Home తాజా వార్తలు ప్రభుత్వ విప్‌గా ‘రేగా’

ప్రభుత్వ విప్‌గా ‘రేగా’

 State Government Whip

 

భద్రాద్రి జిల్లాకు దక్కిన పదవి, మంత్రి బెర్త్‌కు ఖమ్మం జిల్లాకు క్లియరైన లైన్
మంత్రి పదవి రేసులో పువ్వాడ, సండ్ర, నేడు మంత్రి వర్గ విస్తరణ, అదృష్టం వరించేది ఏవరినో..?

రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నియమితులయ్యారు. ఈ నెల9 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌ల నియామకం జరిగింది. మొత్తం ఆరుగురిని విప్‌లుగా నియమించగా అందులో రేగా ఒక్కరు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఆయన ఇటివల టిఆర్‌ఎస్‌లో చేరారు. అభివృద్ధిలో వెనుకబడిన పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో అధికార టిఆర్‌ఎస్‌లో చేరారు. ఒక దశలో ఎస్టి కోటా నుంచి మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని లేదా ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులవుతారనే ప్రచారం కూడా జరిగింది. కాని ముఖ్యమంత్రి విప్‌గా అవకాశం కల్పించారు.

ఖమ్మం : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జిల్లాకు చెందిన మల్లు భట్టి విక్రమార్క్ ప్రభుత్వ చీఫ్ విప్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ హాయంలో ఉమ్మడి జిల్లాకు ప్రభుత్వవిప్ గా అవకాశం దక్కింది. యువకుడు,ఉత్సాహవంతుడైన రేగా నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తనను గెలిపించిన ప్రజలకు ఎదో చేయాలనే తలంపుతో పనిచేస్తున్నారు.అందుకే మొన్నటి ఎన్నికల్లో కేవలం ఒంటరిగా పోరాడి 20వేల మెజార్టీతో గెలుపొందారు. కరకగూడెం మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన రేగా కాంతారావు కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందినది.తల్లి దండ్రులతోపాటు చిన్నాన్న ఇతర బంధువులు సర్పంచ్‌గా,ఎంపిటిసిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ పాఠశాలలో పి ఇ టిగా పనిచేశారు.ఉద్యోగం రాక ముందు యువజన కాంగ్రెస్ లో చురుకుగా పనిచేశారు.

మాజీ ఎమ్మెల్యే చందాలింగయ్య శిష్యుడైన రేగా 2009 ఎన్నికల్లో తొలిసారిగా పిన పాక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి మహా కూటమిపైనే గెలిపొందారు.అప్పటి వరకు 30 ఏళ్ళకు పైగా పాగవేసిన కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కోటి ఘన విజయం సాధించారు.2014 ఎన్నికల్లో మిత్రపక్షాల పొత్తులో భాగంగా రేగాకు టిక్కెట్ ఇవ్వకుండా సిపిఐ పార్టీకి అవకాశం ఇచ్చింది.ఈ ఎన్నికల్లో వై ఎస్ ఆర్ సి పి నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు గెలుపొందారు. అయితే తనకు టిక్కేట్ ఇవ్వకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి పనిచేశారు.ఆ ఎన్నికల్లో ఆయన చేసిన కృషికి గాను టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా,వరంగల్ జిల్లా ఇంచార్జ్‌గా నియమితులయ్యారు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వేత్తున్న జరగుతున్న సమయంలో పినపాక నియోజకవర్గంలో ఐటిసి పేపర్ బోర్డు, కంపెనీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో, హేవి వాటర్ ప్లాంట్ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎన్నికల్లో, సింగరేణి కాలరిస్ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ టి యుసిని రేగా గెలిపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కకుండా సొంత పార్టీలోని కొంతమంది కట్ర చేసినప్పటికి సర్వే నివేదికల ఆధారంగా రేగాకే టిక్కెట్ ఇచ్చారు.అయినప్పటికి అతణ్ణి ఒడించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరిగినా,డిసిసి,టిపిసిసి మద్దతు లేకున్నా ఒంటరిగా ప్రజల్లో తిరిగా ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు.అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం, టి ఆర్ ఎస్ భారీ మెజార్టీతో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తనను నమ్మిన నియోజకవర్గ ప్రజలకు ఎదో ఒక్కటి చేయాలనే తలంపుతో కేవలం నియోజకవర్గ అభివృద్దిని దృష్టిలో పెట్టుకొని టి ఆర్ ఎస్‌లో చేరారు.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేగా కాంతారావుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గంలోని పలు అభివృద్ది పనులకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు.ఒక దశలో ఎస్టీ కోటా నుంచి రేగాను మంత్రి వర్గంలో తీసుకుంటారే ప్రచారం జరిగినప్పటికి క్యాబినేట్ హోదాగల విప్ పదవికి ఎంపిక చేశారు.ఇదే భద్రాద్రి జిల్లాకు చెందిన వనమా వెంకటేశ్వర్‌రావు,బానోతు హరి ప్రియ పేర్లు కూడా మంత్రి పదవి రేసులో విన్పించాయి.ఇప్పుడు రేగా కాంతారావుకు పదవి దక్కడంతో ఆ జిల్లాకు మంత్రి వర్గంలో ఇక స్ధానం లేనట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.రాజకీయాల్లోకి రాకముందే పి ఇటిగా విద్యార్ధులను కంట్రోల్‌లో పెట్టి వారి చేత ఆటలాడించిన రేగా ఇకపై అసెంబ్లీలోని ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తూ తిరిక సమయంలో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలను కూడా నిర్వహించబోతున్నారు.

ఖమ్మంకు లైన్ క్లియర్
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రేగా కాంతారావుకు ప్రభుత్వ విప్‌గా అవకాశం దక్కడంంతో త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఖమ్మం జిల్లాకు మంత్రి పదవి దక్కడం ఖాయంగా తెలుస్తోంది.అంతేగాక మంత్రి పదవిని ఆశిస్తున్న పువ్వాడ అజేయ్ కుమార్ కు కూడా లైన్ క్లియరైనట్లు జిల్లా టి ఆర్ ఎస్ నాయకులు భావిస్తున్నారు.మొన్నటి వరకు మంత్రి పదవి రేసులో ఉన్న పువ్వాడ సామాజీకవర్గానికి చెందిన ఆరికపూడి గాంధి కి కూడా ప్రభుత్వ విప్ పదవి దక్కడంతో పువ్వాడకు మంత్రి పదవి ఖాయమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టి ఆర్ ఎస్ పార్టీ తరుపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అజేయ్ కావడం,రెండో సారి ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు స్నేహితుడైనందునా పువ్వాడకే మంత్రి వర్గంలో బెర్త్ దక్కుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.అయితే ఇదే జిల్లా నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా మంత్రి పదవీని ఆశిస్తున్న విషయం తెలిసిందే.

Appointed of Rega Kantarao as State Government Whip