*భారీ సంఖ్యలో హాజరైన మేస్రం వంశీయులు, ఆదివాసులు
*భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్న అధికారులు
మన తెలంగాణ/ఇంద్రవెల్లి : ఆదివాసుల ఆరాధ్యమైన నాగోబా పూజలను మంగళవారం మెస్రం వంశీయులు ఘనంగా నిర్వహించారు. పుష్య మాసం ప్రారంభం నుండి మెస్రం వంశీయులు కేస్లాపూర్‌లో సమావేశమై జాతర ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ యేటా పుష్యమాస పౌర్ణమి నాడు నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు చేసి కేస్లాపూర్ నుండి జన్నారం మండల సమీపంలో ఉన్న గోదావరినదికి దాదాపు 120 కి.మీ. కాలినడక బయలుదేరారు. అక్కడి నుంచి పవిత్ర గంగాజలంతో తిరిగి ప్రయాణమై ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కేస్లాపూర్ బయలుదేరి మర్రిచెట్టు వద్ద బస చేసి మంగళవారం పుష్యమాస అమావాస్య పూర్తి కాగానే పవిత్ర జలంతో ఆలయాన్ని శుభ్రపరిచి భాజాభజంత్రీలు వాయిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. రాగి చెంబులో పాలను తీసుకొని మొలకలు, నవధాన్యాలు అన్నిటినీ కలిపి కొత్త రుమాలుతో కప్పి పుట్టపైన ఉంచుతారు. పుట్టమీది రుమాలు పైకెత్తినట్లు కన్పిస్తే నాగదేవత రాగి చెంబులోని పాలను తాగుతాడనే విశ్వాసం ఆదివాసులలో ఉంది. ఈ పూజ కార్యక్రమంలో మెస్రం వంశంలోని 22 తెగల పెద్దలు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పండగగా గుర్తించిన కేస్లాపూర్ నాగోబా జాతరలో భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు చొరవతో ఆలయ పరిసరాల్లో విద్యుత్ స్తంభాలు, తాగునీటి, స్నానపుగదులు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను ఆయా శాఖల అధికారులు ఏర్పాటు చేశారు.
తూం పూజలు(కర్మకాండ)
మేస్రం వంశీయుల్లోన్ని 22 తెగల్లో ఈ ఏడాది కాలంలో మృతి చెందిన పిత్రు దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలనే తూం పూజలు అంటారు.
భేటింగ్(పరిచయం)
మేస్రం వంశీయుల్లో 22 తెగలకు చెందిన మగవారిని పెళ్లి చేసుకున్న కొత్త కోడళ్ళు నాగోబా దేవత సన్నిధిలో భేటింగ్ (పరిచయం) ఆవుతారు. కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేసి ప్రత్యేక మొక్కులు తీర్చిన తర్వాత కుల పెద్దలను పరిచయం చేస్తారు. ఆ రోజు నుండి మేస్రం వంశ కోడళ్లుగా గుర్తింపు పొందడంతో పాటు కులదేవతైన నాగోబాను పూజించే అవకాశం కల్గుతుంది.
మండగాజలి(వేడుకలు)
మేస్రం వంశంలో మగవారు, ఆడవాళ్లు వేర్వేరుగా ఆటపాటలతో మండగాజలి అనే వేడుకను నిర్వహించి కర్ర సాముతో నృత్యాలు చేస్తారు. తర్వాత ఆలయానికి వెళ్లకుండా ఆలయం బయట నుంచి నాగోబాను మొక్కుకొని ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ బుడుందేవ్ జాతరకు ప్రయాణమవుతారు.