Home ఎడిటోరియల్ మరో మృత్యు క్రీడ మోమో!

మరో మృత్యు క్రీడ మోమో!

Another death sport memo

మానసిక వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అత్యధికంగా వాడడం వ్యసనంగా మారుతున్నది. ఈ వ్యసనం ఆన్ లైన్ గేమ్స్ వలలో పడేలా చేస్తుంది. ఆ తర్వాత ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసలయ్యేలా చేస్తుంది. ఈ క్రీడల్లో అత్యంత ప్రమాదకరమైన హింసాత్మకమైన గేమ్స్ కూడా ఉంటున్నాయి. పిల్లలు టీనేజిలో ఉన్నప్పుడు తాము ఇతరుల కన్నా విభిన్నం అనుకుంటారు. ఇతరుల కన్నా వేరుగా తమదైన ఒక గుర్తింపు సాధించే ప్రయత్నం చేస్తుంటారు.

సోషల్ మీడియాలో ఈ గేమ్ వల్ల ఇప్పటికే దేశంలో ముగ్గురు చనిపోయారు. పిల్లలు ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నారా? వారిని కనిపెట్టుకుని ఉండండని ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసింది.
ఇంతకు ముందు బ్లూవేల్ గేమ్ ఇలాగే మృత్యు క్రీడగా వణికించింది. ఇప్పుడు దేశంలో మోమో ఛాలెంజ్ కొత్తగా మృత్యుపంజా విసురుతుంది.

జులై 31వ తేదీన రాజస్థాన్‌లో పదవతరగతి చదివే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. పుట్టినరోజు పండగ చేసుకున్న మూడు రోజులకే ఆమె తన జీవితం ముగించింది. పోలీసులు కేసు విచారణ సందర్భంగా ఆమె మొబైల్ ఫోను పరిశీలించారు. మోమో ఆన్ లైన్ గేమ్ కు సంబంధించిన లింకులు కనిపించాయి. బెంగాల్ నుంచి మరో రెండు సంఘటనల వార్తలు వచ్చాయి. అగష్టు నెలలో మనీష్ సార్కీ అనే స్కూలు విద్యార్థి పశువుల పాకలో ఆత్మహత్య చేసుకున్నాడు. పశువుల పాక గోడపై ”ఇల్యుమినాటి“, ”డెవిల్స్ వన్ ఐ“ అని రాతలున్నాయి. ఈ రాతలు మోమో ఛాలెంజ్ కు సంబంధించినవి. అగష్టు 20వ తేదీన అదే ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న 26 సంవత్సరాల అదితి గోయల్ చావుకు కూడా మోమో చాలెంజ్ కారణమని తెలుస్తోంది.

ఈ ఆన్ లైన్ గేమ్ ఫేస్ బుక్‌లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. గేమ్ లో పాల్గొనాలనుకునే వారికి ఒక నెంబరు ఇచ్చి కాంటాక్ట్ చేయమని ఫేస్ బుక్ ద్వారా కోరారని అనుమానం. వాట్సప్ ద్వారా ఈ గేమ్ లింక్ అందరికీ చేరవేశారని తెలుస్తోంది. వాట్సప్ లో మొదటిదశ కాంటాక్ట్ తర్వాత ఈ క్రీడలో పాల్గొంటున్నవారికి వరుసగా అనేక సవాళ్ళను పంపించడం జరుగుతుంది. ఈ సవాళ్ళను అధిగమిస్తే మోమో ను కలవవచ్చు.ఈ సవాళ్ళు హింసాత్మకంగా ఉంటున్నాయి. ఇందులో పాల్గొనే వారు హింసాత్మక పనులకు పాల్పడేలా ఈ సవాళ్ళు ముందుకు వస్తాయి. ఒక సవాలు తర్వాత మరింత కఠినమైన మరో సవాలు. ఇలా తనను తాను హింసించుకునే ఈ స్థాయి పెరుగుతూ చివరకు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది.

ఈ మృత్యు క్రీడను నడుపుతున్నదెవరు? ఈ ప్రశ్నకు జవాబు కూడా తెలిసింది. మెక్సికో, కొలంబియా, జపానుల నుంచి ఈ గేమ్ నడుపుతున్నట్లు తెలియవచ్చింది. కాని అసలు మోమో ఛాలెంజ్ దేనికోసం, లక్ష్యమేమిటి అనేది తెలియరాలేదు. సోషల్ మీడియాలో మోమో ఎక్కౌంట్లను వాడుతున్న ఆపరేటర్లు వికారమైన ముఖం, ఉబికిపోయిన కళ్ళు ఉన్న ఒక బొమ్మను మాత్రమే వాడుతున్నారు. ఎవరన్నది తెలియదు. జపానుకు చెందిన మిదోరి హయాషీ కళారూపాన్ని ప్రేరణగా తీసుకుని ఈ మోమో ముఖాన్ని తయారు చేసినట్లు కనిపిస్తుంది.

