Home ఎడిటోరియల్ సిక్కు మతంలోనూ దళితులున్నారా?

సిక్కు మతంలోనూ దళితులున్నారా?

Are there Dalits in Sikhism too?

 

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ ఎంపిక చేయగానే తొలిసారిగా దళితుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నాడనే వార్త ప్రాధాన్యతను పొందింది. దానికి తోడు సిక్కుల్లో దళిత సిక్కులున్నారా అనే అనుమానం కూడా సర్వత్రా వ్యక్తమైంది. కొన్ని ఇంగ్లీషు పత్రికలు కూడా ఈ శీర్షికతో కథనాలు రాసాయంటే నిజంగానే ఈ ప్రశ్నకు వివరమైన సమాధానం అవసరమే. పేరు చివరన సింగ్, కౌర్ ఉన్న సిక్కులంతా మగ, ఆడ అనుకున్నారు కాని వారిలోనూ కుల విభజన ఉందని చాలా మట్టుకు అనుకోలేదు. హిందువుల్లో దళితులున్నట్టే సిక్కుల్లోనూ నిచ్చెన మెట్ల సంప్రదాయం రీతిలో వివిధ పేర్లతో దళితులు కొనసాగుతున్నారని చరిత్ర చెబుతోంది.

వాస్తవానికి సిక్కు మతం మనుషులంతా సమానమేనని బోధిస్తుంది. సిక్కు గురువుల ప్రభోధాల వల్ల వారి మత సంస్థలైన సంగత్, లంగర్ వ్యవస్థలో అందరూ సమానంగా గౌరవించబడతారు. వర్ణాశ్రమ ధర్మం హిందువులదే గాని సిక్కులు దానికి దూరమని ఆ మతం చెబుతోంది. దాని ఆధారంగానే మేము హిందువులము కామని సిక్కులు చెబుతుంటారు. అయితే క్రమంగా సిక్కుల్లోనూ బ్రాహ్మణీయ సంప్రదాయాల ప్రభావంతో కుల వివక్ష మొదలైంది. సిక్కు తొలి గురువులు అన్ని జాతుల వారిని కలుపుకొని సిక్కు మత విస్తృతికి పాటుపడుతూ అణగారిన వర్గాలకు ఆలంబనను, సౌభ్రాతృత్వాన్ని అందించగా ఆ తర్వాతి కాలంలో సిక్కుల్లో కలిసిన శ్రామిక వర్గ, దళిత జాతులను దూరం పెట్టడం కనిపిస్తుంది.

హిందూ దళితులకు దేవాలయ ప్రవేశం లేని కాలంలో సిక్కులు తమలోని దళితులను ఆలయ ప్రవేశానికి అనుమతిని ఇచ్చే వారు గాని అందరితో కలిసి కాకుండా విడిగా వెళ్లి పూజలు నిర్వహించుకోవాలి. అదే రకంగా ఇప్పటికీ గ్రామాల్లో సిక్కు దళితుల శ్మశానాలు వేరుగా కొనసాగుతున్నాయి. దళితులు తయారు చేసుకొచ్చిన కరా ప్రసాదాన్ని దేవుడి ముందు ఉంచే వీలు లేకుండె. 12.10.1920 నాడు దళిత సిక్కులు, ఖల్సా బరాదరి అనే పేరిట ఊరేగింపుగా జలియన్ వాలాబాగ్ నుండి దర్బార్ సాహిబ్ దాకా వెళ్లారు. పూజారిగా ఉన్న వ్యక్తి భయపడి పారిపోగా వారు తెచ్చిన ప్రసాదాన్ని దర్బార్ సాహిబ్‌కు సమర్పించారు. ఆ సందర్భంగా అక్కడ గుమిగూడిన ప్రజల ముందు ఖల్సా బరాదరీ సభ్యులు గురుగ్రంథ్ సాహిబ్‌లోని వాక్కులను చదివి వినిపించారు. సిక్కు మూడో గురువు గురు అమర్ దాస్ ఉద్బోధించిన సమానత్వాన్ని చాటి చెప్పిన పంక్తుల్ని ఉటంకించారు. ఆ తర్వాత హర్‌మిందర్ సాహిబ్ వద్ద కూడా కరాప్రసాద సమర్పణకు అవకాశం దొరికింది. సిక్కుల్లోనే ఉన్న ఉదాసి తెగకు చెందిన మహంతులు బ్రాహ్మణీయ, హిందూమత వర్ణ వ్యవస్థను తమ మతంలో చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

