Home ఖమ్మం కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ…!

కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ షురూ…!

 count votes

 

*ఎంపి ఎన్నికలకు వారం రోజులు
*ప్రాదేశిక ఎన్నికలకు ఇంకా 12 రోజులు నిరీక్షణే
*క్షణమొక యుగంగా గడుపుతున్న అభ్యర్థులు
*స్థ్ట్రాంగ్ రూంలో భద్రంగా అభ్యర్ధుల భవితవ్యం
*ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

ఖమ్మం : పార్లమెంట్ ఎన్నికలతోపాటు ప్రాదేశిక ఎన్నికలు కూడా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపై మళ్ళీంది. ఈనెల 23న లోక్‌సభ ఓట్లను, ఈ నెల 27న ప్రాదేశిక ఓట్లను లెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లను ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఇంకా ఎనిమిది రోజులు, పరిషత్ ఓట్ల లెక్కింపునకు 12 రోజులు గడువు ఉంది. ఖమ్మం లోక్‌సభకు ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. ఫలితాల కోసం దాదాపు 41 రోజుల పాటు నీరక్షించాల్సి రావడంతో రాజకీయపార్టీ నేతల్లో, ప్రధానంగా పోటీ చేసిన అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. గత నెల రోజుల నుంచి వారు క్షణమొక యుగంగా గడుపుతున్నారు.

అందరి అంచనాలను, ఎగ్జిట్ పోల్స్‌ను, సర్వే నివేదికలను ముందుపెట్టుకొని కూడికలు తీసివేతల్లో నిమగ్నమై ఒక అంచనాకు వచ్చినప్పటికీ మనస్సులో ఎదో ఒక మూలన భయాందోళన నెలకొంది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ ఫలితం రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కడం లేదు. అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గెలుపు దోబూచులాడుతుంది. నువ్వా.. నేనా అనే చందంగా ఇక్కడ ఫలితం ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఎవ్వరూ గెలిచిన స్వల్ప మెజార్టేనని వారు లెక్కలు గడుతున్నారు. అయితే టిఆర్‌ఎస్ నాయకులు మాత్రం ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమని చెబుతున్నారు. ఇక్కడ పోటీ చేసిన నామా నాగేశ్వరరావు తన గెలుపు ఖాయమనే గట్టి ధీమాతో ఉండగా కాంగ్రెస్ అభ్యర్థి రేణుకాచౌదరి కూడా తన గెలుపు ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో పోలింగ్ రోజు ర్రాతి పొద్దుపోయక అదనంగా పోలింగ్ శాతం నమోదైదని ఆరోపిస్తూ ఆమె ఇటీవల న్యూఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేసి వచ్చారు. అటు నామా, ఇటు రేణుకా చౌదరి భవితవ్యం ఈవిఎం మిషన్లో నిక్షిప్తమై విజయ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రంగా ఉంది. ఈ ఎన్నికకు దాదాపు 16 మంది పోటీ పడ్డారు. వారంతా ఫలితాల కోసం కళ్ళలో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23న ఉదయం ఓట్ల ఎంపి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఇందుకుగాను పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటింగ్‌పై జిల్లా కలెక్టర్ కర్ణన్ రాష్ట్ర స్థ్థాయిలో జరిగిన అవగాహన కార్యక్రమానికి వెళ్లివచ్చారు. జిల్లా స్థ్థాయిలో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ సారి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో వివిప్యాట్‌లో పోలైన ఓట్లను మ్యానువల్‌గా లెక్కించాలని ఆదేశించిన నేపధ్యంలో లెక్కింపు సిబ్బందిని అదనంగా నియమించుకోవాల్సి వస్తుంది. అంతేగాక ఈస్థారి ఫలితాలు కూడా దాదాపు ఐదు గంటల ఆలస్యంగా అందనున్నాయి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఐదు వివిప్యాట్‌లను శాంపిల్‌గా (డ్రా పద్దతిలో) తీసి లెక్కించాల్సి ఉండేది. ఇక్కడ ఈవిఎం మిషన్లకు, వివిప్యాట్‌లోని ఓట్లకు తేడా వస్తే మాత్రం మళ్ళీ రీ కౌంటింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ వల్ల తుది ఫలితాలు వెలువడేందుకు తీవ్రమైన జాప్యం జరుగుతుందని అధికారులు అంటున్నారు.

