Home తాజా వార్తలు కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా అనంత నాగేశ్వరన్

కొత్త ప్రధాన ఆర్థిక సలహాదారుగా అనంత నాగేశ్వరన్

Anantha Nageswaran appointed chief economic advisor

 

నియమించిన ప్రభుత్వం

న్యూఢిల్లీ : బడ్జెట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ కొత్త ముఖ్య ఆర్థిక సలహాదారు(సిఇఎ)గా వి అనంత నాగేశ్వరన్‌ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారని ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ అధికారికంగా ప్రకటించింది. ప్రధాన ఆర్థిక సలహాదారుగా కెవి సుబ్రమణియన్ పదవీకాలం 2021 డిసెంబర్‌తో ముగిసింది. అప్పటి నుంచి ఈ స్థానంలో కొత్త సిఇఎని నియమించలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఈనెల 31న ప్రభుత్వం విడుదల చేయనున్న నేపథ్యంలో కొత్త సిఇఎ నియామకం జరిగింది. దీని తర్వాత ఫిబ్రవరి 1న బడ్జెట్ 2022ను కూడా ప్రవేశపెట్టనున్నారు.

అనంత్ నాగేశ్వర్ గురించి..
1985లో అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) నుండి ఎంబిఎ పొందారు. ఆ తర్వాత 1994లో మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుండి ఫైనాన్స్‌లో డాక్టరేట్ పట్టా పొందారు. స్విట్జర్లాండ్‌లోని అనేక ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూషన్‌ల పరిశోధనలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన ఐఎఫ్‌ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కి డీన్‌గా ఉన్నారు. ఇంకా కెఆర్‌ఇఎ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్‌గా చేశారు. నాగేశ్వర్ భారతదేశం, సింగపూర్‌లోని అనేక బిజినెస్ స్కూల్స్, మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా బోధించారు.