హిందూ మత వివక్షతో బాధలు అనుభవిస్తున్న దళితులను సిక్కు మతంలో చేరేందుకు 1936లో బాబా సాహెబ్ అంబేడ్కర్ అంగీకరించినట్లు రుజువులున్నాయి. 1956లో ఆయన బౌద్ధమతం స్వీకరించే దాకా ఈ ఆలోచన కొనసాగింది. సిక్కు మతంలోనూ దళితులు ఉన్నారని ఆయనకు స్పష్టంగా తెలిసినందు వల్లే సిక్కుల్లోని దళితులకు రాజ్యాంగపరంగా వచ్చే రిజర్వేషన్, తదితర సదుపాయాలు దక్కేలా చేశాడు. దేశ సైన్యం అనగానే తలపాగాలతో సిక్కులే కనిపిస్తారు. వారిలో సిక్కు మతంలోని అన్ని జాతుల వారున్నా దళితుల సంఖ్యనే ఎక్కువ. బ్రిటిష్ కాలంలోనూ దళిత సిక్కులు సైన్యంలో పని చేశారు. సిక్కుల్లో 60 శాతం పైగా జాట్‌ల జనాభానే ఉంటుంది. గ్రామాల్లో వ్యవసాయాధారం జీవించే వారు అగ్రకులస్థుల కిందికి లెక్క. ఖత్రి, అరోరాలు వ్యాపార కులాలు. సంఖ్యాపరంగా వీరు తక్కువ ఉన్నా వ్యాపార, వాణిజ్యాల్లో వీరిదే ఆధిపత్యం. రామ ఘరియాలంతా చేతి వృత్తుల వారు. అహ్లువాలియాలు గౌడ వృత్తిదారులు. దళితుల్లో మజెహబీలు, రామ్ దాసియాలు ఎక్కువ.

పంజాబ్ జనాభాలో 60 శాతం సిక్కులు, 40 శాతం హిందువులున్నారు. సిక్కుల్లో 32 శాతం దళితులు, 25 శాతం అగ్ర కులాలవారున్నారు. ఈ అగ్ర కులాల చేతుల్లోనే వ్యవసాయం, వాణిజ్యం, రాజకీయ ప్రాబల్యం ఉంది. వ్యవసాయ భూముల్లో కేవలం 6 శాతం నేల మాత్రమే దళితులది. దేశంలో అన్ని ప్రాంతాల మాదిరే పంజాబ్‌లో కూడా దళితుల రాజకీయ ఎదుగుదల ఇబ్బందుల, ఆటంకాలమయమే. కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ రామ్ దాసియా దళితుడు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరాడు. రాష్ట్రంలోని 32 శాతం దళితుల్లో రామ్ దాసీలు 14 శాతం ఉంటారు. ఈ లెక్కనే చరణ్ జిత్‌ను ముఖ్యమంత్రి పీఠం దాకా తెచ్చింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే దళితుడే ముఖ్యమంత్రి అని బిజెపి ప్రకటించినందున కాంగ్రె స్ ఒక అడుగు ముందుకేసి ఇప్పుడే దళితుడ్ని సిఎం చేసి చూపుతోంది. ఇన్నేండ్లకు పంజాబ్ పీఠాన్ని దళితుడికి అప్పగించేందుకు అనివార్యంగా కాంగ్రెస్ ముందుకొచ్చిందన్న మాట.

పంజాబ్‌లో గ్రామీణ జనాభా 72 శాతం. ఇంత పల్లె జనం ఉన్న రాష్ట్రం దేశంలో మరోటి లేదు. నైసర్గీకంగా చూసినా 80 శాతం గ్రామాలే. పైకి ఒక్కలా కనిపించే సిక్కులు పెళ్లిళ్లు కూడా జాతుల మధ్యనే చేసుకుంటారు. జాట్‌లు జాట్‌లతో, ఖత్రిలు ఖత్రిలతో సంబంధాలు అందుకుంటారు.

1675లో సిక్కుల తొమ్మిదో గురువు గురుతేగ్ బహదూర్ ఢిల్లీలో మొగలుల చేతిలో ఓడిపోయి తల నరికివేతకు గురైనపుడు దళితుడైన బాయి జైతాజీ ఆయన తలను తీసుకొచ్చి తేగ్ కుమారుడైన గురుగోవింద్ సింగ్‌కు ఇచ్చినందుకు గుర్తింపుగా దళితులను సిక్కు మతంలోకి అనుమతించాడు. బాయి జైతా రంగ్రే తాను గురువు పుత్రుడిగా ప్రకటించాడు. కాలక్రమంగా మాత్రం జాతుల వివక్ష పెరిగిపోయింది. దీన్ని ఆసరా చేసుకొని కొన్ని హిందూ సంస్థలు సిక్కు దళితులను వెనక్కి తిరిగి హిందువుల్లో చేరేలా ప్రయత్నిస్తున్నాయి. బ్రిటిష్ పాలన కాలంలో క్రైస్తవ మతం కూడా సిక్కు దళితులను తమ వెంట వచ్చేలా ప్రోత్సహించింది.

అయితే పంజాబ్ దళిత సంఘాలు మాత్రం తమ హక్కులను కాపాడుకునేలా అడుగులు వేస్తున్నాయి. 12 అక్టోబర్ 2020న తాము స్వర్ణ దేవాలయం, అకల్ తక్త్‌లలో కరా ప్రసాదాన్ని సమర్పించి వందేళ్లయిన సందర్భాన్ని ఘనంగా నిర్వహించుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కు దళితులు గ్లోబస్ సిక్ కౌన్సిల్, బాబా బీర్ సింగ్ ఫౌండేషన్, ఆనంద్‌పూర్ హెరిటేజ్ ఫౌండేషన్‌ల నేతృత్వంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటరానితనం మతాల్లో కాదు మనుషుల్లో ఉన్నంత కాలం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంటుందని సిక్కు దళితుల చరిత్ర ద్వారా తెలుస్తోంది.