Home దునియా అన్నారం దర్గా..!

అన్నారం దర్గా..!

Annaram Shareef Dargah Famous in Warangal Rural District

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో కొలువైన  హజ్రత్ సయ్యద్ యాకుబ్ షావళి దర్గా మానసిక రోగులకు చికిత్సా నిలయంగా విలసిల్లుతోంది.  భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరుగా నిలుస్తోంది అన్నారం దర్గా. 

వరంగల్ జిల్లా చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు ఈ దర్గా వెంట బారులు తీరుతుంటారు. ఈ దర్గాకు వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది.

దర్గా నేపథ్యం… యాకుబ్ షావళి అరబ్బుదేశం నుంచి ఇక్కడకు వలస వచ్చినట్లు కథనం. ఆయనకు గుంషావళి, బోలెషావళి అనే తమ్ముళ్లు , మహబూబీయమ్మ అనే చెల్లెలు, గౌస్‌ఫాత్ అనే గురువు ఉన్నట్లు భక్తులు చెబుతారు. యాకుబ్ షావళి పేదలకు దాన ధర్మాలు చేసేవాడట. సొమ్మునంతా దానం చేయడంతో యావదాస్తి కరిగిపోయి దేశాటనకు బయలుదేరాడట! అలా వచ్చి అన్నారంలో స్థిరపడ్డాడని స్థానికులు వెల్లడిస్తున్నారు. కొందరు భౌతికదాడులకు పాల్పడటంతో చెరువు తూములోకి వెళ్లి ఆయన అక్కడే మాయమయ్యారని తర్వాత ఓ వ్యక్తికి కలలో వచ్చి తన పేరిట దర్గా నిర్మిస్తే ప్రజలకు రక్షణగా ఉంటానని చెప్పడంతో గ్రామస్థులంతా కలిసి దర్గా నిర్మించినట్లు స్థానిక కథనం.

మానసిక చికిత్సాలయం…
భక్తుల కొంగుబంగారంగా ఉన్న ఈ దర్గాను అన్నారం షరీఫ్‌గా పిలుచుకోవడం మొదలు పెట్టారు. ఈ దర్గా ఒక మానసిక చికిత్సాలయంగా పేరు పొందింది. ఇక్కడకు వచ్చే భక్తుల్లో చాలవరకూ మానసిక రుగ్మతల నుంచి బయటపడటానికి వస్తుంటారు. ఎక్కడెక్కడో పెద్దపెద్ద వైద్యులు సైతం నయం చేయలేని రుగ్మతలు ఇక్కడకు వచ్చి కోరుకుంటే నయమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇదంతా ఎలా వ్యాప్తిలోకి వచ్చిందంటే… మొదటగా ఒకాయన మానసిక సమస్యతో బాధపడుతూ ఇక్కడకు వచ్చాడట. యాకుబ్ షావళిని దర్శించుకుని దర్గాకు మొక్కితే తన రుగ్మతలు తగ్గిపోవడంతో ప్రజలకు ఈ దర్గాపై నమ్మకం ఏర్పడినట్లు గ్రామస్థులు చెబుతుంటారు.

కందూరు పండుగ…
అన్నారం షరీఫ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కందూరు. భక్తులు తమ కోర్కెలు నెరవేరితే కందూరు చేస్తామని యాకుబ్ సాహెబ్‌కు మొక్కుతారు. కందూరు రెండు రకాలుగా ఉంటుంది. యాట కందూరు, కోడి కందూరు. వీటిని దర్గా వద్ద బాబాకు మొక్కుకుని పక్కనే ఉన్న వరండాల్లో బలిస్తారు. వేడి చేసిన బొగ్గులను ముంతలో వేసి పొగవచ్చేలా వూదు చల్లుకుంటూ డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా దర్గా వద్దకు చేరుకుంటారు. దర్గాలో ఐదుగురు ముతావళిలు(ముజావర్లు, పూజారులు) భక్తులు తీసుకొచ్చిన వాటిలో ఒక దానిని దర్గాలో ఉంచి నైవేద్యంగా సమర్పిస్తారు. మరొక దానిని తూములో వదిలేసి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఇక్కడో విశేషముంది. తూములో ఎన్ని ముంతలు వేసినా బయటకు రావు. ఈ తూము నిండదని ముజావర్లు చెబుతున్నారు. ఈ తంతు ముగిసిన తర్వాత భక్తులు తిరిగి తమ బస ఉన్నచోటకు వెళ్లి సాముహిక భోజనాలు చేస్తారు.

గంధోత్సవం…
ఇక్కడ ఏడాదికోసారి గంధం ఉత్సవం ఘనంగా చేస్తారు. మూడు రోజులపాటు జరిగే వేడుకలకు లక్షలాది భక్తులు తరలివస్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనం హాజరవుతారు. ఆరు బయట చెట్లకింద వసతి ఏర్పాటు చేసుకుని బస చేస్తారు. యాటలు, కోళ్లు, మలిద ముద్దలు, అత్తరు సువాసనలతో సందడి వాతావరణం కనిపిస్తుంది.

ఎలా వెళ్లాలి…
హైదరాబాద్ నుంచి వరంగల్ 144 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ్నుంచి పర్వతగిరి 38 కి.మీ., పర్వతగిరి నుంచి అన్నారం దర్గా 10 కి.మీ ఉంటుంది. అక్కడికి ఆటోలు, బస్సుల సౌకర్యం ఉంది.