Home ఎడిటోరియల్ రైతును ముంచుతున్న ఎంఇపి

రైతును ముంచుతున్న ఎంఇపి

edit

ఇటువంటి పరిస్థితులలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీని మోడీ ప్రభుత్వం ఎలా నిలబెట్టుకోగలదు?మన వార్షిక వ్యవసాయ ఎగుమతుల విలువ 30 బిలియన్ డాలర్లు. ఇది లక్షం కంటే చాలా దూరంలో ఉన్నట్లని ప్రభుత్వం హఠాత్తుగా గ్రహించింది. విధానాల సడలింపు ద్వారా ఆ ఎగుమతులను వంద బిలియన్ డాలర్లకు పెంచవచ్చునని కూడా ప్రభుత్వం గ్రహించింది. దేశ వ్యవసాయ ఎగుమతుల సామర్థం వంద బిలియన్ డాలర్లకంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ వాస్తవాన్ని నిజం చేయడానికి వ్యవసాయ సరకుల ఎగుమతులకు స్వేచ్ఛ కల్పిస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల లోక్‌సభలో 2018 19 సాధారణ బడ్జెట్ సమర్పిస్తూ పేర్కొన్నారు. ఇటీవల కొద్ది సంవత్సరాలుగా మన వ్యవసాయ ఎగుమతులు 43.23 బిలియన్ డాలర్లు (201314) నుండి 33.87 బిలియన్ డాలర్లకు 201617లో పడిపోయాయి. మరో ప్రక్క వ్యవసాయ రంగంలో దిగుమతులు 201314లో 15.03 బిలియన్ డాలర్ల నుండి 2016 17లో 25.09 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2017 డిసెంబర్‌లో కీలక వ్యవసాయ ఉత్పత్తులయిన తృణ ధాన్యాలు, జీడిపప్పు, తెలకపిండి, చమురు గింజలు, పళ్లు, కూరగాయల ఎగుమతుల్లో క్షీణత కనపడింది. దేశంలో మొత్తం ఎగుమతుల విలువలో వ్యవసాయ ఉత్పత్తుల వాటా కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. 201314లో 13.79 శాతం ఉన్న వ్యవసాయ ఎగుమతుల వాటా 201617లో 12.26 శాతానికి తగ్గింది. 2003 నుంచి 2013 దశాబ్దంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు భారీ ఎత్తున సాగేవి.
2003లో 5 బిలియన్ డాలర్లు ఉన్న ఆ ఎగుమతుల విలువ 2013 నాటికి 39 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2013లో ఆస్ట్రేలియాను పక్కకు తోసి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దేశాల్లో 7వ స్థానాన్ని చేజిక్కించుకుంది. వ్యవసాయ ఎగుమతుల మార్కెట్‌లో భారత్ తన సామర్థాని కంటే చాలా దిగువన ఉంటుందని ప్రభుత్వం చెబుతున్న దానితో అంతా ఏకీభవిస్తారు. అయితే ఈ ప్రకటన చేయడానికి ప్రభుత్వం ఎంచుకున్న సమయాన్ని బట్టి వ్యవసాయ ఎగుమతుల విధానాన్ని సరిళీకరించడంలో ప్రభుత్వానికి గల చిత్తశుద్ధిని శంకించవలసి వస్తోంది. దేశంలో వ్యవసాయ సంక్షోభం మున్నెన్నడూ లేని స్థాయిలో విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వ్యవసాయ సంక్షోభం ప్రభుత్వానికి గట్టి వ్యతిరేకతను చవిచూపిస్తుందని అధికార పార్టీ భయపడుతోంది. గ్రామీణ గుజరాత్‌లో ఇటీవలి ఎన్నికలప్పుడు సోకిన ఎదురుగాలి అధికార బిజెపిని భయపెడుతోంది. గత నాలుగేళ్లలో అనేక సరకులకు కనీస ఎగుమతి ధర (ఎంఇపి)ను ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సరకుల్లో ఉల్లిపాయలు, గోధుమ, బియ్యం, బంగాళదుంప, వంటనూనెలు కూడా ఉన్నాయి. దేశీయంగా అవి మరింత అందుబాటులో ఉండేలా చేయడానికి వాటి ఎగుమతిని ప్రభుత్వం నిషేధించింది. ఉదాహరణకు 2017 నవంబర్‌లో మోడీ ప్రభుత్వం ఉల్లిపాయలు కనీస ఎగుమతి ధర టన్ను 850 డాలర్లుగా రెండేళ్ల తరువాత తిరిగి ప్రకటించింది. ఈ ధర దిగువన ఎగుమతులను అనుమతించరు. కేవలం రెండేళ్ల క్రితం (2015 డిసెంబర్)లో ప్రభుత్వం కనీస ఎగుమతి ధరను రద్దు చేసింది. రెండేళ్ల తర్వాత తిరిగి ప్రకటించింది. వినియోగదారుల మంత్రిత్వ శాఖతో లాబీయింగ్ ను అరికట్టడానికి ఈ చర్య తీసుకుంది.
ఉల్లిపాయ ధరలలో హెచ్చుతగ్గులు తొలగించడానికి ఇది తొలి చర్య అని నిపుణులు పేర్కొన్నారు. ఉల్లి, బంగాళదుంప, టమాటో ధరలలో హెచ్చుతగ్గులను పరిష్కరించడానికి తాజా బడ్జెట్‌లో ‘ఆపరేషన్ గ్రీన్’ పథకాన్ని జైట్లీ ప్రకటించారు. ఈ పథకానికి రూ.500 కోట్ల కేటాయింపును 2018 19 ఆర్థిక సం॥నికి చేశారు. ఇతర సరకుల విషయంలో కూడా ఎన్‌డిఏ ప్రభుత్వ ‘కనీస ఎగుమతి ధర’ వ్యూహం అంతుబట్టకుండా ఉంది. 2014 జూన్‌లో టన్ను బంగాళ దుంప కనీస ఎగుమతి ధర (ఎంఇపి)ని రూ.450గా ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయంగా మరిన్ని సరఫరాలను అందుబాటులో ఉంచడానికి ఈ చర్య తీసుకుంది. దేశీయ మార్కెట్‌లో బంగాళదుంప ధరలు విపరీతంగా పడిపోయిన తర్వాత 2015 ఫిబ్రవరిలోనే ఈ ఎంఇపి ఆంక్షను ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం బంగాళదుంపపై అమల్లోగల ఎంఇపిని తొలగిస్తేనే రైతులకు ఆ పంటపై కనీస గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. అలాగే ఎగుమతి ధరలకు కూడా విలువైన విదేశీ మారకం సమకూరే అవకాశం ఉంటుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ స్వయంగా ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. 2015 ఆగస్టులో జలంధర్ రైతులు 500 క్వింటాళ్ల బంగాళదుంపను వినియోగదారులకు ఉచితంగా పంచేశారు. క్వింటాల్ రూ.1350 1400 ధర నుంచి రూ.200కు ఏడాది కాలంలో పడిపోవడంతో రైతులు ఆగ్రహించి అలా చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ బంగాళ దుంప రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన వెళ్లగక్కడానికి ఉత్పత్తి మొత్తాన్ని పారబోశారు. కిలో బంగాళ దుంపలు ఉత్పత్తి చేయడానికి ఎనిమిది రూపాయల దాకా ఖర్చవుతుంది. అయితే ధర జనవరి మొదట్లో కిలో రూ.12 మాత్రమే పలికింది. దీనితో రైతులు ఆగ్రహించి పంటను పారబోశారు. ప్రస్తుత సీజన్‌కు బంగాళ దుంప కనీస మద్దతు ధర కెజి రూ.4.87గా నిర్ణయించారు. ఇది ఉత్పత్తి వ్యయం కంటె చాలా తక్కువ ధర. 2014 జూన్‌లో మోడీ ప్రభుత్వం పాలపొడిపై 5 శాతం ఎగుమతి ప్రోత్సాహకాన్ని రద్దు చేసింది. దేశీయంగా మరింత అందుబాటులోకి వస్తే ధరలు వినియోగదారులకు తగ్గుతాయన్న దృష్టితో ఈ చర్య తీసుకుంది. 2012లో అప్పటి ప్రభుత్వం స్కిమ్డ్ పాలపొడి (ఎస్‌ఎంపి)ని విశేష కృషి అండ్ గ్రామ్ ఉద్యోగ్ యోజన కింద చేర్చింది. అందువల్ల ఎగుమతిదారులకు 5శాతం సుంకం పరపతి లభిస్తుంది. మోడీ ప్రభుత్వం ఈ సౌలభ్యాన్ని రద్దుచేయడంతో ఎగుమతిదారులకు గల ప్రోత్సాహం పోయింది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఎన్‌డిఎ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పడిపోతూ, దేశీయంగా ధరలు ఉత్పత్తి వ్యయం కంటె దిగువన ఉండడంతో ఈ హామీ తీరేది ఎలా అనే సందేహం కలుగుతోంది. భారత వ్యవసాయ ఎగుమతులకు మరొక ప్రతిపాదన అడ్డువస్తోంది. వ్యవసాయ ఎగుమతులు చేసే వర్దమాన దేశం తాను నికరంగా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంటున్నట్లు సమర్థించుకోవాలని, అందుకు తగిన సమాచారం అందించాలని ఒక ప్రతిపాదన డబ్లుటిఒ మంత్రుల స్థాయి సమావేశంలో తెర మీదకు వచ్చింది. గత డిసెంబర్‌లో బ్యూనస్ ఎయిర్స్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ ప్రతిపాదనను భారత్ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించాలని కేంద్రానికి ఉంటే అది చేపడుతున్న ‘కనీస ఎగుమతి ధర’ విధానాన్ని పునఃపరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.

* నూర్ మహమ్మద్