*భారీగా పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెరగక 20 లక్షల మంది ప్రైవేటు కార్మికుల కష్టాలు
మన తెలంగాణ / హైదరాబాద్ : మార్కెట్‌లో పెరిగిన నిత్యావసరాల ధరలు, ఇతర అవసరాల కు అనుగుణంగా జీతభత్యాలు లభించక ప్రైవేటు కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెక్కాడితేగా నీ డొక్కాడని వీరి బతుకులు దినదినగండంగా మారుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4 వేలకు పైగా ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమ ల్లో ఒక్క హైదరాబాద్‌లోనే సగానికి పైగా (సుమారు 2,500) ఉన్నాయి. ముఖ్యంగా ఆటో మొబైల్, స్టేషనరీ, ప్రింటింగ్ ప్రెస్, తోళ్ళ పరిశ్రమ, లేత్ మిషన్ కట్టింగ్ యానిట్లు, కాటన్, జిన్నింగ్ పరిశ్రమలు, పవర్‌లూమ్ వీవింగ్ పరిశ్రమలు, కార్పెట్ తయారీ పరిశ్రమలు.. ఇలా అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలున్నాయి. వీటిల్లో సుమా రు 20 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నట్లు అంచనా. హైదరాబాద్ నగరంలోనే 10 లక్షల మంది కార్మికులు ఈ పరిశ్రమల్లో పని చేస్తున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కానీ ఈ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు సరైన వేతనా లు మాత్రం లభించడం లేదు. రోజుకు 8 గంటలు పని నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. 10 గంటల పాటు పనిచేయాల్సి వస్తోంది. అయి నా పనికి తగిన వేతనాలు అందడం లేదు. నెలకు 8 వేల నుండి 10 వేల లోపు వేతనాలనే యాజమాన్యాలు చెల్లిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని కనీస వేతనంగా 18 నుండి 20 వేల వరకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగంలోని పలు సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా తమ వేతనాలను 20 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం గత ఏడాది లో జిఒ నెం. 16 ద్వారా పలువురి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించింది. వీరిలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో 125 మంది ఏఈలు, అటవీశాఖలో 130 మంది పార్ట్‌టైమ్ కంటిజెన్సీ, అలాగే జూనియర్, సినియర్ అసిస్టెంట్లు ఉన్నారు. పారా మెడికల్, లాబ్ టెక్నీషియన్‌కు సంబంధించి కూడా 280 మంది, హెల్త్ అసిస్టెంట్లు 33 మంది సిబ్బందిని రెగ్యులరైజ్ చేసింది. ఇంకా సుమారు 28 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది రెగ్యులరైజేషన్ కోసం నిరీక్షిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం కొర్రీలు వేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కొందరిని ప్రభుత్వం సీనియారిటీ, విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను క్రమబద్దీకరించింది. అసంఘటిత రంగంలోని కార్మికుల్లో సెక్యూరిటీ గార్డుల వేతనాలు గొర్రె తోక చందంగా ఉన్నాయి. యాజమాన్యం దయాదాక్షిణ్యాల మీదనే వీరికి వేతనాలు అందుతున్నాయి. ఒక్కో సెక్యూరిటీ గార్డు రోజుకు 8 నుండి 12 గంటల పాటు పని చేస్తున్నా వీరికి అందుతున్న జీతం మాత్రం రూ. 8000 నుంచి రూ. 12000 దాటడం లేదు. నిజానికి ఈ సెక్యూరిటి గార్డులు పని చేస్తున్న సంస్థలు, క్రమం తప్పకుండా కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లిస్తున్నా అందులో కొంత మొత్తాన్ని కమిషన్‌గా తీసుకుని మిగతా మొత్తాన్ని (రూ8 వేలు) వేతనాలుగా చెల్లిస్తున్నాయి. కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షతన మినిమం వేజ్ అడ్వయిజరీ బోర్డును నియమించినా ప్రభుత్వం దాని సిఫారసులను మాత్రం అమలు చేయడం లేదు.