Home ఆఫ్ బీట్ ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు..

ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు..

ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలు అమ్మో పెద్ద పెద్ద కోర్సులు చేయాలి. చాలా క్రియేటివిటీ ఉండాలి. అది మనకెలా సాధ్యం అనుకుంటాం కదా.. ఎవరైనా ఫ్యాషన్ డిజైనర్ కావొచ్చని అంటున్నాడు అనుజ్ శర్మ. అనుజ్ అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్ అంటే ప్రొఫెషనల్, సెలబ్రిటీలకు మాత్రమే వస్త్రాలను డిజైన్ చేసేవాళ్లని అంతా
అనుకుంటారు. అసలు నా దృష్టిలో ప్రతి ఒక్కరూ సెలబ్రిటీలేనంటాడు అనుజ్. సరైన ఫ్యాబ్రిక్, కొన్ని బటన్స్, రబ్బర్‌బ్యాండ్స్ ఉంటే బట్టలు, బూట్లు, బ్యాగ్‌లు, రెయిన్‌కోటు తివాచీలు, కుషన్స్‌లాంటివి చక్కగా తయారుచేసేయొచ్చని చెబుతున్నాడు.
నేషనల్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి పిజి చేశాడు. యుకెలో మాస్టర్స్ ఇన్ స్పోర్ట్ డిజైనింగ్ చేశాడు. నిఫ్ట్‌లాంటి సంస్థల్లో చాలా కాలంపాటు ఫ్యాషన్ పాఠాలు చెప్పాడు. 2010 నుంచి బటన్‌మసాలా అనే పేరుతో టీచ్ చేస్తున్నాడు. ముంబయి స్లమ్ ఏరియాల్లో ఉండే పిల్లల కోసం రెయిన్‌కోట్లును డిజైన్ చేసి ఉచితంగా అందించాడు.

lf

బటన్ మసాలా ఇదేదో తినే ఐటంలాగా ఉందే అనుకుంటున్నారా..కాదు అనుజ్ తన డిజైనింగ్‌కు పెట్టుకున్న పేరు. అనుజ్ తయారు చేసిన వస్త్రాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. రకరకాల ఇల్యూషన్స్ నుంచి పుట్టుకువస్తాయి. రబ్బర్‌బ్యాండ్స్, బటన్స్‌లాంటివి ఉపయోగించి వస్త్రాలను డిజైన్ చేస్తాడు. ఇలా చేయడం చాలా తేలిక , వేగంవంతమైనదంటాడు. తన గురించి మాట్లాడుతూ… నేను చాలా బద్దకస్తుడిని. చేసే ప్రతి పనీ త్వరగా, సులభంగా అవ్వాలని కోరుకుంటాను. 2009లో ఇలాంటి ఆలోచనతో బటన్స్‌తో వస్త్రాలను తయారు చేయాలనుకున్నాను. కేవలం బటన్స్‌తో మాత్రమే కొత్త డిజైన్స్‌ను క్రియేట్ చేసి మార్కెట్ లోకి తెచ్చాను. దానికే బటన్ మసాలా అని పేరు పెట్టాను. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే ఓసారి నేను రోడ్డుపై వెళ్తుంటే ఒకతను తన షర్ట్‌కి తప్పుగా బటన్స్ పెట్టుకున్నాడు. కానీ అదికూడా ఏదో స్టైల్‌గా అనిపించింది. ఇదేదో చూట్టానికి బాగుందే అని అనుకున్నాను. అంతే దాన్నే నా కాన్సెప్ట్‌గా మార్చుకున్నానంటాడు.
బటన్స్‌తోపాటు రబ్బర్ బ్యాండ్స్‌ను చేర్చాడు. ఈ కాంబినేషన్స్‌లో చాలా డిజైన్స్ చేశాడు. 43 ఏళ్ల ఇతను ఏడేళ్ల నుంచి తన డిజైన్స్‌తో లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొంటున్నాడు. క్లయింట్స్ తన డిజైన్స్‌ను మెచ్చుకుంటున్నారు. మార్కెట్‌లో ఒక డిజైన్ నచ్చాలంటే దానికెంతో క్రియేటివిటీ ఉండాలి. అందుకే నేను వర్క్‌షాప్‌లను పెట్టాను. వాళ్ల అభిప్రాయాలను తెలుసుకున్నాను. నా బటన్‌మసాలా కోసం కొన్నాళ్లు ఫ్యాషన్స్ వీక్స్‌లో పాల్గొనడం ఆపేశాను. ప్రజల టేస్ట్ తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నేను తయారు చేసిన డ్రెస్‌లు ఎలా ధరించాలో నేర్పించాను. షర్ట్‌కి మధ్యలోనే బటన్స్ పెట్టుకోవాలనే రూల్‌ను తెంచేశాను. మనిష్టం ఎక్కడైనా పెట్టొచ్చు. ఎలాగైనా వాడొచ్చు అనేలా కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాను అని అంటున్నాడు.
అహ్మదాబాద్‌లో ప్రతి షాప్‌లో తన డిజైన్స్ ఉండేలా మార్చాడు అనుజ్. అంతే విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఇందుకోసం చాలా శ్రమ పడ్డాడు. బైక్‌పై అన్ని షాపులు తిరిగి తన డిజైన్‌కు పబ్లిసిటీ వచ్చేలా చేసుకున్నాడు. కావల్సిన మెటీరియల్‌ను తీసుకుని ఆర్డర్లపై డిజైన్ చేసి ఇచ్చేవాడు. అలా క్రమంగా ఎదిగి ఇప్పుడు ముంబయిలో రిటైల్ స్టోర్‌ను బటన్ మసాలా పేరుతో ఏర్పాటు చేశాడు. ఇప్పుడు తనకు పెద్ద పెద్ద సంఖ్యలో క్లయింట్స్ ఉన్నారు. తన సొంత వస్త్రంతో డిజైన్ చేస్తున్నాడు. ఒక్కోసారి బటన్స్‌కి బదులుగా కాయిన్స్, బాటిల్ మూతలు, మెటల్ కంటెయినర్స్, బాల్స్, కప్స్‌లాంటివి ఉపయోగిస్తాడు. అతని ఫ్యాబ్రిక్స్ కాటన్, నిట్, ఫ్లోరీ మల్‌మల్, జార్జట్ లాంటివి. అందరికీ ఫిట్ అయ్యేలా ఒకే డిజైన్ చేస్తాడు. హ్యాపీ ఫిట్ తన డ్రెస్ వేసుకున్నవారు ఇలా ఫీలవ్వాలనుకుంటాడు. ఆల్టరేషన్ కు అవకాశం లేకుండా చేస్తాడు. అందరికీ అందుబాటులో ఉండేలా, పర్యావరణానికి మేలుకలిగేలా ఎకోఫ్రెండ్లీలా తన డిజైన్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఇండియా, యూరోప్, ఆఫ్రికాల్లో దాదాపు 20వేల మందికి ఈ డిజైనింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చాడు. కాలేజీ యువత బటన్‌మసాలా టెక్నిక్స్‌ను అనుసరిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.