Home జాతీయ వార్తలు వాటా మీరిన ఎపి

వాటా మీరిన ఎపి

Story about Telugu Mahasabhalu 'Fermentation'

మనతెలంగాణ/హైదరాబాద్: ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన కోటాకు మించి నీటిని వాడుకున్నందువల్ల ఇకపైన ఒక్క చుక్క నీటిని కూడా వాడుకోవడానికి వీల్లేదని ఆ రాష్ట్ర ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రాసిన లేఖలో స్పష్టం చేసింది. గత నెల 10వ తేదీన రెండు రాష్ట్రాల తో కలిపి నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ 60 టిఎంసిలు, తెలంగాణ 50 టిఎంసి ల చొప్పున నీటిని వినియోగించుకునేలా ఒప్పందం కుదిరిందని, ఫిబ్రవరి 26వ తేదీ వరకు వాడుకోవాల్సినవాటా మీరిన ఎపి నీటి లెక్కలపై అంగీకారం కుదిరిందని, అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన కోటాకు మించి 2.324 టిఎంసిల నీటిని ఎక్కువగా వినియోగించుకుందని బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని వినియోగించుకోవడాన్ని ఆంధ్రప్రదేశ్ వెంటనే నిలిపివేయాలని, ఆగస్టు వరకు సాగునీటి, తాగునీటి వినియోగానికి సంబంధించి నిర్దిష్ట ప్రతిపాదనలతో తదుపరి సమావేశానికి రావాలని ఆయన కోరారు. గత నెల 8వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రిజర్వాయర్ల నుంచి 62.324 టిఎంసిల నీటిని వాడుకున్నదని, తెలంగాణ మాత్రం తనకు కేటాయించిన 50 టిఎంసిల కోటాలో కేవలం 33.504 టిఎంసిల నీటిని మాత్రమే వాడుకున్నదని, ఇంకా 16.493 టిఎంసిలను తెలంగాణ వినియోగించుకోవచ్చునని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 8 నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా 27.695 టిఎంసిలు, కృష్ణా డెల్టా స్కీమ్ ద్వారా 8.285 టిఎంసిలు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి 8.391 టిఎంసిల చొప్పున నీటిని వాడుకున్నదని, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 6.812 టిఎంసిలు, హంద్రీనీవా ద్వారా 11.142 టిఎంసిల చొప్పున మొత్తం 66.324 టిఎంసిలను వాడుకున్నదని బోర్డు సభ్య కార్యదర్శి స్పష్టం చేశారు. తనకు కేటాయించిన మోతాదుకు మించి ఎక్కువగా నీటిని వాడుకోవడాన్ని అనధికారికంగా హెచ్చు మొత్తంలో వాడుకున్న నీటిగానే పరిగణించాల్సి ఉంటుందని, తక్షణం ఈ రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుకోవద్దని తేల్చి చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులో రెండు వైపులా ఉన్న విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ద్వారా ఫిబ్రవరి 26 నాటికి మొత్తం 14.335 టిఎంసిల నీరు వినియోగమైందని, శ్రీశైలం కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అవసరాలకు నీటిని వాడుకోవడం ఈనెల 8న జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నారు. ఇంతకాలం తెలంగాణను తప్పుపట్టిన ఆంధ్రప్రదేశ్ తన కోటాకు మించి వాడుకున్నట్లు వివరాలతో సహా బోర్డు సభ్య కార్యదర్శి లేఖలో పేర్కొనడం గమనార్హం.