాలు పేట్య, చాంకలి, టుక్రిలను చిన్నగా తయారుచేసి ఆడబొమ్మకు, లంబాడి పురుషుడు ధరించే వస్త్రాల వంటివి మగ బొమ్మకు తొడిగిస్తుంది.

ఉయ్యాల ఆట పాటలు తొమ్మిదవ రోజు కన్నెపిల్లలు ఉదయం అందరూ కలిసి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఉయ్యాల ఆట ఆడుతారు. పాటలు పాడుతూ ఆ రెండు బొమ్మలను ఉయ్యాలలో కూర్చోబెట్టుకొని ఉయ్యాలలో ఊగుతూ పాటలు పాడుతారు.
బోరడి ఘష్కేరో బోరడి అంటే రేగుముళ్ళనీ, ఘష్కేరో అంటే గుచ్చడం అని అర్థం. అమ్మాయిలు రేగు ముళ్ళకు నానబెట్టిన శనగల్ని గుచ్చుతారు. రేగుముళ్లకు గుచ్చిన శనగల్ని యువకులు రాల్చడంతో కార్యక్రమం ముగుస్తుంది.
గణగోర్ దీన్ని శివపార్వతుల ప్రతిరూపంగా భావిస్తారు. నిమజ్జనానికి ముందురోజు పుట్టి మట్టిని తెచ్చి రెండు విగ్రహాలను తయారు చేస్తారు. పూజారులైన ఆడపిల్లలు హోమంలో నైవేద్యాన్ని సమర్పిస్తారు.

ఢమోళీ ప్రతి ఇంటి నుంచి బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేసిన తీపి పదార్థాలు పెద్ద పాత్రలో వేసుకుని తలపై ప్రత్యేకంగా అలంకరించిన చుట్టబట్టపై పట్టుకుని,అలంకరించిన అద్దాలు, గవ్వలు, పూసల తో తయారుచేసిన పాత్రపై కప్పుకుని తీజ్ నెలకొల్పిన పెద్దాయన ఇంటికి వస్తారు.

నిమజ్జనం తీజ్ బుట్టల్ని నీళ్ళలో వదిలే ఆచారం ప్రకారం తండా నాయకుని ఆజ్ఞ మేరకు నది లేదా వాగు సమీపానికి డప్పులు వాయిస్తూ పాటలు పాడుతూ,నృత్యం చేస్తూ ఊరేగింపుగా బయలుదేరుతారు. కొంతమంది యువకులు తీజ్ తెంచిన బుట్టలను తీసుకొస్తారు. వారి పాదాలను సోదరులు కడుగుతారు. ఎవరికి తోచిన డబ్బులు చెల్లెళ్ల చేతుల్లో పెట్టి ఓదార్చుతారు. ఆ తర్వాత మళ్ళీ డప్పులు వాయిస్తూ … ‘ఘేవూలారయే తోన శారేతీ మంగాయీ ఘేవూలారయేతోన టపారే మా గోకి’ అని పాటలు పాడుతూ ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. దీంతో తీజ్ పండుగ ముగుస్తుంది. ’తీజ్ ’ అంతరించి పోతున్న గిరిజన సంస్కృతి. దీనిని అపూర్వంగా కాపాడుకోవడానికి తెలంగాణ అడవి బిడ్డల ప్రతీ ఏటా భక్తిగా ప్రయత్నిస్తారు.

                                                                                                          – శ్యాంమోహన్, మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి