Home ఆదిలాబాద్ అన్నదాత సంతోషమే సీఎం ఆకాంక్ష…

అన్నదాత సంతోషమే సీఎం ఆకాంక్ష…

Annadatha is CM with happy

ప్రజల కష్టాలను దూరం చేయడంలో కేసీఆర్ నెంబర్ వన్
పెట్టుబడి సాయం యోచన ప్రపంచంలోనే ప్రథమం
అన్నదాత ఆర్థిక పురోగతితోనే బంగారు తెలంగాణ
భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయం
డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ

మనతెలంగాణ/ ఆదిలాబాద్: గత పాలకుల నిర్లక్షం కారణంగా ఎన్నో అవస్థలు పడ్డ రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకొని అన్నదాత కళ్లల్లో ఆనందాన్ని చూడాలనే తపనతోనే రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశ పెట్టారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తాంసి మండలం పొన్నారి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ రైతులకు రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి జోగురామన్న, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డిలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ కష్టాలను దూరం చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారని కొనియాడారు. 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, 17 ఏళ్ల టీడీపీ పాలనలో తెలంగాణ ప్రాంత రైతాంగానికి చేసిందేమి లేదన్నారు.

రాష్ట్రంలోని జిల్లాలన్ని వెనుకబాటుకు గురయ్యాయన్నారు. రాష్ట్రంలోని రైతుల దయనీయ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా భూవివాదాలతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి రెవెన్యూ అధికారులతో భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి 90 రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేసి రైతులకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించడం జరిగిందన్నారు. దీంతో రైతులకు భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారని అన్నారు. రైతులు పంట సాగు కోసం అవస్థలు పడుతున్న విషయాన్ని గుర్తించి రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులకు మొదటి విడత కింద ఎకరానికి 4 వేల చొప్పున 5700 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయం కింద అందిస్తున్నారని, ఇలాంటి పథకం పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లోనూ అమలు కావడం లేదని తెలిపారు. 10 జిల్లాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి నూతనంగా 21 జిల్లాలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైతే అంధకారంలో ఉండాల్సి వస్తుందని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారని, అయితే రాష్ట్రం ఏర్పాటు తరువాత ఈ సమస్యను అధిగమించి రైతులకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ను అందించడం జరుగుతుందన్నారు. గతంలో పారిశ్రామిక వాడలకు పవర్ హాలిడేలు ప్రకటించే వారని, ప్రస్తుతం ఎక్కడా అలాంటి సమస్య తలెత్తడం లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ క్రతువులో రెవెన్యూ, వ్యవసాయ, రైతు సమన్వయ సమితులు భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అప్పలు తెచ్చుకోకుండా రైతులంతా పంటలు సాగు చేసే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని, దీనిని సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని అన్నారు. రాజకీయ నాయకులంతా రైతు కుటుంబం నుంచి వచ్చామని చెప్పుకుంటున్నా ఏ ఒక్కరు రైతుల గురించి ఆలోచించిన పాపాన పోలేదన్నారు. 2022 వరకు దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని చెబుతున్నారని, అయితే అది ఎలా సాధ్యమనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదన్నారు. వ్యవసాయం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్న రైతులు తమ బిడ్డలపై అప్పుల భారాన్ని విడిచి వెళుతున్నారని, ఈ పరిస్థితి భవిష్యత్‌లో ఉండవద్దనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులతో సంప్రదింపులు జరిపి ఈ పథకానికి నాంది పలికారని అన్నారు. విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించి సమస్యలు తలెత్తకుండా చర్యలు ప్రారంభించడం జరిగిందన్నారు. 5 వేల మంది రైతులకో క్లష్టర్‌ను ఏర్పాటు చేసి ఏఈవోలను నియమించడం జరిగిందని, ప్రతి క్లష్టర్‌కు రైతుభవన్‌లను మంజూరు చేస్తామన్నారు. రైతులంతా భూసార పరీక్షలు చేయించుకొని అందుకు అనుగుణంగా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించి లాభాలను ఆర్జించాలని ఆకాంక్షించారు. వచ్చే నెల 2 నుంచి పంటల భీమా పథకాన్ని ప్రవేశ పెట్టి ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రైతు సమన్వయ సమితిలు రైతులకు అండగా ఉంటూ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే పనిగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.

మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రైతులు స్వయంగా పెట్టుబడి పెట్టుకొనే స్థాయికి ఎదిగేంత వరకు రైతుబంధు పథకం కొనసాగుతుందన్నారు. ఈ పథకం ఈ ఒక్క సంవత్సరానికే పరిమితం కాదన్నారు. రైతులంతా ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకొని పంటల సాగుతో ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మార్చుకొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి అహర్నిషలు పాటు పడుతున్నారని పేర్కొన్నారు. రైతు సమన్వయ సమితిల సహకారంతో వ్యవసాయరంగాన్ని ముందుకు తీసుకొని వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, వ్యవసాయ శాఖ కమీషనర్ డాక్టర్ జగన్మోహన్, జిల్లా కలెక్టర్ దివ్యదేవరాజన్, డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్, డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డితో పాటు జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.