Home తాజా వార్తలు కోరిన కోర్కెలు తీర్చే పడమటి అంజన్న

కోరిన కోర్కెలు తీర్చే పడమటి అంజన్న

మన తెలంగాణ/మక్తల్ : మక్తల్ పట్టణంలో వెలిసిన పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి సుమారు 500 ఏళ్లపైనే విశిష్ట చరిత్ర ఉంది. త్రేతాయుగంలో వెలిసిన జాంబవంతుడి చేతులమీదుగా ఆంజనేయస్వామి విగ్రహం పశ్ఛిమాభిముఖంగా ప్రతిష్టించనట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే స్వామివారికి పడమటి ఆంజనేయస్వామి అని పేరువచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అతి తక్కువ పశ్చిమంవైపు ప్రతిష్టించిన ఆంజనేయస్వామి ఆలయాల్లో మక్తల్ ఒకటి. పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతోపాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖండ జ్యోతి వెలిగించి, దాసంగాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాలు జరిగే ప్రధాన మూడురోజులు ఆలయ పరిసరాల్లోనే నిద్రచేస్తారు. రథోత్సవం, పాలఉట్లు ముగిసిన తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటారు..
స్థల పురాణంలో మక్తల్ విశిష్టత…
మఖ అంటే యజ్ఞం, స్థలి అంటే స్థలం. మఖస్థలి అంటే యజ్ఞయాగాదులు విరివిగా నిర్వహించే స్థలం. అందుకే ఈ ప్రాంతానికి మఖస్థలి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదిమారిపోయి మఖ్తల్‌గా మారిపోయింది. పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకుంటే. మృత్యుదోషం తొలగిపోతుందన్నది భక్తుల విశ్వాసం. జాంబవంతులవారిచేత ప్రతిష్టించబడిన విగ్రహం ఉత్తర ముఖంవైపు ఉండి. దర్శించుకునేటప్పుడు దక్షిణాభిముఖంగా ఉండి నమస్కరిస్తారు. దీంతో జాంబవంతులవారు యమధర్మరాజు అంశ కావడంతో ఆయనకు సైతం నమస్కరించబడినట్లు దీంతో మృత్యుదోషాలు తొలగి వారికి దీర్ఘాయుష్షు కలుగుతుందని నమ్మకం..
పురం వద్దన్న ఆంజనేయస్వామి….
స్వామివారి గర్భాలయంలో గోపురం లేకపోవడం ఇక్కడ మరో విశిష్టత. పూర్వంలో రెండుసార్లు గోపురం నిర్మించేందుకు ప్రయత్నించ గా పగుళ్లు వచ్చి కూలిపోయింది. అప్పటి అర్చకునికి రాత్రి కలలో స్వామి ప్రసన్నమై.. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు నదీజలాలు తీసుకువచ్చి..ఆగమ శాస్త్ర ప్రకారం గోపురం నిర్మిస్తేనే నిలుస్తుందని చెప్పారట. దీంతో ఒక్కరోజులో గోపురం నిర్మించడం సాధ్యపడకపోవడంతో ఇప్పటివరకు గోపురం లేకుండానే స్వామి దర్శనమిస్తున్నారు.
విగ్రహం పశ్చిమం వైపు వంగిఉండటం మరోవిశిష్టత…
ఆంజనేయస్వామి విగ్రహం పశ్చిమంవైపునకు వంగిఉండటం ఇక్కడ మరో విశిష్టత. దీనిపై స్వామివారి లీలలు అనేకం ప్రచారంలో ఉన్నా యి. ప్రస్తుతం అర్చక వంశానికి చెందిన పూర్వజుడు పొట్టిగా ఉండటం వల్ల స్వామివారికి బొట్టు పెట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడేవాడని, ఆయన మొర ఆలకించిన స్వామివారు పశ్చిమ దిక్కునకు కాస్త వంగి వెలిశారని ప్రతీతి. ప్రధాన అర్చకుడు పనిమీద వేరే చోటుకు వెళ్లాల్సిరావడంతో తన కుమారుడు, చిన్నవాడికి స్వామివారి పనులు అప్పగించి వెళ్లారని.. కాస్త చిన్నగా ఉండటంతో నైవేధ్యం సమర్పించలేకపోవడంతో..తండ్రి తిడతారని భావించిన చిన్నారి ఆత్మార్పణకు సిద్దపడటంతో… స్వామివారు ప్రత్యక్షమై పశ్చిమంవైపునకు వంగి, అతని గోరుముద్దలు తినడంతో విగ్రహం పశ్చిమం వైపునకు వంగినట్లు కనబడుతుందని చెబుతుంటారు..
స్వామివారి విశిష్టతలు…