మోమో ఛాలెంజ్ భయంకర రూపం ఆగష్టులో మొదట బ్యూనస్ ఎయిర్స్ లో ఒక 12 సంవత్సరాల బాలిక ఆత్మహత్య చేసుకుంటూ తన ఆత్మహత్యను వీడియోగా షూట్ చేయడంతో ప్రపంచానికి తెలిసింది. ఆమెను ఎవరో రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారని పోలీసులు అనుమానించారు. ఆమె ఎవరెవరికి మెస్సేజిలు షేర్ చేసిందో కనిపెట్టడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ మృత్యుక్రీడ నెమ్మదిగా ప్రపంచమంతా పాకడం ప్రారంభమైంది.

భారతదేశానికి ఇలాంటి ఆన్ లైన్ క్రీడల సమస్య ఇంతకు ముందు కూడా ఎదురైంది. బ్లూవేల్ క్రీడ వల్ల గత సంవత్సరం ఎదుర్కొన్న సమస్యలున్నాయి. బ్లూవేల్ కూడా ఇలాగే ఒక దాని తర్వాత ఒక సవాలును ఇస్తూ టీనేజి పిల్లలు తమను తాము గాయపరుచుకునేలా చివరకు ఆత్మహత్య చేసుకునేలా మార్చిన భయంకరమైన క్రీడ. ఆ క్రీడ విషాద జ్ఞాపకాలు మానకముందే ఇప్పుడు ఈ కొత్త ఆన్ లైన్ క్రీడ పిల్లలను కాటేయడానికి వచ్చి వాలింది. దేశంలో అత్యధికంగా మొబైల్ ఫోన్లు, ఫ్రీ డాటా అందుబాటులో ఉన్న నేపథ్యంలో పిల్లలను ఈ సోషల్ మీడియా, ఆన్ లైన్ గేమ్స్ నుంచి కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోనే రెండు మోమో మరణాలు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెంటనే మేల్కొని చర్యలు ప్రారంభించింది. పోలీసులకు తగు సూచనలు జారీ అయ్యాయి. విద్యాసంస్థలకు గైడ్ లైన్స్ పంపించారు. పిల్లల నడవడి, వ్యవహారశైలి ఎలా ఉంది. వారి మూడ్స్ ఎలా ఉన్నాయి గమనిస్తూ ఉండడం, సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఒక కన్నేసి ఉంచడం జరుగుతోంది.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ.టి. మంత్రిత్వశాఖ కూడా అడ్వయిజరీ జారీ చేసింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు అవసరమైన సలహాసూచనలిచ్చింది. ఆన్ లైన్ లో, సోషల్ మీడియాలో ప్రమాదాలను గురించి హెచ్చరించి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరింది.

మానసిక వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అత్యధికంగా వాడడం వ్యసనంగా మారుతున్నది. ఈ వ్యసనం ఆన్ లైన్ గేమ్స్ వలలో పడేలా చేస్తుంది. ఆ తర్వాత ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలయ్యేలా చేస్తుంది. ఈ క్రీడల్లో అత్యంత ప్రమాదకరమైన హింసాత్మకమైన గేమ్స్ కూడా ఉంటున్నాయి.

పిల్లలు టీనేజిలో ఉన్నప్పుడు తాము ఇతరుల కన్నా విభిన్నం అనుకుంటారు. ఇతరుల కన్నా వేరుగా తమదైన ఒక గుర్తింపు సాధించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ ప్రయత్నాలు నిర్మాణాత్మకంగా ఉంటే సమాజానికి, వ్యక్తిగతంగా పిల్లలకు మంచిది. కాని టీనేజి కుతూహలం, తెంపరితనం, గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు సోషల్ మీడియాలో విధ్వంసక దిశలోకి మళ్ళి, ప్రమాదకరమైన క్రీడలకు బానిసలైపోతే వారి భవిష్యత్తు నాశనం కావడమే కాదు, చివరకు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.

                                                                                                                                        – మనీషా మండల్  (ది ప్రింట్ )