Home తాజా వార్తలు గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

marijuana

 

130కిలోల గంజాయి స్వాధీనం
ఆరుగురి అరెస్టు, మరొకరి పరార్

హైదరాబాద్ : నిషేధిత గంజాయి తరలిస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు అరెస్టు చేశారు. గంజాయిని రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంని 130 కిలోల గంజాయి, రెండు కార్లు, రూ.12,000 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ.31,62,000 ఉంటుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, చిన్నగారికుండ తండాకు చెందిన బానోతు సుధాకర్, బానోతు సురేష్ నాయక్, గూడెపుకుంట తండాకు చెందిన జర్పుల హుస్సేన్, జాటోత్ తండాకు చెందిన ధరావత్ చిరంజీవి అలియాస్ రఘు, పెన్‌పహాడ్ మండలం, మహ్మదాపురానికి చెందిన కంబంపాటి నాగేశ్వరరావు, బానోతు వెంకన్నను అరెస్టు చేశారు.

ఎపిలోని విశాఖపట్టణానికి చెందిన గంజాయి సరఫరాదారు సురేష్ పరారీలో ఉన్నాడు. ఈ ముఠా నాయకుడు సుధాకర్, జర్పుల హుస్సేన్ స్నేహితులు ఇద్దరూ సూర్యపేట జిల్లాకు చెందినవారు. ఈ ముఠా విశాకపట్టణం, ధారకొండ ఏజెన్సీ ఏరియాలో రూ.2,000కు కిలో చొప్పున కొనుగోలు చేసి రూ.7,000కు విక్రయిస్తున్నారు. గంజాయి రవాణాకు ఈ ముఠా రెండు కార్లను వాడుతున్నారు, ఇందులో గంజాయి తరలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వనస్థలిపురంలోని ఆటోనగర్‌లో ఎస్‌ఓటి పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండడంతో వీరు పట్టుబడ్డారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Arrested marijuana smuggling gang