Home దునియా చీమ సలహా

చీమ సలహా

ఈగ, చీమ ఇద్దరూ మంచి స్నేహితులు.  వాళ్ల స్నేహంలో ఎక్కడైనా ఆహారం చూస్తే వెంటనే చీమ తన తోటి చీమలకు చెప్పటం, అంతా వరుసల్లో వచ్చి ఆహారాన్ని తినటం, కొంత ఇంటికి తీసుకుని వెళ్లటం గమనించింది ఈగ. చీమల్లో ఈ సహకారం ఎంతో నచ్చింది ఈగకు. ఒకరోజు అందరూ ఇక్కడ తింటున్నారు కదా!  “ మళ్లీ ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు?” అని అడిగింది ఈగ చీమని. అది విన్న చీమ పకపకా నవ్వి.. “ఆహారం నిలువ చేసుకోవటంలో చీమల్ని మించిన వారు లేరు అని మాకు పేరు కదా ! నీవు వినలేదా?” అంది.
“లేదు వినలేదు” అంది ఈగ.

“ ఏ కాలంలో అయినా కొంత ఆహారాన్ని ముందు జాగ్రత్తగా దాచుకుంటాము. అందరం ఒకే మాట మీద ఉంటాము. మాకు నాయకురాలు రాణి. రాణి ఎలా చెబితే అలా చేస్తాము. అందుకే ఎప్పుడూ మాకు ఆహారం లేదు అనే సమస్యే ఉండదు” అంది చీమ గర్వంగా.
“అవునా! చాల మంచి అలవాటు. మాకు అలా దాచుకునే అలవాటు లేదు. ఎక్కడ ఆహారం దొరికితే అక్కడే తినేసి ఎగిరిపోతాము. మిమ్మల్ని చూస్తుంటే నాక్కూడా మీలా దాచుకోవాలని ఉంది” అంది ఈగ.
“నువ్వు ఒక్కడివే దాచుకోవాలంటే కుదరదు. అందరూ కలసి దాచుకోవాలి.అప్పుడే దాచుకున్న ఆహారం అందరికీ ఉపయోగపడుతుంది..” అంది చీమ. “అవును. నువ్వు అన్నది నిజమే! మా వాళ్లల్లో కొంతమంది నా మిత్రుల్ని అడిగి చూస్తాను. ఏమంటారో.. ”అని రివ్వున ఎగిరిపోయింది ఈగ. కాసేపటికి కొన్ని ఈగల్ని వెంట తీసుకుని చీమని వెదుక్కుంటూ వచ్చింది.
నోటితో మోస్తున్న పంచదార పలుకుని పక్కన పెట్టి ఏమిటి? అని అడిగింది చీమ ఈగని. “మావాళ్ళు కొందరు ఆహారం సంపాదించి దాచుకోవటానికి ముందుకు వచ్చారు. ఆ సంతో షమైన విషయం నీతో చెబుదామని , మా వాళ్లని నీకు చూపించాలని తీసుకు వచ్చాను” అంది ఈగ. ‘అవునా?’ అని మిగతా ఈగలను చూసి పలకరింపుగా నవ్వింది చీమ. అంతేకాదు..తాను తీసుకు వెళుతున్న పంచదార పలుకుని వారికి పెట్టింది తినమని మర్యాద చేస్తున్నట్టుగా.
అంతా కలసి చీమ పెట్టిన తియ్యని పంచ దారను తింటూ ఉండగా అటు పక్కగా చాల చీమలు వరుసల్లో పంచదార పలుకులను మోసుకువెళ్లటం చూసి వాటిని గమనించమని మిగతా ఈగలకు చెప్పింది ఈగ…

ఈగలు చీమల్ని గమనిస్తూ ఉండగా..

