Home జాతీయ వార్తలు పాక్‌పై ప్రతీకారం

పాక్‌పై ప్రతీకారం

Indian-Army

 

10మంది సైనికులు, 20మంది ఉగ్రవాదులు హతం
శతఘ్నులతో విరుచుకుపడిన భారత్
పిఒకెలోని 3 ఉగ్ర స్థావరాలు, పాక్ ఆర్మీ పోస్టులు ధ్వంసం
ఇద్దరు జవాన్లను హతమార్చడంతో రెచ్చిపోయిన భారత ఆర్మీ

న్యూఢిల్లీ: భారతీయ సైన్యం ఆదివారం పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యకు దిగింది. పది మంది వరకూ పాక్ సైనికులను హతమార్చింది. 20మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె)లోని మూడు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. భారత సైన్యం పాకిస్థానీ సైనిక పోస్టులను ధ్వంసం చేస్తూ, పిఒకెలోని నీలం లోయలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిందని ఆర్మీ చీఫ్, జనరల్ బిపిన్ రావత్ ఆదివారంనాడు వార్తాసంస్థలకు తెలిపారు. పాకిస్థాన్ తరచూ కాల్పుల విరమణకు తూట్లు పొడిచి, బాంబుల వర్షం కురిపించడం శనివారంనాడు ఇద్దరు జవాన్లతో పాటు ఓ సామాన్య పౌరుడు మృత్యువాతపడ్డారు. దీఒతో భారత సైన్యం ప్రతీకారానికి దిగింది. శనివారం సాయంత్రం పాకిస్థానీ సేనలు తంగ్థార్ సెక్టార్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు మన స్థావరాలపై కాల్పులకు దిగాయని రావత్ వివరించారు. దీంతో వెంటనే అప్రమత్తమై ఉగ్రవాద స్థావరాలపై దాడులకు దిగినట్లు వెల్లడించారు.

ఆరు నుంచి పది మంది వరకూ పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్లు రావత్ చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి వ్యూహం ప్రకారం ఉగ్రవాద స్థావరాలు పనిచేస్తున్నట్లు, వాటికి పాకిస్థాన్ బలగాలు తోడుగా ఉంటున్నాయని, ఏకకాలంలో ద్విముఖ వ్యూహంతో దాడులకు దిగామని రావత్ వెల్లడించారు. రావత్ ప్రకటన తర్వాత సరిహద్దుల వెంబడి ఉగ్రవాద మౌలిక ఏర్పాట్లును దెబ్బతీసినట్లు చెప్పారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు పరిణామం తరువాత వరుసగా సరిహద్దులలో ఉగ్రవాదుల కదలికలు కన్పించాయని, పిఒకెలో పెద్ద ఎత్తున ఉగ్రవాద శిబిరాలు నెలకొనేందుకు పాకిస్థాన్ అప్పటి నుంచి యత్నిస్తూ వస్తోందని, నెలరోజులుగా సరిహద్దులు దాటి భారతీయ భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడేందుకు చేసిన యత్నాలను తమ సైనికులు పూర్తిగా తిప్పికొట్టారని ఆర్మీచీఫ్ చెప్పారు.

పాకిస్థాన్ సైన్యం అదేపనిగా భారతీయ భూభాగంలోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఎత్తుగడలకు దిగుతోంది. వారితో కశ్మీర్‌లో కల్లోల పరిస్థితిని కల్పించేందుకు కుట్ర పన్నుతోందని, దీనిని నిరోధించేందుకు సరిహద్దులలో ఎప్పటికప్పుడు నిఘా పెంచినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. భారతీయ సైన్యం శతఘ్నులతో విరుచుకుపడినట్లు వెల్లడగించారు. తంగ్దార్ సెక్టార్‌కు అభిముఖంగా ఉన్న నీలం లోయలో ఉగ్రస్థావరాలు పాకిస్థానీ బలగాల అండదండలతో పనిచేస్తున్నాయనే సమాచారం ప్రాతిపదికగా చేసుకుని భారతీయ సైన్యం దాడికి దిగినట్లు నిర్థారణ అయింది. బాలాకోట్ ఉగ్రస్థావరాలపై దాడుల తరువాత సైన్యం జరిపిన కీలక ఆపరేషన్ ఇదే అని భావిస్తున్నారు. భారతీయ సైన్యం శతఘ్నులను ప్రయోగించడంతో పలువురు గాయపడినట్లు, ఉగ్రవాదులు ఎందరు హతులయ్యారనేది పూర్తి స్థాయిలో వెల్లడికానట్లు తెలిసింది. జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఒసి వెంబడి ఆదివారం భీకర స్థాయిలో పేలుళ్లు విన్పించాయని స్థానికులు తెలిపారు. పిఒకెలో భారీ స్థాయిలో ఆస్తినష్టం జరిగిందని కూడా వెల్లడైంది.

రక్షణ మంత్రి, రావత్ కీలక పర్యటనకు ముందే…
సోమవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌లు వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి అత్యంత వ్యూహాత్మకపు వంతెనకు ప్రారంభోత్సవం చేయనున్నారు. చైనా వెంబడి లేహ్ కరకోరమ్ రహదారిలో ఈ కార్యక్రమం ఉంది. ఈ దశలోనే సైనిక ఆపరేషన్ జరిగింది. పాకిస్థానీ సేనలకాల్పుల మధ్య ఉగ్రవాదులు చొరబడే ప్రయత్నాలను గమనించి జరిపిన ఇప్పటి భారతీయ దాడితో అక్కడి భారీ ఆయుధ సామాగ్రి కూడా దెబ్బతిందని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం పాకిస్థానీ బలగాలు జరిపిన కాల్పుల్లో తంగ్థార్ సెక్టార్‌లోని గుంధీషత్ గ్రామంలోని పౌర ప్రాంతాలలో నష్టం జరిగింది. ఈ ఘటనలలో మృతి చెందిన పౌరుడిని 55 ఏళ్ల సాధిక్‌గా గుర్తించారు. ఇక గాయపడ్డ ముగ్గురిలో 70 ఏళ్ల మక్బూల్, 50 ఏళ్ల షఫీ, 22 ఏళ్ల యూసుఫ్ ఉన్నట్లు వెల్లడైంది.

భారత్ దాడి నిజమే : పాక్
పిఒకెలో భారతీయ సైన్యం దాడి జరిపిన మాట వాస్తవమే అని పాకిస్థాన్ ఆదివారం ధృవీకరించింది. ఒక్క సైనికుడు, ముగ్గురు పౌరులు భారతీయ సైన్యం కాల్పుల్లో మృతి చెందినట్లు పాకిస్థాన్ సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ తెలిపారు. జూరా, షకోట్, నౌషెరీ సెక్టార్‌లలో భారతీయ సైన్యం కవ్వింపు చర్యలకు దిగిందని, దాడులు జరిపిందని చెప్పారు. తమ సేనలు సమర్థవంతంగా ఎదురు దెబ్బతీశాయని, ఈ క్రమంలొ 9 మంది భారతీయ జవాన్లు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని, రెండు భారతీయ బంకర్లను దెబ్బతీశామని వివరించారు. పలువురు సైనికులు కూడా గాయపడ్డారని ధృవీకరించారు.

Army Attacks 4 Terror Camps In PoK With Artillery Fire