Thursday, April 25, 2024

వచన కవితా వైతాళికుడు వాల్ట్ విట్మన్

- Advertisement -
- Advertisement -

Analysis of Walt Whitman's I am the poet of the Body

విట్మన్ కు భాషపై ఉన్న ప్రేమ అపారం. అతనికి పదాలంటే కేవలం కాగితం మీద పొడి అక్షరాల పొందికకాదు. అవి అతనికి ‘three dimensional physical objects’. చేత్తో పట్టుకుని ఇష్టానుసారం మలచుకో కలిగే ఘనపదార్థాలు. పదాలు శబ్దసౌందర్యంతో, శ్రావ్యసొబగులతో నర్తించే సజీవ భౌతిక రూపాలు. అతని కవిత్వంఅంటే సరళమైన భాష, జటిలమైన భావుకత. పన్నెండు కవితలతో మొదలైన అతని Leaves of Grass ను తొమ్మిదిసార్లు పునరుద్ధరించాడు

I am the poet of the body, and I am the poet of the soul – Whitman. నేను దైహిక కవిని, నేను ఆత్మిక కవిని. నేను గొంతెత్తుతున్నాను నా దేహం కోసం, నా ఆత్మ కోసం. నేనుపుడమి పాటను – అంటున్నాడు అమెరికన్ వచనకవితాపిత వాల్ట్ విట్మన్. అతను అతీంద్రియ వాదాన్ని(transcendentalism), వాస్తవికవాదాన్ని (realism) తన కవిత్వంలో సమన్వయించుకున్న మానవతావాది. Leaves of Grass అతని సర్వోత్కృష్ట కవితా సంపుటి (Magnum Opus). విట్మన్ న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐలాండ్ లో జన్మించి, 72 ఏళ్ళ వవయసులో న్యూజెర్సీ లోమరణించాడు. ఆర్థిక కారణాల వల్ల నాలుగవ ఏట అతని కుటుంబం బ్రూక్లిన్ కు మారింది. పదకొండవ ఏటనేస్కూల్ విద్యకు స్వస్తి పలికి ఉద్యోగంలో చేరాడు. ఆఫీస్ బాయ్ గా, క్లర్క్ గా, టీచర్ గా పనిచేశాడు. కొన్నాళ్ళు పత్రికాఆఫీసులలో అప్రెంటీస్ గా పని చేశాడు. అప్పుడే అతనికి కొంత సాహిత్య సహవాసం అబ్బింది. Samuel E Clements సంపాదకత్వంలో వెలువడుతున్న Patriot పత్రికలో పనిచేస్తూ ప్రూఫ్ రీడింగ్, టైప్ సెట్టింగ్నేర్చుకున్నాడు. జర్నలిస్ట్ గా ఎదిగాడు.

అమెరికన్ సివిల్ వార్ (1861 – 1865) వచ్చినప్పుడు వాషింగ్టన్ కు వెళ్ళిశతగాత్రులకు సేవలందించాడు. అతని బాల్యం సుఖప్రదంగా గడవలేదు. బ్రూక్లిన్ లో ఉన్నప్పుడు తరచుగాలైబ్రరీలకు వెళ్ళడం, సాహిత్య డిబేట్లలో పాల్గొనడం, నాటకప్రదర్శనలలో పాలుపంచుకోవడం వల్ల క్రమంగాఅతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ సమయంలో, ఆతని 16 ఏట, అనామకుడిగా అతని కొన్ని రచనలుప్రచురించబడ్డాయి. జీవితంలోని అనేక ఆటుపోట్లను అధిగమించి, Aurora, Brooklyn Eagle వంటి పత్రికలఎడిటర్ కాగలిగాడు. ఓపెరా ప్రదర్శనల నాటకీయతపై పలు సమీక్షలు రాసి పేరు పొందాడు. వచనకవిత్వంరాయడం అలవరచుకున్నాడు. ఓపెరా(Opera) అనుభవమే లేకుంటే Leaves of Grass రాయగలగడంసాధ్యమయ్యేదే కాదని చెప్పుకున్నాడు.

వాల్ట్ విట్మన్ Leaves of Grass ఎంత జనాదరణ పొందిందో అంత వివాదాస్పదం కూడా అయింది. అతనిది పేలవమైన అరుచి కవిత్వం అని Eliot అభిప్రాయ పడ్డాడు. ఆ గ్రంథం అశ్లీలంతో నిండి ఉందని కొందరునిరసిస్తే, అనేకులు అతన్ని Working class హీరో అని కొనియాడారు. దేహం కన్నా ఆత్మ ఉత్కృష్ట మైందనిప్రబోధంచే ప్రాథమిక నైతిక సూత్రాలను ధిక్కరించిన తొలి కవి అని కొందరు నర్మగర్భంగా వ్యఖ్యానించారు. The first man in history to speak with a truly continental American voice- Neruda. Leaves of Grass the most extraordinary piece of wit and wisdom – Emerson.

సమకాలీన భాషా రీతుల మీద విట్మన్ ప్రభావం అన్న అంశం మీద Carl Sandburg లు వ్యాసాలు రాశాడు. విట్మన్రాసిన కవితలు అన్ని రంగాలలో ఉన్న కళాకారులను ప్రభావితం చేశాయని Karen Karbeiener. గ్రీక్ Homer కుసహపంక్తి సరసన ఉండాల్సిన కవిత్వం అని Emerson. A Voice triumphant అని Ezra Pound. William Carlos William తన ప్రసిద్ధ వ్యాసం American Idiom లో విట్మన్ ప్రభావిత భాష పై విస్తృతంగా రాయడమే కాక, A passage to India అనే కవితను తన Sea Symphonyలో వాడుకున్నాడు. Starry Night పేంటింగ్ వేస్తూవిశ్వవిఖ్యాత Vangogh విట్మన్ భావుకతను ఆకాశానికి ఎత్తాడు. శాస్త్రీయ సంగీతంలోకీ అతని ప్రతిభ ప్రాకింది. Holst తన ఆల్బం Ode to death కొరకు When Lalilacs Last… కవితను ఎంచుకున్నాడు.

విట్మన్ కు భాషపై ఉన్న ప్రేమ అపారం. అతనికి పదాలంటే కేవలం కాగితం మీద పొడి అక్షరాల పొందికకాదు. అవి అతనికి ‘three dimensional physical objects’. చేత్తో పట్టుకుని ఇష్టానుసారం మలచుకో కలిగే ఘనపదార్థాలు. పదాలు శబ్దసౌందర్యంతో, శ్రావ్యసొబగులతో నర్తించే సజీవ భౌతిక రూపాలు. అతని కవిత్వంఅంటే సరళమైన భాష, జటిలమైన భావుకత. పన్నెండు కవితలతో మొదలైన అతని Leaves of Grass ను తొమ్మిదిసార్లు పునరుద్ధరించాడు;
ౄeath-bed edition 600 పేజీలకు విస్తరించింది. కవిత్వం రాయడం ఆలస్యంగాప్రారంభంచినా, అవసాన కాలం దాకా రచనా వ్యాపకాన్ని ఆపలేదు. అతని ఆఖరు కవిత A Thought of Columbus మరణానికి పది రోజుల ముందు రాసింది.
ఇవి వాల్ట్ విట్మన్ కొన్ని కవితలకు నా క్లుప్తీకృత అనువాద కవితా ఖండికలు. ( పూర్తి పాఠం నా అనువాదసంపుటి అనుస్వనం లో). One’s-Self I Sing లో అతను భావించే ఉదాత్త వ్యక్తిత్వ అస్తిత్వగానం ఇలాసాగుతుంది:
ఓ వ్యక్తి అస్తిత్వ గాయనం నా ఈ గానం.
స్వీయ వ్యక్తిత్వం, సామూహిక స్వేచ్ఛాతత్వం
కలిసి రూపొందిన ఒక సగటు మనిషిని
అభివ్యక్తీకరంచే సుశ్లోకం నా ఈ గానం.
నా ఆనంద గీతమాలికకు సరిపోవు
కేవలం అతని ఆపాదమస్తక అవయవ సౌష్ఠవాలు,
అతని సహజ ముఖకవళికలు, అతని మేధాసొగసులు.
నేను కీర్తిస్తున్నాను
ఓ నిండు మానవుణ్ని, ఓ స్త్రీసమేత పూర్ణ పురుషుణ్ని,
దైవ సమ్మతమైన స్వేచ్ఛా పరిధిలో ఉరకలేసే
జవసత్వాల సుఖసంతోషాల జీవన చైతన్యాన్ని.
అవును, నేను పాడుతాను
ఓ ప్రేమైక జీవుణ్ని, ఓ అధునిక మానవుణ్ని.

