*1.42 కోట్ల ఎకరాలకు సంవత్సరానికి ఎనిమిదేసి వేల రూపాయలు
*వ్యవసాయశాఖ ప్రాథమిక లెక్క, ప్రత్యేక సాగు బడ్జెట్‌కు రూ.15 వేల కోట్లు?
మన తెలంగాణ/ హైదరాబాద్ : రైతులకు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకానికి ఏటా రూ. 11,370.26 కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. రైతు సమగ్ర సర్వే, భూ ప్రక్షాళనలో వెల్లడైన వివరాల ఆధారంగా పెట్టుబడి పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన మొత్తాన్ని లెక్కగట్టింది. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిన ట్లు తెలిసింది. అంతే కాకుండా మార్చిలో తొలిసారిగా ప్రవేశపెట్టనున్న వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్ రూ.15 వేల కోట్లుగా ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. రైతులు వ్యవసాయాని కి సంబంధించిన పెట్టుబడి వనరులు (విత్తనాలు, ఎరువులు, కొంత మొత్తం కూలీలకు) సమకూర్చుకునేందుకు అవసరమైన సొమ్మును ఎకరాకు రూ. 4 వేల చొప్పున వానకాలం, యాసంగిలలో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. దీనిని మే 15 నుండి అమలు చేయనున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గత జూన్‌లో రైతు సమగ్ర సర్వే చేపట్టింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1.23 కోట్ల ఎకరాల సాగుకు యోగ్యమైన భూములు ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రభుత్వం పాత అంచనా ప్రకారం 1.55 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. భారీ వ్యత్యా సం రావడంతో ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూప్రక్షాళన చేపట్టింది. అందులో 1, 42,12,816 ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉందని తేల్చారు. ఇదే విషయాన్ని సిఎం కె. చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రకటించారు. ఈ వివరాల ప్రకారం వ్యవసాయ శాఖ పెట్టుబడి పథకానికి సంబంధించి ప్రాథమిక అంచనాల మేరకు రూ. 11,370.26 కోట్లు అవుతాయని, ఒకవేళ మొత్తం 1.55 కోట్ల ఎకరాల సాగు భూమిని పరిగణనలోకి తీసుకుంటే రూ. 12,400 కోట్లు అవసరమౌతాయని అధికారులు చెబుతున్నారు. వివాదాలు లేని భూముల లెక్కలు కూడా తేలితే కొంత మొత్తం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్ ప్రతిపాదనల్లో మిగతా పథకాలకు తక్కువ మొత్తంలోనే కేటాయించనున్నట్లు తెలిసింది. ఇందులో వ్యవసాయ యాంత్రీకరణ వంటి ముఖ్యమైనవి ఉన్నాయి.
పథకం అమలుకు పరిమితులు తప్పవా : పెట్టుబడి సొమ్మును ఏ విధానంలో పంపిణీ చేయాలి? సాగు భూమిని తేల్చడం వంటివి నిర్ధారించడానికి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సిఎం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ ఉప సంఘం చేసిన సిఫార్సులకు అనుగుణంగా పథకం అమలు కానున్నట్లు తెలిసింది. పెట్టుబడి పథకానికి భారీ మొత్తంలో నిధులు అవసరమౌతాయని, కొన్ని పరిమితులు విధిస్తే మేలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందులో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘం వేసినట్లు సమాచారం. ఏకంగా రూ. 11,370 కోట్లు పంపిణీ చేయడం అంత సులువు కాదని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.