మక్తల్ మీదుగా వెళ్లే పీఠాధిపతులు స్వామివారిని దర్శించుకోవడం వందల సంవత్సరాలనాటినుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్యప్రమోదుల తీర్థులవారు పని నిమిత్తం ఆగకుండా వెళ్లడంతో గుడెబల్లూరు సమీపంలో పెద్ద కోతుల గుంపు అడ్డుగా వచ్చి దారివ్వలేదు. దీంతో సత్యంగ్రహించిన స్వామివారు తిరిగి వచ్చి, ఆంజనేయుణ్ని దర్శించుకుని తిరిగి పయనం కాగా, దారిలో ఈసారి ఒక్కకోతి కూడా కనబడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించదట. ఇక స్వామివారి ఆలయంలోకి మద్యం, మాంసం సేవించి వచ్చిన ఒకరికి గుడిలో అడుగుపెట్టగానే, పాము బుసలు కొడుతూ కనిపించిందట. పూజారిని పిలిచి, పామును చూపించగా… పూజారికి పాము కనబడకపోగా, అతనికిమాత్రం పాము బుసలు కొడుతూ కనిపించిందట. తర్వాత రోజు స్వామివారిని వచ్చి వేడుకుని జీవితంలో మద్యం, మాంసం జోలికి వెళ్లనని ప్రతిన బూనారట. దీంతోపాటు క్యాన్సర్ బారినపడిన బాలుడికి సైతం వ్యాధి నయం అయిందట. అప్పటినుంచి స్వామివారిని కొలిచేందుకు భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా 33 అడుగుల ఎత్తైన విగ్రహం…
మక్తల్ పడమటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో అనుగొండకు చెందిన కొత్తకాపు గోవర్దన్ రెడ్డి సుమారు పదిలక్షల రూపాయల సొంత ఖర్చులతో స్వామివారి 33 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టింపజేశారు. దాదాపు చుట్టుపక్కల జిల్లాల్లో సైతం ఇంత పెద్ద విగ్రహం లేకపోవడం, జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో భారీ విగ్రహం చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది.
16 నుంచి 22 వరకు బ్రహ్మోత్సవాలు…
మక్తల్ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి వచ్చేనెల 22వ తేదీవరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలిరోజు 16వ తేదీ ఉత్తరాది మఠం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి ధ్వజారోహణం చేయడంతో అంకురార్పణ జరిగింది. అదేరోజు హనుమద్రథం, గజవాహన సేవ ఉంటుంది. ఇక రెండోరోజు 17వ తేదీ ఉష్ట్రవాహనసేవ, మూడోరోజు 18వ తేదీ ఉదయం పదిగంటలకు పవమాన హోమం, నెమలివాహన సేవ, సాయంత్రం ఆరుగంటలకు ప్రభోత్సవం ఉంటుంది. నాలుగోరోజు 19వ తేదీ మార్గశిర పౌర్ణమి సందర్భంగా స్వామివారికి రథోత్సవం కార్యక్రమం ఉంటుంది.
ఆలయానికి చేరుకోండిలా….
మక్తల్ పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకోవాలంటే హైదరాబాద్ నుంచి ప్రతి పదినిమిషాలకోసారి రాయిచూరుకు బస్సులు ఉం టాయి. హైదరాబాద్ నుంచి సుమారు 165 కి.మీ. దూరం కాగా, ఆ బస్సులు మక్తల్ వరకు ప్రయాణిస్తే సరిగ్గా బస్టాండ్ ముందే ఆలయం ఉండటంతో భక్తులు పెద్దగా ఇబ్బందులు లేకుండానే దర్శించుకోవచ్చు. తాండూరు, కొడంగల్ పరిసరాల వారు నారాయణపేట నుంచి మక్తల్ వరకు బస్సులో రావచ్చు. కర్నాటక, మహారాష్ట్రలకు చెందిన భక్తులు క్రిష్ణా రైల్వేస్టేషన్‌లో దిగి, అక్కడనుంచి సుమారు 14 కి.మీ. దూరంలో ఉన్న మక్తల్ కు బస్సులో రావచ్చు.
అభిప్రాయాలు..
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి
మక్తల్ పడమటిఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి. కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఉత్సవాల్లో పాల్గొన్నాలి. వేడుకలను జయప్రదం చేసేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిఒక్కరూ సహకరించండి. సత్యనారాయణ, ఆలయ ఈవో
నిబంధనలు పాటిస్తూ, దర్శనం చేసుకోవాలి..
మక్తల్ అంజన్న బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం జాతరరథోత్సవం రోజున భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండటంతో..ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, దర్శనం చేసుకోవాలి. ఇక ఆలయ పరిసరాల్లో లైటింగ్, పారిశుధ్యం, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఉంచి, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి, బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలి.

చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే, మక్తల్.