I hear America singing సరళ శైలిలో సాగిన సామాన్య అమెరికన్ జనజీవన ప్రతిబింబం:
వింటున్నాను
అమెరికా పాడుతున్న ఆహ్లాద గీతాలను;
మెకానిక్ లు, కార్పెంటర్లు, మేసన్లు, కళాసీలు, కార్మికులు,
రైతులు, చర్మకారులు, వడ్రంగులు –
అందరూ పాడుతున్న ఆనంద గానాలను.
పిల్లల తల్లులు, పంటకోతల పల్లెపడచులు,
కుచ్చు టోపీలకు జరీబుట్టాలు కుట్టే దర్జీ వనితలు –
అంతా పాడుతున్నారు రకరకాల పాటలను;
ఎవరి పాటలు వారివే!
పగలు పాడుతున్నది లేపొద్దు పదాలను,
రేయి పాడుతున్నది నైట్ పార్టీల బృందగానాలను;
వింటున్నాను పాట పాడుతున్న అమెరికాను.
In Cabin’d Ships at Sea; అతనికి ఆతని నావ అర్ణవ అదృష్ట రహస్యాలను విప్పి వినిపించే ఓ సాగర గీతాలపాటల పుస్తకం:
నలుదిక్కుల విస్తరించిన అసీమ నీలిమ,
అలల ఈలలు, రాచ కెరటాల రణనం, సాగర సంగీతం,
తెరచాపలెత్తిన ఆశావహ ఆనందం.
నీలి తరగల తడి పగళ్ళ లో, చిక్కని చీకట్ల చుక్కల రాత్రులలో
సాగుతున్నది నా పడవ ప్రయాణం.
ఓ పాటల పుస్తకమా! సాగించు
ఈ లవణ ధారలో నీ అక్షయ ప్రయాణాన్ని.
నీవు నన్ను
నా గమ్యానికి చేర్చే అక్షరాల పడవవు,
నీ పుటలలో ముడుచుకున్న అనురాగ సంపుటివి.
మరో ప్రఖ్యాత కవిత When Lilacs Last in the ౄooryard Bloom’d. ఇది Leaves of Grass ప్రచురించిన పదేళ్లకువెలువడిన 206 లైన్ల దీర్ఘకవిత. A long poem in Pastoral elegy:
నిన్నిలా వదిలేయాల్సిందేనా
నా ఇంటి మంగిట
ఓ నా గుండె రూపుల నీలి కలువా!
నీవు నిండు వసంతమై వచ్చే దాక?
ఇలా నడచిరావలసిందేనా
పడమటింటి నుండి
ఓ నా వెండి వెలుగుల శుక్రతారా!
నా పాట లోంచి, నా చూపు లోంచి?
O Captain! My Captain!:
ఓ నా కాప్టెన్!
మనభయానక నౌకాప్రయాణం ముగిసింది,
పడవ జలప్రళయాలను గడచి వచ్చింది,
భయదయానాలు చేసి జయధ్వానాలతో తిరిగొచ్చిన ఓడలో
ప్రాణ రహితంగా కాప్టెన్!
జన ప్రవాహాలు ముంచెత్తుతున్నవి, తీరాలు హోరెత్తుతున్నవి,
నేనేమో మృత్యుశీతల కాప్టెన్ కళేబరం పక్కన
విషాదాల పడవ నడవ మీద
నీరసంగా నిర్వేదంగా కాళ్ళీడ్చుకుంటూ కదలి పోతున్నాను.
( ఇది అబ్రహం లింకన్ హత్యానంతరం విట్మన్ రాసిన సంవేదనాత్మక స్మృతికావ్య గీతిక. ఇక్కడ ‘కాప్టెన్’ లింకన్కాగా, ‘పడవ’ ఆనాటి అమెరికా. ప్రతీకాత్మకమైన ఈ పద్యం విట్మన్ ప్రసిద్ధ కవితలలో ఒకటి.)
విట్మన్ నికార్సయిన ప్రజల మనిషి. అతని కవిత్వం ప్రజల భాష. అమెరికన్ వీధులను అందల మెక్కించిన తొలిఅమెరికన్ కవి. ‘Father of American Free verse poet’. అమెరికన్ వచనకవితా వైతాళికుడు వాల్ట్ విట్మన్!
నాగరాజు రామస్వామి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News