Thursday, April 25, 2024

హైదరాబాద్‌లో సిబిఐ కోర్టుకు హాజరైన ఎపి సిఎం జగన్ మోహన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

AP CM

 

సిఎం హోదాలో తొలిసారి న్యాయస్థానానికి జగన్
రెండు గంటల పాటు విచారణ
కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసుకు సం బంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఎపి సిఎం జగన్‌తో పాటు ఎంపి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు కోర్టుకు హాజరయ్యారు. రెండు గంటల పాటు సిఎం జగన్ సిబిఐ కోర్టులోనే ఉన్నారు. ఇదిలవుండగా ఎపి సిఎం హోదాలో జగన్ సిబిఐ కోర్టుకు రావడం ఇదే తొలిసారి. అయితే ఇడి కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడంతో ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో తన తరపున సహ నిందితుడు హాజరు అవుతారని, వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ న్యాయవాది కోరారు. గతంలోనూ జగన్ ఇదే విధంగా కోరడం తో ఆ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అప్పుడు తన తరపున న్యాయవాది హాజరౌతారని కోరిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

జగన్ ఆస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లను అన్నీ కలిపి ఒకేసారి విచారించాలని లాయర్ నిరంజన్ రెడ్డి పిటిషన్ వేశారు. జగన్ తరపు వాదనలను లాయర్ నిరంజన్ రెడ్డి.. మరోవైపు సిబిఐ తరపున సురేందర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇలా మొత్తం రెండు గంటల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. ఇరు వాదనలు విన్న అనతరం తదుపరి విచారణను కోర్టు ఈ నెల 17 కు వాయిదా వేసింది. గత ఏడాది మార్చి 1న చివరిసారిగా వైఎస్ జగన్ సిబిఐ న్యాయస్థానంలో హాజరయ్యాడు.

ఎపిలో అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచి జగన సిఎం కావడం, సిబిఐ కోర్టు తప్పకుండా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించడంతో సిఎం హోదాలో ఆయన హాజరయ్యాడు. వైఎస్ జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ తరచూ సిబిఐ కోర్టు కు గైర్హాజరుకావడంపై సిబిఐ కోర్టు న్యాయమూర్తి బి.ఆర్ మధుసూదనరావు గత వారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తదుపరి విచారణకు ఆయన, రెండో నిందితుడైన ఎంపి విజయసాయిరెడ్డి తప్పనిసరిగా హాజరుకావాలని లేనిపక్షంలో చర్యలకు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి రాక సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

మినహాయింపు ఇవ్వద్దు
అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా ఎన్ ఫో ర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సిఎం జగన్ చేసిన అభ్యర్థనపై సిబిఐ, ఇడి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. సిఎంగా ప్రజా విధు ల్లో ఉన్నందున హాజరు మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాదులు కోరడంతో ఇడి అభ్యంతరం తెలిపింది. తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితులకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దని వాదించింది. అనంతరం తీర్పును న్యాయస్థానం ఈనెల 24కు వాయిదా వేసింది.

మంత్రి సబిత, ధర్మానలకు సమన్లు
ఎపి సిఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎపి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మితో పాటు రిటైర్డ్ అధికారులకు సిబిఐ కోర్టు శుక్రవారం నాడు సమన్లు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ కు భూముల కేటాయింపు వ్యవహారంలో అవకతవకల విషయమై దాఖలైన అనుబంధ ఛార్జిషీట్ ను సిబిఐ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులు శామ్యూల్, వి.డి రాజగోపాల్, డిఆర్‌ఒ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 17న నిందితులు హాజరు కావాలని ఆదేశించింది.

కాగా నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గనుల శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. వీరితో పాటు ఆయా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సిబిఐ అనుబంధ ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ ను స్వీకరించవద్దంటూ జగన్ సహా నిందితుల తరఫు న్యాయవాదులు వాదించినప్పటికి వివరాల ఆధారంగా అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశామని న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది.ఇదిలా ఉండగా, ఈ కేసు వ్యవహారమై రెండేళ్ల క్రితమే సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, దీనిపై హైకోర్టు స్టే విధించింది తాజాగా స్టేను హైకోరు తొలగించడంతో దానిపై మళ్లీ సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది.

AP CM attending CBI court
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News