Friday, January 27, 2023

తమిళ హైడ్రామాకు యాంటీక్లైమాక్స్

- Advertisement -

Sampadakeeyam-Logoఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధకచట్టం కింద దివంగత ముఖ్యమంత్రి జయలలిత సహవాసి శశికళ దోషి అని సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఉదయం తీర్పు వెలువరించ టంతో ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెంచుకున్న ‘చిన్నమ్మ’ జైలుకు వెళ్ళటం ఖరారైంది. ఆమె, మరో ఇరువురు బంధువులు 2014లో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించాలి, ఒక్కొక్కరు రూ.1౦కోట్లు జరిమానా చెల్లించాలి. జయలలిత జీవించి ఉన్నట్లయితే నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 100 కోట్ల జరిమానా చెల్లించాల్సివచ్చేది. ఈ కేసులోని జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసి ఆరుమాసాలు కర్నాటక జైల్లో ఉన్నారు. సెషన్స్ కోర్టు తీర్పును 2015 మే11న కర్నాటక హైకోర్టు కొట్టివేయటంతో వారు నిర్దోషులుగా విడుదలైనారు. జయలలిత మళ్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎడిఎంకెను తిరిగి అధికారానికి తెచ్చిన ఆమె మళ్లీ ముఖ్యమంత్రి అయినారు. తీవ్రమైన అనారోగ్యంతో డిసెంబర్ 5న మరణించారు. కర్నాటక హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన దరిమిలా అన్ని పక్షాల వాదనలు విన్న ధర్మాసనం గత ఏడాది జూన్ 7న తీర్పు రిజర్వు చేసింది. సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టు తీర్పును రద్దు చేయటంతో సెషన్స్ కోర్టు తీర్పు ఖరారైంది. దీనిప్రకారం శశికళ, మిగతా ఇద్దరు అనుభవించిన ఆరునెలల శిక్షాకాలం పోను నికరంగా మూడున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆ తదుపరి మరో ఆరేళ్లు ఎన్నికల్లో పోటీచేయటానికి ఆమె అనర్హురాలు. అరవైఏళ్ల శశికళ మరో పదేళ్లపాటు ఎఐఎడిఎంకె పై పట్టుకొనసాగిం చటం, అప్పటిదాకా ఆ పార్టీ పట్ల ప్రజల అభిమానం కొనసాగటం దూరూహ్యాలు.
వర్తమానంలోకి వస్తే, సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే, గోల్డన్‌బే రిసార్ట్‌లోని ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేలు శశికళ సూచన ప్రకారం సేలం జిల్లాకు చెందిన ఐదు పర్యాయాల ఎమ్మెల్యే ఇ.కె.పళనిస్వామిని తమ కొత్త శాసనసభాపక్ష నాయకునిగా ఎన్నుకున్నారు. సాయంత్రం గవర్నర్ సిహెచ్. విద్యాసాగర్‌రావును కలిసి సంబంధిత లేఖను అందచేసి, 128 మంది ఎమ్మెల్యేల (మొత్తం 136) తోడ్పాటున్న తనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం ‘అమ్మ’(జయలలిత) ప్రభుత్వం కొనసాగించేందుకు ‘ఆత్మప్రబోధం’ ప్రకారం ముందుకు రావలసిందిగా శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు.
ఈ రాజకీయ అనిశ్చితికి తెరదించాల్సిన బాధ్యత గవర్నర్‌పై మునుపటికన్నా ఇప్పుడు ఎక్కువైంది. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబడిన శశికళ చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించకపోవటానికి – సుప్రీంకోర్టు తీర్పుకొరకు వేచిచూడాలన్న భావమే కారణమన్న అభిప్రాయం ధృవపడుతున్నది. రాజ్యాంగ, న్యాయవ్యవస్థ విధులను కలిపిచూడటమే పొరపాటు. బిజెపి కేంద్ర నాయకత్వం నుంచి క్లియరెన్స్ లేకపోవటం వల్లనే ఉద్దేశపూర్వకంగా జాగుచేశారన్న అపప్రదకు కూడా ఆయన గురైనారు. శశికళచేత ప్రమాణ స్వీకారం చేయించినా, సుప్రీంకోర్టునుంచి ఆమెకు వ్యతిరేకంగా తీర్పువస్తే (అలా వస్తుందని ముందే ఎవరూ ఊహించలేరుకదా!) ఆమె ఎలాగూ పదవినుంచి తప్పుకుని జైలుకు వెళ్లాల్సిందేకదా! గవర్నర్ అట్టి ప్రజాస్వామిక క్రమాన్ని పాటించి ఉంటే ఆయన ప్రతిష్ట పెరిగేది. బిజెపి ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ఇన్‌ఛార్జి పి.మురళీధరరావు తాజా వ్యాఖ్య తమిళ రాజకీయ సంక్షోభంలో బిజెపి కీలకపాత్ర వహించినట్లు, పన్నీరుసెల్వాన్ని గద్దె నెక్కించేందుకు తెరవెనుక ప్రయత్నాలన్నీ చేసినట్లు విదితమవుతుంది. “ప్రాక్సీని నియమించటం ద్వారా ప్రజల విశ్వాసం పొందలేదు. (ఎమ్మెల్యేల)సంఖ్యలతో పాటు విశ్వసనీయత ప్రాతిపదికపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి” అని అన్నారాయన. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నామా? కొన్ని మీడియా సంస్థలు కూడా మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేదాన్ని మరుగుపరిచి డెమొక్రసీ కన్నా మాబోక్రసీకి వత్తాసు పలకటం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. గవర్నర్ ఇంకా జాగు చేయరని ఆశించుదాం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles