Home జాతీయ వార్తలు లోక్‌పాల్ కోసం అన్నా నిరవధిక దీక్ష ప్రారంభం

లోక్‌పాల్ కోసం అన్నా నిరవధిక దీక్ష ప్రారంభం

Anna Hazare

 

రాలేగావ్ సిద్ది(మహారాష్ట్ర): కేంద్రంలో లోక్‌పాల్ నియామకంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ అవినీతి వ్యతిరేక సామాజిక కార్యకర్త అన్నా హజారే బుధవారం తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కేంద్రంలో లోక్‌పాల్‌ను, రాష్ట్రాలలో లోకాయుక్తలను నియమించకుండా మోడీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. లోక్‌పాల్ బిల్లును 2013లో పార్లమెంట్ ఆమోదించినప్పటికీ ఇప్పటి వరకూ లోక్‌పాల్ నియామకం జరగలేదని, ఏ పార్టీ కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని అన్నా హజారే అన్నారు.

సాక్ష్యాలుంటే ప్రధాన మంత్రిని సైతం లోక్‌పాల్ ద్వారా బోనెక్కించవచ్చని, అదే విధంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ లోకాయుక్త ద్వారా విచారణ పరిధిలోకి తీసుకురావచ్చని ఆయన వివరించారు. ఈ కారణంగానే లోక్‌పాల్ కాని, లోకాయుక్తలను వారెవ్వరూ కోరుకోవడం లేదని హజారే వ్యాఖ్యానించారు. తనను తాను గాంధేయవాదినని చెప్పుకునే అన్నా హజారే మహాత్మా గాంధీ వర్ధంతి నాడు తన ఆమరణ దీక్ష ప్రారంభించారు. తనతో పాటు వేదికను ఏ రాజకీయ పార్టీ నాయకుడు పంచుకోవడానికి వీల్లేదని ఆయన షరతు కూడా విధించారు.

 

Anna Hazari Begins Indefinite Fast, Hazare said the Modi government has been making excuses for not setting up a Lokpal at the Centre and Lokayuktas in the states