Thursday, April 25, 2024

ఆర్ద్ర హృదయానుభూతుల గవాయి

- Advertisement -
- Advertisement -

Annavaram Devender's ‘Gawai’ is a collection of poems

 

కవిత్వమనేది భావతరంగాల పరంపర. మనిషి లోలోపలి తత్త్వాన్ని తట్టి లేపుతుంది. హృదయాలను సుతిమెత్తగా స్పృశిస్తూ, రసార్ద్రతను పంచుతుంది. కవిత్వమంటే కవి అనుభవపూర్వకంలోని భావాలు మాత్రమే కాదు. సమకాలీన సమాజంలో నిత్యం జరిగే కాలానుగుణ పరిణామాలను, రెండు కళ్లతో గమనించిన అంశాలను, హృదయమనే త్రాసులో తూకం వేస్తుంది. మంచి చెడులను విశ్లేషించి, మంచితనం వైపు, మానవ త్వపు పరిమళాలను వెదజల్లుతూ హృదయావిష్కరణ చేసేది కవిత్వం. కవిత్వాన్ని కవుల అను భూతులను, ఊహా ప్రపంచంలో విహరించి రాసేవారు కొందరతై, తమ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనించి సాటి మనుష్యుల కష్టా లను, దుఃఖాలను తెలిపే మనసున్న కవులు మరికొందరు. ఈ రెండో రకం కవులు ప్రకృతి సౌందర్యాన్ని, జంతువుల, పక్షుల ఆనందాలను, రోదనలను వినగలరు. పాలబుగ్గల పసిపిల్లలతో, పచ్చని చేలలోని పాలకంకులతో నవ్వులు పంచుకుంటారు. ఈ సృష్టిలోని చరాచర జీవుల తోనూ కలిమి చేసే మనసున్న కవులున్నారు. కవిగా రాయటం కన్నా, కవిగానే నిలబడటం గొప్ప విషయం. సమకాలీన సమాజం నుంచి నిలబడిన కవులే చరిత్రలో కలకాలం నిలబడ తారు. వారి కలం నుండి జాలువారిన కవిత్వమే పది కాలాలపాటు నిలబడుతుంది. అలా నిలబ డిన సాహిత్య ప్రస్థాన కవులలో అన్నవరం దేవేందర్ ఒకరు.

పుట్టిన నేల గురించి, అన్నం మెతుకులు తినడానికి కారకులైన రైతన్నల తరపున కలాన్ని జులిపిస్తాడు. అన్నవరం కవిత్వం చదువుతుంటే ఒక గ్రంథాన్ని చదివినట్లు ఉండదు. ఆకు నమలడానికి పళ్ళు లేని అవ్వతో మాట్లాడినట్టుంటుంది. ఇసుక గూడు కట్టుకునే పసి పిల్లలతో ఆటలాడినట్లుంటుంది. సముద్రతీరాన సేద తీరినట్లుంటుంది. అలాగే ప్రజల కష్టాలు, దుఃఖాలను తెలిపినపుడు ఎర్రటి ఎండలో నిప్పుల కొలిమిని మోస్తున్నట్లు, బూడిదతో కప్పుకున్న నిప్పులను రాజేసినట్లుంటుంది. అన్నవరం దేవేందర్ 1962 అక్టోబర్ 17న, దశరథం, కేదారమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నిత్యం ప్రజలతో మమేకమయ్యే ప్రజాపరిషత్ లో పనిచేశారు. ప్రజల కష్టాలను, బాధలను వినడమేకాక బాహ్య ప్రపంచానికి ప్రజల గొంతుకై వినిపించిన కవి, రచయిత, కాలమిస్ట్. తొవ్వ, నడక, మంకమ్మ తోట లేబర్ అడ్డా, బొడ్డుమల్లె చెట్టు, బువ్వకుండ, ఇంటి దీపం, వరి గొలుసులు, పొక్కిలి వాకిళ్ళ పులకరింత మొదలగు పదకొండు కవితా సంపుటాలు, తెలంగాణ యాసను, గోసను, రైతుల, కార్మికుల కష్టాలను కలంలోకి ఒంపి, వారి రచనల్లో గత చరిత్ర వాస్తవ సంఘటనల సమాహారం తన గ్రంథాలలో సద్ది మూటగా కట్టి పెట్టారు.

