Home రంగారెడ్డి వాహనదారులకు శాపం

వాహనదారులకు శాపం

గందరగోళంగా మారిన వాహన స్టాంప్ డ్యూటీ
ఆర్టీఏ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయ లోపం

transportమన తెలంగాణ/సిటీబ్యూరో: గత ఏడాది నవంబర్ 26న విడుదల చేసిన జీవో నెం. 55 ఇటు ఆర్టీఏ అధికారుల్లో, అటు వాహనదారులను గందరగోళానికి గురిచేస్తున్నది. ఈ జీవో ప్రకారం వాహనం విలువలో 0.55 శాతం పన్నును ఒప్పంద రిజిస్ట్రేషన్‌కు చెల్లించాలని నిబంధనను ప్రభుత్వం విధించింది. దీనిపై  ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి మార్గ దర్శకాలు విడుదల చేయక పోవడం, అటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సైతం రవాణా కార్యాలయాల్లో  ఎటువంటి కౌంటర్లను ఏర్పాటు చేయడం కానీ. వాహన దారులకు అవగాహన కల్పించే చర్యలు కానీ తీసుకోక పోవడంతో తీవ్ర గందరగోళానికి గురిఅవుతున్నారు. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే వాహనదారులు చెల్లించే ఫ్రాం క్లింగ్ చార్జస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్యు మెంట్లు కావడం, దానిపై ఏపీ అని వుండటంతో అవి ఏ అకౌంట్‌కు వెళతాయో తెలియక అటు వాహనదారులు, ఇటు ఆర్టీఏ అధికారులు తీవ్ర గందరగోళానికి గురవుతు న్నారు. ముఖ్యంగా రవాణాశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష న్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో స్టాంప్ డ్యూటీ ఎక్కడ చెల్లించాలి, ఎవరికి చెల్లించాలో తెలియని అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వాహన రిజి స్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు ఆధారం చూపితే తప్ప వాహనం రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఫైనాన్షి యర్లు, వాహనదారులకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగానికి చేరే విధంగా ప్రతి వాహనంపై 0.5 శాతం చొప్పున స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకులు, సహకార సంస్థలు, ఇతర పెద్ద సంస్థలకు చెందిన కార్యకలాపాలు సక్రమంగా జరుగతున్నా వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ ఫైనాన్షి యర్ల విషయంలో మాత్రం సమస్యలు తప్పడం లేదు. ప్రభుత్వం జీవో ప్రకారం 0.5 శాతం చొప్పున ద్విచక్ర వాహనాలపై రూ.250 వరకు, కార్లు, ఇతర వాహనాలపై రూ.1500 నుంచి రూ.2500 వరకు వాహన స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి వుంటుంది. గ్రేటర్‌లోని వివిధ ప్రాం తీయ కార్యాలయాల్లో రోజు 1000 నుంచి 1500 వాహ నాలు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. మరో 500 వాహనాలు రుణ ప్రాతిపదికన చేతులు మారుతుంటాయి. అటువంటి వాహన రిజిస్ట్రేషన్ కోసం ఫారం 34 సమర్పించడానికి ముందు తప్పనిసరిగా వాహన యజమానికి, రుణదాతకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 0.5 శాతం స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. వాహనాలపై హైపోతికేషన్, లీజ్, అగ్రిమెంట్ తదితర అంశాలపైన కుదుర్చుకునే ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ చెల్లించాలని మోటారు వాహన చట్టంలోనే ఉంది. బ్యాంకులు, పెద్ద ఫైనాన్స్ సంస్థలు ఈ మేరకు ముందుస్తుగానే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగానికి కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలోని చిన్న చిన్న ఫైనాన్స్ సంస్థల జరిపే క్రయ, విక్రయాల్లో ఇది అమలు కాక పోవడంతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే స్టాంప్ డ్యూటీని ఆర్టీఏ కార్యాలయాల్లో తీసుకోవడం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ఖాతాలో జమ అయ్యేట్లుగా ఆధారం చూపితేనే వాహన రిజిస్ట్రేషన్ చేస్తామని చెబుతున్నాయి. ఈ చెల్లింపులకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం ఆర్టీఏ కార్యాలయాల్లో ఎటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కొందరు ఫైనాన్షియర్లు ఫ్రాంక్లింగ్ చేస్తున్నప్పటికీ అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముద్రతో వుం డటంలో ఆర్టీఏ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్ జాప్యం జరుగుతోంది.

ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు
ప్రభుత్వం విడుదల జీవో నెం 55 ప్రభావం నగరంలోని ఆర్టీఏ కార్యాలయాలపై పడింది.
దీంతో జీవో జారీ చేసిన ప్పటి నుంచి (గత ఏడాది నవంబర్ 26 నుంచి) ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సగానికి పైగా పడి పో యినట్లు సమాచారం. అంతే కాకుండా కొన్ని రిజి స్ట్రేషన్ కార్యాలయాల్లో జీవో జారీ చేయక ముందు ఫైనాన్స్‌లో తీసుకున్న వాహనాలను రిజిస్ట్రేషన్లను కూడా అధికారులు అత్యుత్సాహం చూపించి నిలిపివేశారని తెలిసింది.