Home ఆఫ్ బీట్ అర్జున్ రెడ్డి సక్సెస్ కు తెలంగాణ యాస, భాషే కారణం!!

అర్జున్ రెడ్డి సక్సెస్ కు తెలంగాణ యాస, భాషే కారణం!!

Arjun Reddy Success is cause of Telangana slang language

దేవరకొండ ఇంటి నుంచి మరో హీరో..                                                                                                                        నేను హీరోను కాలేకపోయా                                                                                                                                        విజయ్ దేవరకొండ తండ్రి

ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషపడిపోతారు. ఒకప్పుడు తాను రాణించాలనుకున్న రంగంలో తనయుడు దూసుకుపోతుంటే ఆ సమయంలో తండ్రికి కలిగే ఆనందం వర్ణనాతీతంగా ఉంటుంది. అలాంటి మధురానుభూతిని పొందుతున్నారు దేవరకొండ గోవర్ధన్‌రావు. ఆయన పెద్దబ్బాయి విజయ్ దేవరకొండ నేడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యంగ్‌స్టార్‌గా దూసుకుపోతున్నాడు. అర్జున్‌రెడ్డి, పెళ్లి చూపులు వంటి హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. దీంతో అతని తల్లిదండ్రులు దేవరకొండ గోవర్ధన్‌రావు, మాధవి దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఒక్కసారి యంగ్‌స్టార్‌గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో విజయ్ తండ్రి దేవరకొండ గోవర్ధన్‌రావుతో ఇంటర్వూ.. 

నటుడిని కావాలనుకునేవాడిని…

నాగర్‌కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండంలోని తుమ్మన్‌పేట్ గ్రామం మా స్వస్థలం. మాది దొరల కుటుంబం. నాకు చిన్నతనం నుంచే సినిమాలంటే ఎంతో ఆసక్తి. సినిమాలను బాగా చూసేవాడిని. నాకు నటుడిని కావాలనే కోరిక బలంగా ఉండేది.

యాక్టింగ్ కోర్సు చేశాను…

డిగ్రీ చదువుకోవడానికి 1982లో హైదరాబాద్‌కు వచ్చాను. ఈ మహానగరానికి వచ్చిన తర్వాత సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. డిగ్రీ పూర్తయిన తర్వాత నటుడిని కావాలనుకొని 1986లో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. అక్కడ యాక్టింగ్ కోర్సు పూర్తిచేశాను. ఈ ఇనిస్టిట్యూట్‌లో ఉన్నప్పుడే చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు పరిచయమయ్యారు. అయితే 1988లో నా వివాహం మాధవితో జరిగింది. వారిది రాకొండ గ్రామం. మా పెద్దబ్బాయి విజయ్ దేవరకొండ 1989 మే 9న జన్మించాడు.

టివి సీరియల్స్‌కు దర్శకత్వం…

యాక్టింగ్ కోర్సు పూర్తిచేసిన తర్వాత పలు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాను. కానీ చివరికి నా మనసు డైరెక్షన్ వైపు మళ్లింది. కొన్ని సినిమాలకు దర్శకత్వ విభాగంలో పనిచేశాను. ఆ తర్వాత టివి సీరియల్స్ వైపు దృష్టిపెట్టాను. 1998 నుంచి 2010 వరకు టివి సీరియల్స్ చేశాను. దాదాపు అన్ని ఛానళ్లలో 10కి పైగా టివి సీరియల్స్ చేయడం జరిగింది. జయసుధ, యమునతో కలిసి చేసిన ‘తోడి కోడళ్లు’ సీరియల్ నాకు మంచి పేరు తెచ్చింది. ఉదయభాను, శిల్పాచక్రవర్తి వంటి వారు మా సీరియల్స్‌లో నటించి ఆపైన యాంకర్లుగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. నేను యాడ్ ఫిల్మ్ కూడా చేశాను.

చిన్నప్పటి నుంచే హీరో కావాలనుకునేవాడు…

అప్పట్లో మేము హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో ఉండేవాళ్లం. మా పెద్దబ్బాయి విజయ్ దేవరకొండ యుకెజి వరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాడు. ఆ
తర్వాత పుట్టపర్తిలోని సత్యసాయి ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. విజయ్‌కి చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి. స్కూల్లో చదువుకుంటున్నప్పుడే ‘మా నాన్న డైరెక్టర్’ అని విజయ్ చెబితే… అతని స్నేహితులు ‘నువ్వు హీరోవి అవుతావు’ అనేవారు. దీంతో హీరో కావాలన్న కోరిక బలంగా అతని మనసులో నాటుకుపోయింది.

