Thursday, April 18, 2024

పొటాటో కట్టర్ కొంటే.. కారు వచ్చిందని ఆశపడితే.. రూ.2.30లక్షలు స్వాహా

- Advertisement -
- Advertisement -

Arrested

 

హైదరాబాద్ : బహుమతుల పేరుతో అమాయకుల వద్ద నుంచి డబ్బులు దోచుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 12 మొబైల్ ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్, స్కార్పియో కారు, 19 సిమ్ కార్డులు, నకిలీ పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి, డెబిట్ కార్డులు, స్నాప్‌డీల్ నకిలీ ఐడి కార్డులను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి విసి సజ్జనార్ వివరాలు వెల్లడించారు.

బీహార్, షేక్‌పురా జిల్లా, షేక్‌పురా సరాయ్ పోస్ట్, కబీర్‌పురా గ్రామానికి చెందిన సందీప్ కుమార్ అలియాస్ ఆర్యన్, బీహార్‌లోని నవడా జిల్లా, దక్‌రా గ్రామానికి చెందిన బిపిన్ కుమార్, సందీప్ పాస్వాన్, మానిక్‌చంద్ పాస్వాన్, ఢిల్లీకి చెందిన తౌసిఫ్ అహ్మద్, వికాస్ కుమార్ ముఠాగా ఏర్పడి బహుమతుల పేరుతో పలువురి వద్ద నుంచి దోచుకుంటున్నారు. ఇందులో బిపిన్ కుమార్, సందీప్ పాస్వాన్ పరారీలో ఉండగా మిగతా వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు ముఠాగా ఏర్పడి అమాయకులకు ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్ చేసి మీకు బహుమతి వచ్చిందని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లను క్రియేట్ చేసి దోచుకుంటున్నారు. సైబరాబాద్‌కు చెందిన ఓ యువత 10వతేదీ, అక్టోబర్, 2019న స్నాప్‌డీల్‌లో పొటాటో కట్టర్‌ను రూ.228కు కొనుగోలు చేసింది. తర్వాత 11వ తేదీన తన మొబైల్ నంబర్‌కు స్నాప్‌డీల్ ఆన్‌లైన్ షాపింగ్ నుంచి మీరు టాటా నెక్సాన్ కారును గెలుచుకున్నారని దాని విలువ రూ. 6,90,000 మెసేజ్ వచ్చింది.

బ్యాంక్ రిజిస్ట్రేషన్ చార్జ్‌ల కింద రూ.6,500 ఎస్‌బిఐలో డిపాజిట్ చేయాలని హెల్ప్‌లైన్ నంబర్ 18003133226, వాట్సాప్ నంబర్ 06289633543లో సంప్రదించాలని ఉంది. దీనిని నమ్మిన బాధితురాలు వెంటనే కారు తీసుకుంటానని చెప్పి మెసేజ్ చేసింది వెంటనే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు, ఐడి తాను సత్య ప్రకాష్ అని స్నాప్‌డీల్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నానని చెప్పాడు. బహుమతి గెలుచుకున్న వారు రిజిస్ట్రేషన్‌కు రూ.6,500, ఆర్టిఓ చార్జీలు 24,600, జిఎస్‌టి రూ.18,500, ఇన్సూరెన్స్ చార్జీలు రూ.31,000, కార్ చెక్‌కు రూ.74,400, కారును ఇక్కడికి పంపించేందుకు రూ.50,000, డెలివరీ చార్జీలు రూ.25,000 చెల్లించాల్సిందిగా కోరాడు. కారు విలువ రూ.6,90,000 ఉండగా వివిధ ఖర్చుల కింద రూ.2,30,000 చెల్లించాలని చెప్పడంతో బాధితురాలు వివిధ బ్యాంకుల్లో ఆన్‌లైన్ ద్వారా పంపించింది. కారును పంపించకపోవడంతో బాధితురాలు నిందితులను సంప్రదించేందుకు యత్నించగా ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి.

వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేసిన సైబర్ క్రైం ఇన్స్‌స్పెక్టర్లు కె.శ్రీనివాస్, రామయ్య, చంద్రశేఖర్, ఎస్సైలు విజయ్‌వర్దన్, గౌతమ్, రాజేంద్ర, ఎఎస్సై సిద్దేశ్వర్, వెంకట్ రెడ్డి, పిసిలు నందు యాదవ్, వెంకటేష్, ఫయిం మియా, భరత్‌కుమార్, సురజ్ సింగ్, ఎండి అర్షద్ అలీ, శేఖర్, రాజా రమేష్ కేసు దర్యాప్తు చేశారు. సమావేశంలో సైబర్ క్రైం ఎడిసిపి, ఎసిపి శ్రీనివాస్ కుమార్, ఇన్స్‌స్పెక్టర్లు రామయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఆన్‌లైన్ వెబ్‌సైట్లే నుంచే….
ప్రధాన నిందితుడు సందీప్ కుమార్ అలియాస్ ఆర్యన్ ఈ కామర్స్ వెబ్‌సైట్లు నాపటాల్,హోంషాప్18, స్నాప్‌డీల్, షాప్‌క్లూస్, క్లబ్ ఫ్యాక్టరీ, ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ నుంచి డాటా బేస్‌ను కొనుగోలు చేస్తున్నాడు. ఏడు టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశాడు, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు తౌసిఫ్ సాయంతో సమకూర్చుకున్నాడు. నకిలీ వెబ్ సైట్లను వికాస్‌కుమార్ సాయంతో రూపొందించుకున్నాడు. వాటి ద్వారా ఈ కామర్స్ సైట్లలో వస్తువులు కొనుగోలు చేసిన వారికి బహుమతి గెలుచుకున్నారని మెసేజ్‌లు పంపిస్తున్నారు.

వాటిని నమ్మి ఫోన్ చేసిన వారికి అందులో పనిచేస్తున్నట్లు నకిలీ ఐడి కార్డులు, పాన్, ఆధార్ కార్డులు పంపించి నమ్మిస్తున్నారు. వీటిని చూసి నమ్మిన వారి నుంచి రిజిస్ట్రేషన్, డాక్యుమెంటేషన్ చార్జీలు, జిఎస్‌టి, కన్సర్‌వేషన్ చార్జీలు, ఇన్‌కం ట్యాక్స్ తదితర పేర్లు చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారు. వివిధ బ్యాంకుల ఖాతాలు ఓపెన్ చేసి వాటిల్లో డబ్బులు ఆన్‌లైన్ ద్వారా డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు సందీప్ కుమార్‌కు సాయం చేస్తున్న మిగతా వారు అతడికి బంధువులు అవుతారు. వారి సాయంతో బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు.

Arrested for Robbing money in name of Gifts
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News