Saturday, April 20, 2024

ఆర్నాబ్ అరెస్టు!

- Advertisement -
- Advertisement -

Arnab Goswami was arrested by Mumbai police

 

ఒక భవన నిర్మాణ, రూపాలంకరణ శిల్పి ఆత్మహత్యకు కారణమయ్యాడన్న కేసులో రిపబ్లిక్ టివి అధినేత, సంపాదకుడు ఆర్నాబ్ గోస్వామిని బుధవారం నాడు ముంబై పోలీసులు అరెస్టు చేశారు. గతంలో మూసివేసిన ఆ కేసును తిరగదోడి ఆయనను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఈ అరెస్టును కేంద్ర హోం మంత్రి, విదేశాంగ మంత్రి సహా ప్రధాని మోడీ మంత్రివర్గంలోని మరి కొందరు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జె.పి. నడ్డా తీవ్రంగా ఖండించి 1975 నాటి ఎమర్జెన్సీలో పత్రికల నోళ్లు మూయించిన ఘాతుక చర్యతో పోల్చడం ప్రత్యేకించి గమనించవలసిన అంశం. అన్వయ్ నాయిక్ అనే భవన నిర్మాణ శిల్పి, ఆయన తల్లి 2018 మే లో ఆత్మహత్య చేసుకున్నారు. తన చేత పని చేయించుకున్న ఆర్నాబ్ తనకు చెల్లించవలసిన రూ. 83 లక్షలు ఇవ్వలేదని, అలాగే మరి ఇద్దరు ఎగ్గొట్టిన దానితో కలిపి మొత్తం రూ. 5.4 కోట్లు నష్టపోయానని అన్వయ్ నాయిక్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్నట్టు సమాచారం.

దీని ఆధారంగా దాఖలు చేసిన కేసును ఆ తర్వాత కొన్నాళ్లకు పోలీసులు మూసివేశారు. ఆ రెండు ఆత్మహత్యలకు ఆర్నాబే బాధ్యుడంటూ అన్వయ్ నాయిక్ భార్య అక్షత నాయిక్ మళ్లీ చెప్పిన విడియోను గత మే నెలలో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర విభాగం ట్విట్టర్‌లో పెట్టింది. అలాగే మూసివేసిన కేసును తిరిగి తెరవాలంటూ నాయిక్ కుమార్తె అద్నయ్ నాయిక్ పోలీసులను కోరారు. సరిగా దర్యాప్తు జరపకుండానే, ఆర్నాబ్ చెల్లించాల్సిన డబ్బు గురించి ఆరా తీయకుండానే పోలీసులు కేసు మూసివేశారని ఆమె అందులో ఆరోపించారు. దానితో కేసు తిరిగి చేపట్టడానికి మహారాష్ట్ర హోం మంత్రి గత మే నెలలో నిర్ణయించారు. ఆ మేరకు ఇప్పుడు పోలీసులు ఆర్నాబ్ ఇంటికి వెళ్లి అతడిని అరెస్టు చేశారు. ఆర్నాబ్ పైనా, అతడి కుమారుడి పైనా వారు చేయి చేసుకున్నారన్న ప్రచారం జరుగుతున్నది. 2019 ఏప్రిల్‌లో ఆర్నాబ్ పై కేసు మూసివేయడం వెనుక, గత మే నెలలో దానికి తిరిగి ప్రాణం పోయడం వెనుక రాజకీయ హస్తాలు లేవని అనుకోలేము. కేసు మూసివేసిన సమయంలో దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బిజెపి శివసేన కూటమి అధికారంలో ఉంది.

దానిని తిరిగి తెరచిన సమయంలో ఇప్పుడు శివసేన, కాంగ్రెస్, నేషలిస్టు కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం మహారాష్ట్రను పాలిస్తున్నది. రిపబ్లిక్ టివి టెలివిజన్ రేటింగు పాయింట్ల (టిఆర్‌పిలు)ను పెంచుకోడానికి అడ్డదారులు తొక్కారనే కేసు కూడా ఆర్నాబ్‌పై ఉంది. ఆయనపై గల కేసుల ఉచితానుచితాలను న్యాయ స్థానాలు తేల్చవలసి ఉంది. దానికి కొంత సమయం పడుతుంది. ఈలోగా ఈ వ్యవహారం కేంద్ర, రాష్ట్రాలను ఏలుతున్న భిన్న శక్తుల మధ్య రాజకీయ ఘర్షణకు దారి తీయడమే ఆందోళన చెందవలసిన అంశం. కేంద్రంలోని మహామహా మంత్రులే రంగంలోకి దిగి ఆర్నాబ్ అరెస్టును మీడియా స్వేచ్ఛ మీద ఉక్కు పాదంగా పేర్కొంటూ ఎమర్జెన్సీ నాటి చీకటి రాజ్యంతో పోలుస్తూ ప్రకటనలివ్వడం ఆశ్చర్యం గొలిపే విషయమే. అందులో లోతైన మరేదో ఉద్దేశం దాగి ఉందేమో అనిపించడం సహజం. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఆత్యయిక స్థితిలో దేశమంతటా భావప్రకటనా స్వేచ్ఛను అణచివేశారు. పత్రికలపై దారుణమైన సెన్సార్ కత్తెరను ప్రయోగించారు. ప్రశ్నించిన వారిని జైళ్లలో కుక్కారు. ఇప్పుడు ఆర్నాబ్ పై జరిగింది ఆ స్థాయిలోని అణచివేతగా పరిగణించగలమా? అలాగే శివసేన ప్రభుత్వం మహారాష్ట్ర అంతటా గల మీడియా గొంతు నొక్కలేదు.

అయినా ఒక మీడియా సంస్థ యజమానిని, సంపాదకుడిని అరెస్టు చేయడం సాధారణ చర్య కాదు. అరెస్టు వరకు వెళ్లకుండా కేసును న్యాయస్థానం ముందు ఉంచడం సాధ్యమే. అయితే ఈ ఉదంతంపై కేంద్రంలోని పెద్ద, చిన్న మంత్రులు ఇంత తీవ్రంగా విరుచుకుపడడం అందులోని కొందరు దేశంలోని మీడియా రంగాన్నంతటినీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం ఒకింత అతిగానే కనిపిస్తున్నది. ఆర్నాబ్ గోస్వామి తరచూ హిందుత్వ శక్తుల పట్ల వకాల్తా పుచ్చుకోడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన ఆ కళలో అవధులు మీరుతూ ఉంటారు. మహారాష్ట్రలోని పాల్ఘార్‌లో గత ఏప్రిల్‌లో బాలల కిడ్నాపర్లుగా అనుమానించి ఇద్దరు సాధువులను మూకలు హతమార్చిన దుర్మార్గాన్ని సోనియా గాంధీయే చేయించారని ఆర్నాబ్ అప్పట్లో ప్రసారం చేసిన తన ప్రత్యేక కార్యక్రమంలో ఆరోపించారు. ఆమె ఇటలీ నేపథ్యాన్ని కూడా జోడించి మత ద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేశారు. 80 శాతం హిందువులున్న దేశంలో ఇద్దరు సాధువులను హతమార్చడం ఘోరమన్నారు. దీనిని బట్టి ఏమి అనిపిస్తుంది? ఆర్నాబ్ అరెస్టు వెనుక రాజకీయం ఉంటే అంతకు మించిన రాజకీయం దానిని ఎమర్జెన్సీకి ముడిపెడుతూ కేంద్ర మంత్రులు, బిజెపి పెద్దలు ఖండన ప్రకటనలివ్వడంలో అంతకుమించిన రాజకీయం కనబడడం లేదా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News