ఇంట్లో కూడా ఇంగ్లీష్‌లో మాట్లాడేవాడు…

పుట్టపర్తి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ పిల్లలంతా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలనే నిబంధన ఉండేది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు అక్కడికి వచ్చి చదువుకునేవారు. దీంతో చిన్నతనం నుంచే విజయ్ చాలా చక్కగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండేవాడు. ఇప్పటికీ తన స్నేహితులతో తెలుగుకంటే ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతాడు. సెలవుల్లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఇంట్లో తల్లితో కూడా ఇంగ్లీష్‌లోనే సంభాషించేవాడు. ఇది నాకు కొత్తగా అనిపించేది. నా స్నేహితులు పలువురు ‘మీ కొడుకు తెలుగుకంటే ఇంగ్లీషే బాగా మాట్లాడుతాడు’ అనేవారు.

విజయ్‌కి క్రికెట్ అంటే ఇష్టం…

విజయ్ దేవరకొండ చిన్నతనం నుంచే ఎంతో చురుకుగా ఉండేవాడు. పుట్టపర్తి స్కూల్లో చదువుకుంటున్నప్పుడు వేసవి సెలవులు, పండుగ సెలవుల్లో హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చేవాడు. అతనికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అప్పట్లో శ్రీనగర్‌కాలనీలోని గణపతి కాంప్లెక్స్ వెనుక పెద్ద ప్లే గ్రౌండ్ ఉండేది. అక్కడే పిల్లలతో కలిసి రోజంతా క్రికెట్ ఆడేవాడు.

అప్పుడే హీరో చేయాలని అనుకున్నా…

నేను టివి సీరియల్స్ డైరెక్టర్‌ను కాబట్టి ప్రతిరోజు మా ఇంటికి నటీనటులు, టెక్నీషియన్స్ వస్తుండేవారు. విజయ్ వారిని ఎంతో ఆసక్తిగా గమనిస్తుండేవాడు. వారితో యాక్టింగ్ గురించి మాట్లాడేవాడు. ఎలాగైనా హీరో కావాలనుకునేవాడు. కొన్నిసార్లు నాతో షూటింగ్ లొకేషన్స్‌కు కూడా వచ్చి షూటింగ్ చూస్తూ కూర్చునేవాడు. నటీనటుల హావభావాలను జాగ్రత్తగా గమనిస్తుండేవాడు. అప్పుడే విజయ్‌ని ఎలాగైనా హీరోను చేయాలనుకున్నాను.

మోడల్‌గానూ రాణించాడు…

పుట్టపర్తిలో చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చి విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంటర్మీడియట్, కాచిగూడలోని బద్రుకా కాలేజీలో బికామ్ చేశాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే స్వర్ణ మాస్టర్ వద్ద డాన్స్ నేర్చుకున్నాడు. యాక్టింగ్, ఫైట్స్‌లో కూడా శిక్షణనిప్పించాను. అప్పట్లో అంజు మహేంద్ర అనే డ్యాన్స్ మాస్టర్ కూడా విజయ్‌కి డ్యాన్స్ నేర్పించాడు. భవిష్యత్తులో మా అబ్బాయి పెద్ద హీరో అవుతాడని అతను నాతో చెబుతుండేవాడు. అలాగే మోడల్ కావాలనే కోరిక కూడా విజయ్‌కి కలిగింది. అప్పట్లో ఓ ప్రముఖ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ వద్ద మోడలింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆతర్వాత ఫ్యాషన్ షోలలో ర్యాంప్‌వాక్ చేశాడు. ఇవన్నీ గ్లామర్ ప్రపంచమైన సినీ రంగంవైపు అతన్ని నడిపించాయి.

నాటక ప్రదర్శనలిచ్చాడు…

నటనపై ఉన్న ఆసక్తితో డ్రామాల్లో కూడా నటించాడు విజయ్ దేవరకొండ. అప్పట్లో ‘సూత్రధార్’ అనే థియేటర్ గ్రూప్‌తో కలిసి నాటకాల్లో నటించాడు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పలుసార్లు నాటకాలు వేశాడు. అదే
విధంగా ‘ఇంజీనియమ్ డ్రామటిక్స్’ అనే థియేటర్ గ్రూప్‌తో కూడా కలిసి పనిచేశాడు.

పలువురు హీరోగా పరిచయం చేస్తామన్నారు… 

విజయ్‌దేవరకొండను హీరోగా చేయాలని రామ్‌గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన ఫొటోగ్రాఫర్‌తో 2009లో ఫొటోషూట్ చేయించాను. అప్పట్లో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ విజయ్‌ను చూసి అతన్ని హీరోగా పరిచయం చేస్తానని అన్నారు. అదేవిధంగా 2010లో తేజ కూడా హీరోగా పరిచయం చేస్తానని చెప్పడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. తేజ వద్ద విజయ్ కొంతకాలం అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పనిచేశాడు.

‘నువ్విలా’తో సినిమాల్లోకి… 

2011లో దర్శకుడు రవిబాబు రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘నువ్విలా’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు విజయ్ దేవరకొండ. అనంతరం శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నటించాడు. ఈ చిత్రాలు విజయ్‌కి నటుడిగా మంచి గుర్తింపునిచ్చాయి. ‘మహానటి’ దర్శకుడు నాగ్‌అశ్విన్ తన కెరీర్ ప్రారంభంలో విజయ్‌తో కొన్ని యాడ్ ఫిల్మ్ చేశాడు. ఆతర్వాత నాగ్‌అశ్విన్ ‘ఎవడే సుబ్రమణ్యం’ (2015)లో విజయ్‌కి సెకండ్ హీరోగా అవకాశం ఇచ్చాడు.
కెరీర్‌ను మలుపుతిప్పిన ‘అర్జున్‌రెడ్డి’… తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘పెళ్లిచూపులు’ మంచి విజయాన్ని అందుకోవడంతో విజయ్ కెరీర్ ఊపందుకుంది. అయితే 2017లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం విజయ్‌కు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. విజయ్‌కి యూత్‌లో మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. నాగ్‌అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి బయోపిక్ ‘మహానటి’ చిత్రం కూడా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

పెద్ద బ్యానర్‌లలో అవకాశాలు…

‘అర్జున్‌రెడ్డి’ తెచ్చిన స్టార్ ఇమేజ్‌తో విజయ్‌దేవరకొండకు పెద్ద బ్యానర్‌లలో సినిమాలు చేసే అవకాశాలు వచ్చాయి. దాదాపు 10, 15 సినిమాల ఆఫర్లు అతనికి వచ్చాయి. ఈ నేపథ్యంలో జిఎ2 పిక్చర్స్ వారి ‘గీత గోవిందం’, యువి క్రియేషన్స్ వారి ‘టాక్సీవాలా’ చిత్రాల్లో అతను నటించాడు. అదేవిధంగా తెలుగు, తమిళ్‌లో తెరకెక్కుతున్న ‘నోటా’లో కూడా చేశాడు. ఇవన్నీ విడుదలకు సిద్ధమయ్యాయి.

కథ నచ్చక బిగ్ ఆఫర్లను వదులుకున్నాడు… 

చిన్నప్పటి నుంచే విజయ్‌కి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాను. కాలేజీలో చదువుతున్నప్పుడే మా కారులో తిరుగుతుండేవాడు. అతనికి హీరో అయి మంచి పేరు తెచ్చుకోవాలనుందే తప్ప బాగా సంపాదించాలనే ఆశ లేదు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత యంగ్ స్టార్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్‌కి పలు పెద్ద బ్యానర్‌ల నుంచి ఆఫర్లు వచ్చాయి… భారీ పారితోషికం ఇస్తామన్నారు. కానీ అతనికి కథ నచ్చకపోవడంతో పలు సినిమాలు చేయలేదు. కోలీవుడ్ నుంచి మణిరత్నం, శంకర్ వంటి దర్శకులు కూడా విజయ్‌కి కథలు వినిపించారు.

