Home ఆంధ్రప్రదేశ్ వార్తలు శ్రీవారిని దర్శించుకున్న ఎపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

శ్రీవారిని దర్శించుకున్న ఎపి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌

తిరుమల: ఎపి కొత్త గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి ఆలయం వద్ద టిటిడి అధికారులు బిశ్వభూషణ్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా  ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్‌ను టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి, ఇఒ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సత్కరించారు. ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. చాలాకాలంగా  తిరుమలకు రావాలని అనుకుంటున్నప్పటికీ, వీలు పడలేదని ఆయన పేర్కొన్నారు.  టిటిడి పని విధానం  ప్రత్యేకంగా ఉందని పేర్కొన్నారు. ఇక్కడి పాలనా వ్యవహారాలు, పరిశుభ్రత గురించి ఎప్పటి నుంచో వింటున్నానని ఆయన చెప్పారు.

AP Governor Biswabhushan Harichandan Visits Tirumala