వాటితోపాటు వివిధ పత్రికల్లో కాలమిస్ట్ గా పని చేసినప్పుడు, సమాజాన్ని అర్థం చేసుకుని సమాజ కోణంలో రాసిన మరో కోణం, తెలంగాణ అస్తిత్వాన్ని, తాతలువ్వలు గడిపిన గత చరిత్రని, ఇప్పుడు మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకొని ఊరి దస్తూరి పేరుతో రెండు వ్యాస సంకలనాలు మన ముందుంచారు. కొన్నిసార్లు కవి ఊరుకున్న కవి ఆలోచనలు సమాజం వెంట పరుగెడుతుంటాయి. సమాజంలో జరిగే సంఘటనలు కలం పట్టి రాయమని మనసు గీ పెడుతుంది. అన్నవరం దేవేందర్ తన సాహితీ ప్రస్థానం అనుభవంతో, సమకాలీన సందర్భాలను నిక్షిప్తం చేసి వెలువరించిన గ్రంథమే నేడు మనముందున్న ‘గవాయి‘కవితా సంపుటి. ఇందులో నలభై ఆరు కవితలున్నాయి. కవిలో అనుభూతులు ఎన్ని ఉన్నా, ఎన్ని రసాలున్న కొన్ని కలాలు మట్టి, రైతుల కష్టం చుట్టే, దుఃఖాలను దూరంచేసే ఆలోచనలు చుట్టే తిరుగుతాయి. కవి ఊహానుభూతులకన్నా, కాలంతో, అనుభవంతో ప్రయాణించిన అనుభూతుల నుంచే మంచి కవిత్వాన్ని రాయగలుగుతారు. కాలం సాక్షిగా నిలిచిన కవితలే ‘గవాయి‘లో ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కవిత కూడా మనలో ఆలోచనలు రేకేతిస్తుంది. బాధను పంచుతుంది. కష్టజీవుల పక్షాన ఆలోచించేలా, నిలబడేలా చేస్తోంది.

ఆధునిక యుగమని మురిసిపోతున్న మనుషుల తీరును, సెల్ఫోన్లే లోకంగా మునిగిపోతున్న సందర్భాలను గమనించి ఎంతో లోతైన భావంతో ‘వర్చువల్ వాత్సల్యం‘ కవితలో ‘వాత్సల్యం అంతా వర్చువల్ లైఫ్/మాటా ముచ్చటా మురిపెం/టచ్ స్క్రీన్ నుంచి కురావాల్సిందే/ ఐప్యాడ్ మీద అంనించిన వేళ్ళ కొనలు/అనునిత్యం పెయ్యి తడుతున్న/స్పర్శ దగ్గరగానే ఉన్నట్టు తుర్తి‘ అని, అవసరానికి వస్తువుల వాడకం ఉండాలి గాని, అనవసరంగా కూడా వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వడంతో పక్కనున్న మనుషుల ఆత్మీయానురాగాలను కోల్పోతున్నామని, ఇది గమనించుకొని మసలుకోవాలని గుర్తు చేస్తున్నాడు కవి. ప్రకృతిని ఆస్వాదించాలని, ఆరాధించాలని, మట్టిని ప్రేమించాలని, నాగలిని ముద్దాడాలని చెబుతూనే తాతల కాలంనాటి నుంచి వ్యవసాయంతో కవికున్న అనుభావాలను ‘సౌందర్యం‘ కవితలో ‘నాకున్నయి రెండు రెక్కలు/నాలుగు ఎకరాలు/తాతలు తండ్రుల కాలం నుంచి/చెలక దున్నడమే వ్యాపకం/పొలం లోకానికే సద్ది గిన్నె‘నని, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేది పొలమేనని కవి తెలుపుతున్నాడు.

కవులు, రచయితల కలం ఎప్పుడూ ఆగదని, కాల ప్రవాహంలాగే వారి ఆలోచనలు ఆచరణలో పెట్టి కొత్త మార్పుకు ప్రయత్నిస్తూనే ఉంటారని ‘ఇంక్‘ కవితలో ‘రచయితలు చేతులు ఎందుకు దాచుకుంటరు/కలం లోంచి సిరా పారుతూనే ఉంటుంది/కాలానికి, కలానికి విరమణ లేద‘ని కవుల హృదయాన్ని కవి తెలుపుతున్నాడు. సరైన కాలంలో వానలు పడకపోతే ఎదురు చూసేది ఒక రైతే కాదు. వారితోపాటు ఇంకా ఎవరెవరు ఎదురు చూస్తారో ‘వానోస్తలేదు‘ కవితలో ‘మొలకలు మొకం మొగులు దిక్కు చూపు/పదన కోసం ల్యాత రిల్లల పరితపన/పునాసలనన్న తడవాలని పూరెడు పిట్ట మనస్సు/వాన చినుకుల కోసం మనసైన మన్ను‘ చెట్టు చేమలు కూడా వర్షాదారం మీదనే ఎంతగా ఆధారపడి జీవనం కొనసాగిస్తాయో, కవి హృదయం ఎంత లోతైన చూపును కలిగి ఉంటుందో ఈ కవితలో వెల్లడయింది. కాళ్లు నెర్రెలిచ్చి, అడుగుతీసి అడుగు వేయలేకపోతున్న అరిపాదాలపై చిన్నప్పటి నుంచి నడకతోనే జీవనయానం కొనసాగించిన ప్రయాణాన్ని ‘అరి పాదాలు‘కవితలో ఇంటి నుంచి బడికి/బాయికాడికి/సభలకు, ఊరేగింపులకు నడిచి తిరిగే వాణ్ణి/పగలనక, రాత్రనక పిల్ల బాటలన్ని/ ఎదురు బెదురు లేక సంచరించిన కాలమ‘ని కవి తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.

పంటను పండించడానికి ఊరిలోని స్త్రీలంతా కలిసి వెళ్తారు. వారు పనిచేసే చోటే జీవన సంస్కృతి, పొలంపై పనిచేసే కూలీలపై ‘వరినాట్లు‘ కవితలో ‘నాట్ల మడి కట్లల్ల రాగాల తీగలు/ఇరువాలు దున్నంగ కొంగల కోలాహలం/బొజ్జట్ల బొల బొల నీళ్ళ ధ్వని/గొంతు సవరించుకున్న పల్లె కోయిలలు/ఊరి పాటలకు వరి పోసల ఉయ్యాల/నారుమడి ఒక సాంస్కృతిక వ్యక్తీకరణ వేదిక‘ని పంట చేలల్లో స్త్రీలు పాటలు పాడుకుంటూ, ఎంతో ఉత్తేజంగా పని చేస్తుంటే చుట్టూ ఎగిరే కొంగలు, బొలబొల నీళ్ల ధ్వని, పల్లె కోయిలల కమ్మదనం, ఇవన్నీ ప్రాంత సౌందర్యాన్ని తెలిపే సాంస్కృతిక వ్యక్తీకరణ వేదికంటున్నాడు కవి. ‘పట్టింపు‘ కవితలో ఎవరికి వారు ఏకాకిగా, ఎవరిని పట్టించుకోని కాలంలో వెళుతున్నా, అప్పుడప్పుడు సాటి మనిషి బాగుకోరే కొన్ని పట్టింపులు మానవత్వాన్ని తట్టి లేపుతుందని ‘సారు బండి స్టాండ్ తీయమని‘/ ‘కారు డోరు పడలేదని‘/ ‘వెనుక టైర్ల గాలి తక్కువయిందని‘ఎరుక చేయడం ఆనందాన్ని కలిగించే విషయమంటున్నాడు. కొందరు ఎంత ఎత్తుకు ఎగిరినా, పుట్టిన నేలను, కన్నవారిని, పెరిగిన వాతావరణాన్ని ఏమాత్రం మరిచిపోలేని వారుంటారు.

వారిలో కవి అన్నవరం ఒకరు. ‘ఆకాశయానం‘ కవితలో ఆకాశయానంలో ప్రయాణిస్తున్న కన్న ఊరిని, చుట్టూన్న మనుషులను, అద్భుతమైన పోలికలతో ఈ కవిత చెప్పాడు. ‘గొల్ల మల్లవ్వ కోడండ్లు సల్ల చిలికినాక/పెద్ద పెద్ద వెన్నముద్దలు ఆరబెట్టినట్టు/దూదేకుల మైబెల్లి దూది ఏకీ ఏకి/ఆకాశం నిండా పరిచి ఎండబెట్టినట్లుగ/సర్వల జువ్వ జువ్వ పాలు పిండంగనే/మొగలంతా పాల నురుగు పొంగి పోర్లినట్లని/ విమానయానం ఎన్నిసార్లు చేసినా/ ఎప్పుడు తనివితీరని దాహమ‘నంటున్నాడు కవి. కరోనా కాలంలో మహామహా నగరాలని ఎప్పుడు సముద్రహోరులా తిరిగే రోడ్ల మీద జనాలు, వాహనాలు కనుమరుగవడంతో మహా నగరాల గురించి ‘నిశ్చల నగరం‘కవితలో ‘ప్రవాహమై పరిగెత్తిన రహదారులన్నీ/పొడవుగా పరుచుకున్న ఖాళీ మైదానాలు/నిద్రాణమైన ఆ నిద్ర ఎన్ని ఏండ్ల నాటిదో/హోటళ్లు రెస్టారెంట్లు గాఢమైన గురక/ఆటోలు బస్సులకు తనివితీరా రికాం/నిశ్శబ్దం భయంతో నిద్రపోతుంద‘ని మహానగరాలన్ని ఒక్కసారిగా స్తబ్దుగా మారిన వైనాన్ని తెలిపాడు కవి.

పసిపిల్లల మనసును తెలుసుకోవాలంటే ఎవరికైనా పసి హృదయం ఉండాలి. అలాంటి హృదయమున్న కవి దేవేందర్. ‘పసితనం‘కవితలో పిల్లలు పుట్టాక ఇల్లంతా సందడిగా మారుతుందో తెలిపాడు. ‘ఇప్పుడు ఇల్లు ఇల్లంతా గల గల/చిన్ని చిన్ని రాగాల తరంగాలు/ఏడవడం ఒక సంభాషణ చాతుర్యం/రకరకాల భావవ్యక్తీకరణల దృశ్యం/అవసరాల రీతుల హెచ్చుతగ్గుల లయ/రాగం పసిపిల్లల నిత్య కార్యాచరణమ‘ని పసిపిల్లల చేష్టలను అసాంతం కవి వివరించాడు. మనిషి ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా మారుతూ ఉండాలని, లేకపోతే వెనుకబడిపోతారని, తమని తాము కొత్తగా ఆలోచించాలని, మారుతున్న పరిస్థితులను గమనించాలని ‘వెర్షన్ అప్ డేట్‘ కవితలో ‘ఆకురాయి మీద ఆలోచనల సారం/మెరుపులు అద్దుకున్న ఆధునికానంతరం/దినం దినం పొద్దు మగ్గుతున్న కొద్ది/అప్ గ్రేడషన్ అనివార్యమైన అవసరం/గాడ్జెట్లన్ని కొత్త వెర్షన్ పొందుతున్నట్లు/మనిషి అమాంతం అప్డేట్ కావాల్సిన‘ అవసరం ఉందని తెలుపుతున్నాడు కవి. ఇలా ప్రతీ కవితలో తనదైన కోణంలో, లోతైన చూపుతో, చూసిన దాన్ని, అనుభవంలోకి వచ్చిన అంశాలను, మంచి ఉపమానాలతో పాఠకుల హృదయానికి హత్తుకునే విధంగా కవి అన్నవరం దేవేందర్ గారు కవిత్వం రాశారు.

ఈ కవితా సంపుటిలో మరిన్ని కవితలు – స్త్రీలు – పూలు, సృష్టి, కడియాలు, జమిడిక, ఇల్లు, మంత్రసాని, తమిళనేల, బీమారి, ఒడి బియ్యం, ఊరి దిక్కు, వడపోత, దూది పింజం, విత్తన చౌరస్తాలాంటి కవితలు ఎన్నో సంఘటనలను, వాస్తవిక జీవిత చిత్రాన్ని చూపెటట్టు అర్ద్రతతో రాశారు. తెలంగాణ భాషను, మాండలికాలను, ఉపమానాలను సందర్భోచితంగా వాడారు. సమాజానికి మేలు చేసే, మేలిమి కవిత్వం, మరిన్ని రచనలు వీరి కలం నుండి వెలువడాలి.
ప్రతులు కావాలనుకునేవారు “గవాయి (కవితా సంపుటి), రచయిత : అన్నవరం దేవేందర్, పేజీలు : 120, వెల రూ: 125, ప్రచురణ : సాహితీ సోపతి పబ్లికేషన్స్, ప్రతులకు : ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు, సెల్ : 9440763479”ను సంప్రదించవచ్చును.

                                                                                         బి.మహేష్,
                                                                                         89852 02723

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News