“మనం ఎంత కష్టపడితే అంత అహారాన్ని దాచుకోవచ్చు. అప్పుడు వర్షాలు పడినా మనకు ఆహారం ఉంటుంది. ఆకలి సమస్య ఉండదు. మాకు ఈ లక్షణం పుట్టుకతో వచ్చింది. కాబట్టి మాకు తెలియకుండానే మేము అలా దాచుకోవటానికి, పంచుకోవటానికి అలవాటు పడిపోయాము. మీరు అలా కాదు. తిని ఎగిరిపోతారు. మీరు ఈ అలవాటు కొత్తగా చేసుకోవాలి. అందు కు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంతో నమ్మకం ఉండా లి. అలా స్నేహితుల మధ్యలో నమ్మకం కుదిరితే మాలాగా మీరు నడవక్కరలేదు కాబట్టి చాల ఆహారాన్ని దాచుకోవచ్చు” అంది.
అలాగే అంటూ అప్పటికే చీమ పెట్టిన పంచదార పలుకును మొత్తం పంచుకుని తినేసాయేమో ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి ఈగలన్నీ. కొద్ది రోజులకి ఏడుస్తూ వచ్చింది ఈగ.
ఏమైంది ? అని అడిగింది చీమ.
“అందరూ మోసం చేసారు. మీలాగే మా వాళ్లని ఐకమత్యంగా ఉంచాలని, ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని ఎంతో ప్రయత్నించాను. అలా తగ్గించి తింటూ, కొద్ది రోజులు ఆహారాన్ని సంపాదించి ఒక చోట దాచాము. అయితే ఒకరికి తెలియకుండా మరొకరు మొత్తం తినేసారు. కొద్దిగా కూడా మిగల్చలేదు..” అంది ఏడుస్తూ.

‘ ఎవరు తినేసారు?’ అంది చీమ.

‘ఎవరమైతే కలసి దాచుకున్నమో వాళ్లే!’ అంది ఈగ. ‘బాధ పడకు. నీకు మా వలే దాచుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడే అది సాధ్యం కాదని నాకు తెలుసు. ఎందుకంటే మేము నేల మీద నడుస్తాము. ఒకవేళ మా ఆహారాన్ని ఎవరైనా దొంగతనంగా తినేస్తున్నా మాకు తెలిసిపోతుంది. కాబట్టి ఎవ్వరూ తినరు.

అసలు అలా తినెయ్యాలనే ఆలోచనే మాలో ఎవరికీ ఉండదు. అలా అంతా ఒక్క మాట మీద నిలబెట్టే మంచి నాయకత్వం కావాలి. మాకు రాణి చీమ ఉంది. మీకు లేదు. పైగా మీరు గాల్లో ఎగురుతారు. దొంగల్ని పట్టుకోవటం కష్టం. అని ఈగ దగ్గరకంటా వచ్చి.. మోసపోయినప్పుడు బాధ కలుగుతుంది. బాధపడుతూ కూర్చోవద్దు. ఆ బాధను ఎలా తగ్గించుకోవాలో ఆలోచించాలి. అదే ఇప్పుడు నేను నీకు చెబుతాను విను. ఆ దాచిన ఆహారంలో వాళ్లు సంపాదించుకున్నది కూడా ఉంది కదా! దాన్నే వాళ్లు తినేసారు అనుకో. కాకపోతే నువ్వు దాచిన ఆహారాన్ని కూడా తినేసారు. అది బాధే. పోనీలే. వాళ్లంతా నీ స్నేహితులే కదా! ఇలా అనుకుంటే కొంత బాధ తగ్గుతుంది. ఐకమత్యంగా ఉందామని ఒక మంచి పనికి నువ్వు ప్రయత్నం చేసావు. మన ప్రయత్నం మంచి ఫలితాలను ఇవ్వక పోతే మన పాత జీవితం మనకి ఎలాగూ ఉంటుంది కదా..! నీ రెక్కల్లో బలం ఉన్నంత వరకూ నీకు ఆహారానికి కొదవ ఉండదు. కాబట్టి కడుపునిండా తిని హాయిగా తిరుగు..” అంది చీమ. “నీ మాటలు వింటుంటే ఎంతో హాయిగా ఉంది. మళ్ళీ కలుస్తా.. ” అని చీమకు కృతజ్ఞతలు చెప్పి..రివ్వున గాల్లోకి ఎగిరిపోయింది ఈగ.

కన్నెగంటి అనసూయ. 92465 41249

 

Ant Information in Telugu