Friday, April 26, 2024

మేలో మరో లాక్‌డౌన్?

- Advertisement -
- Advertisement -

modi

 

14తర్వాత మొదటిదశ పాక్షికంగా ఎత్తివేత
అత్యవసర సేవలతో పాటు పలు రంగాలకు వర్తింపజేసే అవకాశం
సినిమా హాళ్లు, ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు మినహాయింపు లేనట్లే!
దేశవ్యాప్తంగా 20 కరోనా హాట్‌స్పాట్‌లలో లాక్‌డౌన్ కొనసాగింపు
కేంద్ర మదిలో భిన్నరకాల ఆలోచనలు

న్యూఢిల్లీ : ఏప్రిల్ 14వ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కరోనా నేపథ్యంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? లేదా కొనసాగిస్తారా? అన్నది ఇప్పుడు ప్రతీ సామాన్యుడి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఒకవేళ ఎత్తివేస్తే అది ఎలా ఉండబోతోంది. దేశమంతటా ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేస్తారా, లేకపోతో దశల వారీగా ఉంటుందా.. అలా ఉంటే ఏ రంగాలకు మినహాయింపు ఉంటుంది.. ఎవరికి ఉండదు… కాకపోతే మరికొన్ని రోజులు ఇదే పరిస్థితిని కొనసాగిస్తారా అన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి కూడా భిన్నమైన సమాచారం వస్తోంది. లాక్‌డౌన్ ఎత్తేసే విషయంపైనే ఏప్రిల్ 3న 16 మందితో కూడిన మంత్రుల బృందంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. దీనికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 14 న లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మే 15 నుంచి రెండో దశ లాక్‌డౌన్ విధిస్తే ఎలా ఉంటుందని కేంద్ర మంత్రుల మధ్య చర్చ వచ్చినట్లు సమాచారం.

అయితే మొదటి దశ లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఏ దుకాణాలు తెరవాలి? ఏ దుకాణాలు మూసి ఉంచాలన్నది కూడా మంత్రులు చర్చించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ఎత్తేసినా సరే నిత్యావసర సరుకుల దుకాణాలు తెరిచే ఉంచాలని, అయితే ప్రజలు గుమిగూడటంపై మాత్రం నిషేధం కొనసాగించాలని వారు భావించినట్లు సమాచారం. సినిమా థియేటర్లు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలను మాత్రం తెరవకూడదన్న నిబంధన విధించాలని భావించారు. అయితే నిత్యావసరాలను అమ్మే మాల్స్‌కు మాత్రం మినహాయింపు ఇస్తే బాగుంటుందని భావించినట్లు సమాచారం. విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే విదేశీయులకు అనుమతులిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగింది. అయితే కరోనా వైరస్‌తో బాగా ప్రభావితమైన ప్రాంతాల్లో మాత్రం వారం వారం సంతలకు అనుమతి ఇవ్వకూడదని, రాష్ట్రమంతటా కోవిడ్ – 19 పై అవగాహన కల్పించేందుకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని మంత్రుల నడుమ చర్చకు వచ్చినట్లు సమాచారం.

లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత పరిస్థితిని బట్టి మే 15 నుంచి రెండో దశ లాక్‌డౌన్ విధించాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు క్వారంటైన్‌లో ఉంటున్న వారిని జిపిఎస్ ట్రాకర్స్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు, బాధ్యులు పర్యవేక్షించాలని, అయితే ఇది ఎంత వరకు సాధ్యమనేది మంత్రులు చర్చించారు. ఏప్రిల్ 14న తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా హాట్‌స్పాట్‌లలో లాక్‌డౌన్‌ను కొనసాగించడమే కాకుండా మరిన్ని కఠిన నిబంధనలు విధించాలని, అక్కడి ప్రజలకు ప్రభుత్వ సాయాన్ని కొనసాగించాలన్నదానిపై కూడా కేంద్రం ఆలోచనలో ఉందని హోంశాఖ వర్గాల సమాచారం.

దేశవ్యాప్తంగా ప్రధానంగా 20 కరోనా హాట్‌స్పాట్‌లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ‘వర్క్ ఫ్రం హోం’ చేసే ఉద్యోగులకు మరో నెల పాటు ఇదే వసతి కొనసాగిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. అదే సమయంలో ఇటీవల దేశవ్యాప్తంగా మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, రాజకీయ పార్టీల అధినేతలు, వివిధ రాష్ట్రాల సిఎంలతో ఫోన్‌లో చర్చించిన ప్రధానమంత్రి లాక్‌డౌన్ ఎత్తివేతపై సలహాలు, సూచనలు కూడా కోరినట్లు తెలుస్తోంది. భిన్న వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుక్నున తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారని కేంద్ర వర్గాల చెబుతున్నాయి.

 

Another lockdown in May?
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News