Tuesday, April 23, 2024

రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్‌కు మొట్టమొదటి వ్యాక్సిన్ “అరెక్స్‌వీ”

- Advertisement -
- Advertisement -

అరవై ఏళ్లు దాటిన వయోవృద్ధులకు, చిన్నారులకు సంక్రమించే రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ నివారణకు తయారైన మొట్టమొదటి వ్యాక్సిన్ “అరెక్స్‌వీ”( arexvy) ను ఈనెల 3 బుధవారం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ( fda) ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ జిఎస్‌కె (gsk) తయారు చేసింది. అమెరికాలో 60 ఏళ్లు పైబడిన వారికి ఉపయోగించడానికి ఆమోదమైంది. ఈ వ్యాక్సిన్ ఒక సహాయకుడు లేదా టీకాకు బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను సృష్టించడంలో సహాయపడే పదార్ధాన్ని కలిగి ఉంటుంది.

వృద్ధుల్లో శ్వాసకోశ సిన్సిటియల్ వైరస్ వల్ల వచ్చే తక్కువ శ్వాసకోశ వ్యాధిని నివారించడం ఈ టీకా లక్షం. ఈ వ్యాక్సిన్‌ను 2023/2024 శ్వాసకోశ సిన్సిటియల్ సీజన్‌కు ముందు అమెరికాలో ప్రారంభించాలని భావిస్తున్నారు. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అనేది తీవ్రమైన అంటువ్యాధి అయిన శ్వాసకోశ వైరస్. దగ్గు, తుమ్ములు, జ్వరం, గురక, ముక్కునుంచి కారటం, ఆకలి తగ్గడం, వంటి లక్షణాలు దీనివల్ల కలుగుతాయి. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకోడానికి ఒక వారం లేదా రెండు రోజులు పడుతుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కలిగిస్తుంది.

ముఖ్యంగా పిల్లలు, పెద్దల్లో ఈ ఇన్‌ఫెక్షన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో ఈ వైరస్ పిల్లల్లో అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ఊపిరితిత్తుల్లోని చిన్న వాయుమార్గాల వాపు, న్యుమోనియా లేదా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కలిగిస్తుంది. వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధి ప్రబలడానికి ఇదోకారణం. దిగువ శ్వాసకోశ వ్యాధి ఊపిరి తిత్తులను ప్రభావితం చేస్తుంది. అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం అమెరికాలో రెండేళ్ల లోపు పిల్లలందరికీ ఈ వైరస్ సోకిందని చెబుతున్నారు. దీర్ఘకాలిక ఊపిరి తిత్తుల వ్యాధి, లేదా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులున్న పిల్లలకు ఈ వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో ఐదేళ్లు కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఏటా 58,000 మంది ఈ వైరస్‌తో సతమతమవుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 64 మిలియన్ల మంది ప్రజలు ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్‌తోనే బాధపడుతున్నారని అంచనా. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1,60,000 మంది ఈ వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్ గాలి ద్వారా సంక్రమిస్తుంది. అలాగే రోగి వాడే వస్తువుల ద్వారా కూడా వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ముల ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ నివారణ చికిత్సల్లో ఓవర్‌దికౌంటర్ నొప్పి నివారణలు ఉంటాయి. ఇవి వైరస్ వల్ల కలిగే నొప్పి, జ్వరాన్ని తగ్గిస్తాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తులు తప్పనిసరిగా హైడ్రేటెడ్‌గా ఉండాలి. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ అయితే ఆస్పత్రికి వెళ్లడం మంచిది. ఆక్సిజన్ సహాయం తీసుకోవాలి. ఇది ఆస్తమా, క్రానిక్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి సహ రుగ్మతలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఫలితంగా మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎఫ్‌డిఎ ఆమోదం పొందిన అరెక్సీ వ్యాక్సిన్ వృద్ధుల్లో 94.6 శాతం సమర్ధత చూపించినట్టు వ్యాక్సిన్ తయారీ సంస్థ జిఎస్‌కె ప్రకటించింది. కొవిడ్ 19 మహమ్మారి వ్యాప్తి చెందక ముందు ప్రతి ఏడాది 27 లక్షల మంది చిన్నారులు రెస్పిరేటరీ సిన్సిటల్ వైరస్ బారిన పడేవారని నివేదికలు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News