న్యూఢిల్లీ: న్యూయార్క్-ఢిల్లీ విమానం ద్వారా 328 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఎయిర్ ఇండియా తీసుకువచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ సోమవారం తెలిపారు. అత్యవసర సరఫరాలు అందుతున్నప్పటికీ దేశంలోని అనేక ప్రాంతాలలో మెడికల్ ఆక్సిజన్ కొరత ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో 20 మంది రోగులు మరణించిన విషయం తెలిసిందే.
కరోనాపై పోరుకు భారత్ సర్వశక్తులూ ఒడ్డుతోందని, న్యూయార్క్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 328 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు న్యూఢిల్లీ చేరుకున్నాయని సోమవారం పురి ట్వీట్ చేశారు. ఇలా ఉండగా..సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో మొత్తం 3,52,991 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1,73,13,163కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షలు దాటింది. తాజాగా 2,812 మరణాలు చోటు చేసుకోవడంతో కరోనా మృతుల సంఖ్య 1,95,128కు చేరుకుంది.