బాలీవుడ్ అవకాశాలను వద్దనుకున్నాడు…

‘అర్జున్‌రెడ్డి’ చిత్రం తర్వాత విజయ్‌కి బాలీవుడ్‌లో కూడా పెద్ద అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్ నిర్మాతలు మా అబ్బాయితో సినిమా చేస్తామని ముందుకు వచ్చారు. కానీ ఆ సంస్థ ఒకేసారి రెండు, మూడు సినిమాలకు కాంట్రాక్ట్ తీసుకోవాలని భావించడంతో విజయ్ ఈ ఆఫర్‌ను వద్దనుకున్నాడు. ప్రస్తుతం అతని దృష్టంతా టాలీవుడ్‌పైనే. అయితే తెలుగు, తమిళ్‌లో కూడా అతనితో సినిమాలు చేయడానికి పలువురు ఫిల్మ్‌మేకర్లు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం విజయ్‌తో కోలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ బ్యానర్ ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో కార్తీక్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

తొందరపడి ఓకే చెప్పడు…

మా అబ్బాయికి సినిమాలపైన మంచి అవగాహన ఉంది. మంచి కథలు, కొత్తదనం ఉన్న సినిమాలే విజయం సాధిస్తాయని అతని గట్టి నమ్మకం. సినిమాల విషయంలో నా అనుభవంతో చెప్పిన సూచనలు, సలహాలను వింటాడు. చివరికి అతనికి నచ్చితేనే ఏదైనా సినిమా చేస్తాడు. ఎంతో కష్టపడి ఈ రేంజ్‌కు వచ్చాడు కాబట్టి తొందరపడి ఏ సినిమాకు ఓకే చెప్పడు.

అదంతా సిఎం కెసిఆర్ కృషివల్లే…

విజయ్ చేసిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో తెలంగాణ యాస, భాషకు ఎంతో పేరొచ్చింది. దర్శకులు తరుణ్‌భాస్కర్, సందీప్‌రెడ్డిలు విలక్షణంగా ఈ చిత్రాలను తెరకెక్కించడం, విజయ్ నటనతో ఈ చిత్రాలు ఘన విజయం సాధించాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ నేపథ్యంలోని కథలు, ఇక్కడి ప్రాంతాల బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాలు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదంతా సిఎం కెసిఆర్ కృషివల్లే అని చెప్పుకోవచ్చు.

హోం ప్రొడక్షన్స్‌ను ప్రారంభిస్తున్నాం…

కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సినిమాలను నిర్మించాలనేది విజయ్ కోరిక. ఈ నేపథ్యంలో మా సొంత బ్యానర్ ‘కింగ్ ఆఫ్ హీల్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ను ప్రారంభిస్తున్నాం. తమిళ్ డైరెక్టర్ సమీర్ సుల్తాన్ దర్శకత్వంలో నేను నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. ‘పెళ్లిచూపులు’ దర్శకుడు తరుణ్‌భాస్కర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడు. సెప్టెంబర్ 15న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది.

ఆనంద్ దేవరకొండ హీరోగా…

మా రెండవ అబ్బాయి ఆనంద్ దేవరకొండ కూడా సినిమాల్లోకి వస్తున్నాడు. సినిమాలపైన ఉన్న ఆసక్తితో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి అతను హైదరాబాద్‌కు తిరిగివచ్చేశాడు. కె.వి.ఆర్.మహేంద్ర దర్శకత్వంలో ‘దొరసాని’ టైటిల్‌తో తెరకెక్కే చిత్రంతో ఆనంద్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తాడు. డి.సురేష్‌బాబు సమర్పణలో మధుర శ్రీధర్, యష్ రంగినేని కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. పక్కా తెలంగాణ యాస, భాషతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

తీవ్రమైన పోటీ:

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, నిర్మాతలు, దర్శకులు, పలువురు సాంకేతిక నిపుణుల కుటుంబాలకు చెందిన హీరోలే దాదాపు 90 శాతం మంది ఉన్నారు. బయటి నుంచి వచ్చిన హీరోలు 10 శాతం మందే. దీంతో టాలెంట్ ఉన్న హీరోలే చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుంటున్నారు. యువ కథానాయకుల మధ్య ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విపరీతమైన పోటీ ఉంది.

                                                                                                                                   ఎస్.అనిల్ కుమార్
                                                                                                                            ఫొటోలు : ఎమ్. నాగభూషణం