జిల్లా కలెక్టర్ ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఎంపిగా పోటీ చేసిన ప్రతి అభ్యర్థి కౌంటింగ్ కోసం 15 మంది ఏజెంట్లను నియమించుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓట్లను కూడా ఖమ్మం నగరం సమీపంలోని తనికెళ్ళలో గల విజయ ఇంజినీరింగ్ కళాశాల్లోనే లెక్కించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను కూడా ఇక్కడనే లెక్కిస్థ్తారు. ఈ మేరకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు

12 రోజుల పాటు నిరీక్షించాల్సిందే
ఇక జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా దాదాపు 12 రోజుల పాటు ఫలితాల కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. ఎంపి ఎన్నికల ఓట్ల లెక్కింపును దృష్టిలో పెట్టుకొని ప్రాదేశిక ఓట్ల లెక్కింపును ఈ నెల 27న జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మూడు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జెడ్పిటిసి, ఎంపిటిసి పదవులకు పోటీ చేసిన దాదాపు 2,205 మంది అభ్యర్థులు వారి ఫలితాల కోసం 12 రోజుల పాటు వేచిచూడాల్సిందే. మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 41 జెడ్పిటిసి స్థ్థానాలకు 238 మంది, 503 ఎంపిటిసి స్థ్థానాలకు 2007 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఖమ్మం జిల్లాలోని 20 జెడ్పిటిసి స్థ్ధానాలకు 105 మంది, 286 ఎంపిటిసి స్థ్ధానాలకు 948 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా భద్రాద్రి జిల్లాలోని 21 జెడ్పిటిసి స్థ్దానాలకు 133 మంది, 216 ఎంపిటిసి స్థ్ధానాలకు1059 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎంపిటిసి, జెడ్పిటిసి కలిపి మొత్తం 2205 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్స్‌లో నిక్షిప్తమై ఉంది. ఖమ్మం జిల్లాలో చివరి విడతగా మంగళవారం జరిగిన ఎన్నికలకు సంబంధించిన మండలాల బ్యాలెట్ బాక్స్‌లను కొణిజర్ల మండలం తనికేళ్ళ గ్రామంలోని గ్రేస్ జూనియర్ కళాశాల భవనంలోకి, మధిరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనంలోకి తరలించారు. మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండల ఓట్లను మధిరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనంలో, చింతకాని, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా మండలాల ఓట్లను తనికెళ్ళలోని గ్రేస్ జూనియర్ కళాశాల భవనంలో లెక్కిస్త్తారు. అదేవిధంగా తొలిదశగా ఎన్నికలు జరిగిన మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను ఖమ్మం రూరల్ మండలంలోని మహ్మదీయ ఇంజినీరింగ్ కళాశాల, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల భవనంలో భద్రపరిచారు.

కామేపల్లి, తిరుమలాయపాలెం, కారేపల్లి మండలాల ఓట్ల లెక్కింపు మహ్మదీయ కళాశాలలో, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల ఓట్లను ఇదే మండలంలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల్లో లెక్కిస్త్తారు. రెండో దశలో ఎన్నికలు జరిగిన మండలాల బ్యాలెట్ బాక్స్‌లను తల్లాడ మండలం రెడ్డిగూడెంలోని క్రిస్తు జ్యోతి జూనియర్ కళాశాలకు, సత్తుపల్లి మండలంలోని మథర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల భవనంలో భద్రపర్చారు. ఏన్కూర్, తల్లాడ, కల్లూరు మండలాల ఓట్లను క్రీస్తు జ్యోతి కళాశాలలో, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాల ఓట్లను మథర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మండలాలకు చెందిన ఓట్లను ఆ జిల్లాలో ఏడు సెంటర్లో లెక్కించనున్నారు.

భద్రాచలం డిగ్రీ కళాశాలలో దుమ్ముగూడెం, చర్ల, బుర్గంపహాడ్, అశ్వాపురం మండలాలకు చెందిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఓట్లను, మణుగూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పినపాక, కరకగూడెం, మణుగూరు మండలాల ఓట్లను, ఇల్లందు గిరిజన సంక్షేమ హాస్టల్ భవనంలో ఇల్లందు, ఆళ్ళపల్లి, గుండాల మండలాల ఓట్లను, పాల్వంచలోని అనుబోస్ కళాశాలలో ములకలపల్లి, ములకలపల్లి, పాల్వంచ మండలాల ఓట్లను, సుజాతనగర్‌లోని అబ్ధుల్‌కలాం ఇంజినీరింగ్ కళాశాలల్లో అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, జూలూరుపాడు, కొత్తగూడెంలోని సింగరేణి జూనియర్ కళాశాల భవనంలో లక్ష్మిదేవిపల్లి, చుంచుపల్లి, సూజాతనగర్ మండలాల ఓట్లను లెక్కిస్తారు. ఎక్కడైతే బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చారో అక్కడే ఈ నెల 27న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అప్పటి వరకు అక్కడ భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూంలు కొనసాగనున్నాయి.

Arrangements were made to count votes.