Home ఆఫ్ బీట్ ప్రేమపాశానికి బందీలు

ప్రేమపాశానికి బందీలు

మహారాష్ట్రలోని ఆదివాసులు ఎక్కువగా నివసించే ఒక గ్రామంలో ఉండే ఒక కుటుంబంవారు సేవా  కార్యక్రమాల్లో ముందుంటారు. సేవ అంటే మనుషులకు బట్టలు ఇవ్వడమో లేక ఇల్లులేని వారికి ఆశ్రయం కల్పించడం, తిండి లేని వారికి తిండి పెట్టడం లాంటివి కాదు. వేటగాని చేతిలో గాయపడి చావు బతుకుల్లో ఉండే నోరులేని మూగ జంతువులకు, అనారోగ్యంతో బాధపడే జంతువులకు వారు ఆశ్రయం కలిపిస్తుంటారు. ఆ కుటుంబం నీడన నెమ్మదిగా కోలుకుంటూ కనిపిస్తాయక్కడ జంతువులు. వాటిని అంత ప్రేమగా చూసుకునేదీ ఎవరో తెలుసా…. ఆదివాసీల గురించి ఆలోచించి వారి అభివృద్ధికోసం, విదేశాల్లో కోట్లు సంపాదించే ఉద్యోగావకాశాన్ని కాదనుకుని అడవిబాట పట్టిన ప్రకాష్ ఆమ్టే .

Animals

వందల సంఖ్యలో వన్యమృగాలకు ఆశ్రయం కల్పిస్తోన్న ప్రకాష్ ఆమ్టే యానిమల్ ఆర్క్‌ని స్థాపించాడు. మహారాష్ట్ర, గడ్డిరోలి దండకారణ్యం, హేమలకసా గ్రామంలోని ఆయన ఇంటికి ఆనుకునే ఉంటుంది జంతు ఆశ్రమం. అక్కడ వారి కుటుంబం మొత్తం ఈ జంతువులను తమ ఇంటి వాళ్లలాగా చూసుకుంటారు. చిన్న పిల్లలు కూడా పాములతో, పులులతో ఆడుకుంటారు. అక్కడ జంతువులు బోనులో ఉండవు. వాళ్ల ఇంట్లో అందరితో కలిసి తిరుగుతుంటాయి. ప్రకాష్ పులిని నిమరడం, హైనాను ముద్దు పెట్టుకోవడం, అడవి బల్లి ఆయన భుజమెక్కి ముక్కును ముద్దాడుతుండే సన్నివేశాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి.
కొన్ని సంవత్సరాల క్రితం హేమలకసాలో ఆమ్టే దంపతులు 20 హెక్టార్ల విస్తీర్ణంలో లోక్ బిరాదరీ ప్రకల్ప్ అనే ఒక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని ముఖ్యఉద్ధేశ్యం పోషకాహారలోపం, పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యతలతో బాధపడుతున్న అక్కడి స్థానిక మాడియా గోండులకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తూనే చెట్లకింద పాఠాలు చెబుతుండేవారు. అలా వారు చెప్పిన చదువుతో చాలా వరకు ఆ ఆదివాసులు డాక్టర్లూ, ఇంజనీర్లూ, టీచర్లూ అయిన వారు ఉన్నారు. అక్కడి వారికి వ్యవసాయం నేర్పించారు. ఎవరికి జ్వరం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే ప్రకాష్ కుటుంబాన్ని ఆశ్రయిస్తుంటారు. చిన్నప్పటి నుంచి ప్రకాష్‌కి జంతువులు అంటే చాలా ఇష్టం. తను చేసే సేవలు కేవలం మనుషులకు మాత్రమే కాకుండా జంతువులకు కూడా చేయడం మొదలుపెట్టాడు. ఒక రోజు కొందరు ఆదివాసీలు కోతిని వేటాడి కట్టెకు కట్టి తీసుకెళ్తున్నారు. ఆ చనిపోయిన కోతితో పాటు ఓ పిల్లకోతి కూడా ఉంది. అప్పుడు ప్రకాష్ ఆ ఆదివాసీలతో దాన్ని మీరు ఏం చేస్తారని అడిగితే, ఆ రెండింటినీ వండుకుని తింటామని చెప్పారు. అది తనను ఎంతగానో కలిచివేసింది. ఆ పిల్లకోతిని నాకివ్వండి… దానికి బదులుగా బియ్యం, బట్టలూ ఇస్తాను అని వాళ్లతో బేరం కుదుర్చుకున్నాను. ఆ పిల్ల కోతికి బబ్లి అని పేరు కూడా పెట్టారు… కొద్ది రోజుల్లోనే అది వారి ఇంట్లో సభ్యురాలై
పోయింది. అలా ఆ రోజు జరిగిన సంఘటనతో అక్కడి చుట్టుపక్కల ఆదివాసులలో మార్పు తీసుకొచ్చింది. అప్పటి నుంచి వాళ్లు గాయపడ్డ జంతువులను తీసుకొచ్చి వస్తుమార్పిడి పథకం కింద ఇస్తుండటంతో ఆశ్రయంలో జంతువుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రకాష్ ఆయన సంరక్షణలో 90 వరకూ వన్యమృగాలుఉన్నాయి. ప్రకాష్ కొడు కు అనికేత్ చిన్నతనంలో తను కొంతమంది పిల్లలు కలిసి వన్యప్రాణులతో కలిసి నదిలో స్నానం చేసి వచ్చేవారు. ఒక చిరుత వాళ్లతోనే పడుకునేది. అయినా వారు ఎప్పుడూ వాటికి భయపడలేదు అని అనికేత్ ఒక ఇంటర్వూలో చెప్పాడు. ఈ ఆశ్రమం మొదలు పెట్టిన రోజుల్లో గాయాల నుంచి కోలుకున్న వాటిని మొదట్లో అడవిలోనే వదిలేసేవారట. కానీ ప్రకాష్ కుటుంబీకుల ప్రేమకు లాలనకు అలవాటు పడ్డ అవి అడవిలో ఉండలేక కొన్ని వెనక్కి తిరిగి రావడం, కొన్ని బెంగతో చనిపోతుండంతో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యానిమల్ ఆర్క్‌లోనే వాటిని సంరక్షిస్తోంది ఆమ్టే కుటుంబం. వాటి కోసం బోనులు ఏర్పాటుచేసినప్పటికీ దాన్ని జంతుప్రదర్శనశాల అని చెప్పలేం. అంతరించిపోతున్న పక్షులు, జంతువులను కాపాడే హక్కు ప్రతిఒక్కరి బాధ్యత అంటాడు ప్రకాష్.

కాసోజు విష్ణు