Home తాజా వార్తలు పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం…

పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం…

Pensions

 

నేడు ఊరూరా వేడుకలు..
హాజరుకానున్న ప్రజాప్రతినిధులు

తరలిరానున్న లబ్దిదారులు, శ్రేణులు

సంగారెడ్డి : పెంచిన పింఛన్లను లబ్దిదారులకు అందజేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు జరిగాయి. మారుమూల గ్రామం మొదలు జిల్లా కేంద్రం వరకు ప్రతిచోట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి గాను రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికార పార్టీ శ్రేణులు సిఎం నిర్ణయాన్ని ఘనంగా అమలుచేసేందుకు సిద్ధ్దమయ్యారు. అదే సమయంలో పార్టీ అభిమానులు కూడా ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.. శనివారం జరిగే కార్యక్రమాల్లో భారీ ఎత్తున పాల్గొనబోతున్నారు. ఇంతకు ముందు వేయి రూపాయలుగా ఉన్న పింఛన్‌ను రూ.2016గా పెంచుతున్నారు.

అదే విధంగా వికలాంగులు, వృద్ధులు, కళాకారుల పింఛన్‌ను రూ.1500 నుంచి రూ.3016కు పెంచబోతున్నారు. ఈ పింఛన్‌ను ఈ జూన్ మాసం నుంచి అమలులోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆ పింఛన్‌ను ఈ నెలలోనే లబ్దిదారులకు పెద్ద ఎత్తున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో పింఛన్లను పెంచుతూ సిఎం కెసిఆర్ నిర్ణయం ప్రకటించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పేద, బడుగువర్గాల వారు వికలాంగులు, వృద్దులు సీఎం నిర్ణయంపై ప్రతిచోట హర్షం ప్రకటిస్తున్నారు.

సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిదులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీచైర్మన్లు పింఛన్ల పంపిణీకి సంబంధించిన ప్రోసిడింగ్ కాపీలను లబ్దిదారులకు నేరుగా అందజేసేందుకు సిద్దమయ్యారు. దీనికి గాను ఆయా నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, పాత తాలుకా కేంద్రాలలో నిర్వహిస్తున్న సమావేశాల్లో పాల్గొననున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీపీలు,జెడ్పీటీసీ సభ్యులు, ఇతర ముఖ్యనేతలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. దీంతో పండుగ లాగా పెరిగిన పింఛన్ల కార్యక్రమాలు జిల్లాలో జరుగబోతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని నేతలు సీఎం ఆదేశాల మేరకు కదులుతున్నారు.

ముఖ్యంగా జిల్లా కేంద్రాలలో బారీ ఎత్తున ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు సిద్దమయ్యారు. అదే విధంగా అధికార పార్టీకి చెందిన నేతలు కూడా తమ శ్రేణులతో కలిసి పాల్గొంటున్నారు.గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పింఛన్ల పెంపుపై హామీ ఇవ్వడంతో.. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కెసిఆర్‌కు బ్రహ్మరథం పట్టారు. తిరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి జై కొట్టారు. అయితే వరుసగా ఎన్నికలు వచ్చాయి. ఈ సమయంలో గతంలో ఇచ్చిన హామీని వెంటనే అమలుచేసేందుకు సిఎం ఆధ్వర్యంలోని క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో.. ఆప్రకారం ఈ నెల నుంచే పెరిగిన పింఛన్‌ను అమలుచేసేందుకు ఏర్పాట్లు చకచకా జరిగాయి.

వికలాంగులు, వృద్ధ్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఈవిధంగా అర్హులైన అన్నివర్గాల వారికి పింఛన్లను పెంచిన మేరకు ఇవ్వబోతున్నారు. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు, బోధకాల బాధితులకు కూడా పింఛన్ కల్పిస్తున్నారు. గ్రామ, మండల, మున్సిపల్ స్థాయిలో కూడా లబ్దిదారులు ఉన్నారు. దీంతో వారి సమక్షంలో కూడా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలను నిర్వహించడం ద్వారా తమ ప్రభుత్వ ఘనతను చాటిచెప్పేందుకు గులాబీదండు సిద్దమైంది. ఇటీవల ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్‌కు వయోపరిమితి పెంచింది. 65 సంవత్సరాలుగా గతంలో వయో పరిమితి ఉండగా… ఈ పరిమితిని 57కు తగ్గించింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో వేలాధి మంది కొత్తగా అర్హత సాధిస్తున్నారు. అదే విధంగా ఈ విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తమ ప్రభుత్వ సంక్షేమ విధానాన్ని చాటిచెప్పాలని పార్టీనేతలు భావిస్తున్నారు.

దీంతో శనివారం నాడు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మేరకు పెరిగిన పింఛన్లను లబ్దిదారులకు నేరుగా అందిస్తారు. దీనికి గాను ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. దీంతో నియోజకవర్గాల్లో ఎక్కడిక్కడే అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా పార్టీ శ్రేణులు కూడా అక్కడక్కడ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించడంతో ఆ మేరకు స్థానిక అధికారులు సిద్ధ్దమయ్యారు. పెరిగిన పింఛన్ల ఉత్తర్వులను లబ్దిదారులకు అందించడం ద్వారా ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చిన ఘనత తమదేనని ప్రభుత్వం స్పష్టం చేయబోతోంది. గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలను ఎక్కడిక్కడే అధికార పార్టీ నేతలు నిర్వహించనున్నారు. మొత్తంగా చూస్తే పెరిగిన పింఛన్ల అమలు కార్యక్రమం పెద్ద ఎత్తున జిల్లాలో పండగ లాగా నిర్వహించబోతున్నారు.

Arrangements to provide Pensions to Beneficiaries