Friday, April 19, 2024

ఎపి శాసన మండలి రద్దుకు పార్లమెంట్‌లో అవరోధాలు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: శాసనమండలిని రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమోదించిన తీర్మానానికి పార్లమెంట్‌లో అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో శాసన మండలుల ఏర్పాటు కోసం ప్రతిపాదిస్తున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి రద్దుకు ఆమోదించకపోవచ్చంటూ జాతీయ ఇంగ్లీష్ దినపత్రిక హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. అంతేగాక ఇటువంటి అంశాలలో ఒక జాతీయ విధానం ఉండాల్సిన అవసరం ఉందని ఒక పార్లమెంటరీ కమిటీ గతంలో చేసిన సిఫార్సును కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు, సిఆర్‌డిఎ రద్దుకు సంబంధించిన రెండు బిల్లులను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించగా వీటికి శాసనమండలిలో అవరోధం ఏర్పడిన విషయం తెలిసిందే. దరిమిలా మండలి రద్దుకు సంబంధించిన తీర్మానాన్ని ఎపి ప్రభుత్వం అసెంబ్లీలో గత సోమవారం ఆమోదించి కేంద్రానికి పంపించింది. కాగా, దీని ఆమోదానికి కేంద్రం పార్లమెంట్‌లో ఒక బిల్లును తీసుకురావలసి ఉంటుంది.
ఆ పత్రిక కథనం ప్రకారం..కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, బిజెపి పాలిత అస్సాంలో శాసన మండలుల ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులు అనేక సంవత్సరాలుగా పార్లమెంట్ ఎదుట పెండింగ్‌లో ఉన్నాయని పార్లమెంటరీ అధికారులు చెబుతున్నారు. రాజస్థాన్‌లో గత వసుంధరా రాజే సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం, అస్సాంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో తమ రాష్ట్రాలలో శాసన మండలులు ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానాలను ఆమోదించి కేంద్రానికి పంపించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు కేవలం పార్లమెంట్‌లో చట్టం చేయడం ద్వారానే సాధ్యపడుతుంది. కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు విషయంలో మాత్రం కేంద్రం తొందరపడే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
రాజస్థాన్, అస్సాంలో శాసన మండలు ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులపై పార్లమెంటరీ కమిటీ ఒకటి అధ్యయనం జరిపి 2013 డిసెంబద్‌లో రాజస్థాన్ ప్రతిపాదనపై తన నివేదికను అందచేసింది. శాసన మండలుల ఏర్పాటు లేదా రద్దుకు సంబంధించి ఒక జాతీయ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఎగువ సభ లేదా రెండవ సభ మనుగడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండకూడదని కమిటీ అభిప్రాయపడింది. శాసన మండలి అనేది తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేయడం తగదని, ఒక ప్రభుత్వం దాని ఏర్పాటుకు సిఫార్సు చేస్తే తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరుగుతోందని కమిటీ పేర్కొంది. 2014 ఫిబ్రవరిలో అస్సాంపై కూడా కమిటీ ఇదే వైఖరిని మరో నివేదికలో స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో 1985లో అప్పటి ఎన్టీఆర్ సారథ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయగా 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మళ్లీ పునరుద్ధరించింది. అదే విధంగా పంజాబ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో 1969, 1986లో శాసన మండలులు రద్దు అయ్యాయి. తమిళనాడులో శాసన మండలి పునర్ధురణకు 2010లో పార్లమెంట్ ఒక బిల్లును ఆమోదించినప్పటికీ అది నోటిఫై కాలేదు. కాగా, 2012లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం 2010 నాటి చట్టాన్ని రద్దు చేయాలని ప్రతిపాదించింది.
ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లో శాసన మండలి ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్న తాము ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలి రద్దును ఎలా సమర్థిస్తామని ఒక బిజెపి నాయకుడు ప్రశ్నించినట్లు ఆ పత్రిక తెలిపింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక వ్యూహకర్త కూడా ఎపిలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసినట్లు ఆ పత్రిక తెలిపింది.

APs Council repeal move may face Parliament hurdle

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News