Home కలం ప్రరోచన

ప్రరోచన

Tripathi, Valmiki Ramayana

 

త్రిపథ వాల్మీకి రామయణం, వ్యాస భారతం భాగవతం కవిత్రయ ఆంధ్ర మహాభారతం, పోతన భాగవతం నుంచి యథాతథంగా సకల విశేషాలు
తల్లావజ్ఝల శివాజీ

రామాయణ భారత భాగవతాలను (రా.భా.భా) ఎందరో మహానుభావులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎన్నెన్నో విశేషాలను గ్రంథాలుగా మనకు అందించారు. వీటిలో కొన్నింటిని తెలుగులోనైతేనేమి ఆంగ్లంలోనైతేనేమి చదివిన తరువాత మూల గ్రంథాలను చదవాలి అనే తపన బయలుదేరింది తల్లావజ్ఝల శివాజీకి. సంస్కృత రామాయణం, సంస్కృతాంధ్ర భారత భాగవతాలూ (కవిత్రయం పోతన) వరసబెట్టి చదువుకుంటూపోయారు. పనిలో పనిగా వీటిలో తమ దృష్టిని ఆకర్షించిన సంగతుల్నీ వింతలనూ విశేషాలనూ ఎత్తి రాసుకోవడం ప్రారంభించారు. ఆనక వా టిని అన్నింటినీ ఆరు శీర్షికలుగా క్రోడీకరించి ఇదిగో ఇలా అచ్చొత్తించి మన ముందు ఉంచారు. రా.భా. భాలను ఎన్నోసార్లు పారాయణ చేసిన వారికి కూడా దృష్టిలో పడని చిన్నా పెద్ద సంగతులెన్నో ఈ గ్రం థంలో ఉన్నాయి.

కొన్ని సందేహాలకు సమాధానాలూ ఉన్నాయి. ఇదొక విశిష్ట దృష్టికోణం నుంచి రూపొందించిన గ్రంథం. ఇందులో మూల గ్రంథాలలోని ఆయా సంగతుల్ని మనముందు ఉంచడం తప్ప దేనికీ తనదైన అభిప్రాయాల రంగులు అద్దడం కనిపించదు. అందుకని ఎవరైనా దీన్ని నిరభ్యంతరంగా హాయిగా చదువుకోవచ్చు. వినోదించవచ్చు. విజ్ఞానం పెంచుకోవచ్చు. సందేహాలు తొలగించుకోవచ్చు. మరో కోణం నుంచి ఆలోచించనూవచ్చు. వాచవిగా ఒకటి రెండు అంశాలు మీ దృష్టికి తెస్తాను. రామలక్ష్మణులు కబంధుడి కళేబరాన్ని గోతిలోకి తోసి, ఏనుగులు విరవడంతో ఎండిపోయిన కట్టెలు తెచ్చి దహన సంస్కారం జరిపినట్టు వాల్మీకి వర్ణించాడు. ఇది వీరి దృష్టిని ఆకర్షించింది. చెట్లు నరకకుండాను, అగ్నివలన అడివి కాలిపోకుండాను సముచితమార్గం పలికాడు వాల్మీకి అని తెగ మెచ్చుకున్నారు. సంపాతి మాటల్లో ఏయే పక్షులు ఏయే ఎత్తుల్లో ఎగురుతాయో కనిపిస్తుంది. అది వీరికి నచ్చింది.

మన దృష్టికి తెచ్చారు. రావణాసురుడి భవన సముదాయం చుట్టూ ఉద్యాన వన్యప్రాణి సంరక్షణ కన్పిస్తుందని ఆ విశేషాలూ ఉటంకించారు. భారతంలో ద్వైతవనం నుంచి పాండవులు కామ్యక వనానికి ఎందుకు తరలిపోవాల్సి వచ్చిందో కన్పిస్తుంది. దీన్ని ప్రస్తావించి ఆదిమ గణాల కదలికను ప్రాథమిక హేతువుల్లో ఒకటి మనకు స్ఫురించేలా చేశారు. ఇలాంటివి ‘ప్రకృతి ప్రతిబింబం’ అనే తొలి ప్రకరణంలో మనల్ని ఆకట్టుకుంటాయి.ప్రకృతి సిద్ధ విషయాన్ని ఉపమానంగా స్వీకరించి ఆయా సందర్భాలలో ఈ కవులు సాధించిన కమనీయతలను రెండవ ప్రకరణంలో పొందుపరిచారు. ఒక చెట్టును నరికి వేస్తోంటే పక్కనున్న చెట్టు ఎలా రక్షించలేదో అలాగే నా తండ్రీ నిస్సహాయంగా ఉండిపోయాడంటాడు శ్రావణ కుమారుడు దశరథుడితో. పర్వత శిఖరాల మధ్య మేఘాలు వేలాడుతుంటే ఆ పర్వతం ఉత్తరీయం ధరించినట్టుంది అంటాడు వాల్మీకి ఒక సందర్భంలో.

రాక్షసుడు వెంటబడితే పారిపోతున్న యువక్రీతుడు దాక్కుందామనుకున్న సరస్సు, అతడు ఎటు నుంచి దిగుదామంటే అటువైపు నుంచే అది కుంచించుకపోయే విచిత్రాన్ని వీరు గమనించి మనకు దర్శింప చేశారు. పోతనగారు కంసుడి భయానికి పరాకాష్ఠగా చెప్పిన పోలిక చూడండి. శరీరానికి గడ్డి పరక తగిలినా అది శ్రీహరి చేతిదెబ్బ అనిపిస్తోందట! ఏ వాసన సోకినా వనమాలికేమో అనిపిస్తుందట! ఇలాంటివన్నీ సౌందర్యం కమనీయం అనే ప్రకరణంలో రాసిపోశారు. ధర్మాత్ముడయిన రాజు ప్రజారక్షణ కోసం చేసే పని క్రూరమైన పాపమైనా దుష్టమే అయినా చేయదగినదే (రా.బాల 17) అని రామాయణం చెపితే, శాంతి రూపంలో ఉన్న కత్తి గలవాడిని దుర్జనుడు ఏమీ చేయలేడు, గడ్డి మొలవని చోట నిప్పు పడీ ఏమీ చేయలేదు అని భారతం చెప్పింది. ఈ దినుసు సూక్తుల సమాహారం ‘సామాజికం మానవీయం’ అనే ప్రకరణం.

ధర్మం తత్తం అనే నాలుగో అధ్యాయం కొంచెం విస్తృతం. సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించేవీ ఆలోచింపచేసేవీ అయిన ధార్మిక తాత్తికాంశాలు వీటిలో ఎక్కువ కాబట్టి. ఎవరి దృష్టినీ పెద్దగా లోగొనని చిన్న చిన్న విషయాలు, కాని ఆలోచింప జేసేవి. స్వల్పం అనల్పం అనే అయిదో ప్రకరణం. రావణుడి దెబ్బకు కిందబడ్డ సుగ్రీవుడు బంతిలా ఎగిరాడట (రాయుద్ధ 51-23) అంటే రబ్బరు బంతులు అప్పట్లో ఉన్నట్టేనా! భారతంలో లక్క ఇల్లు ఎలా నిర్మించారు. దాని పేరు “శివ” అన్నారు వ్యాసుడు. భవనాలకు నామకరణాలు అప్పటివేనా! ధర్మరాజుతో జూదమాడటానికి దుర్యోధనుడు కట్టించిన సభా భవనం పేరు తెలుసా? “తోరణస్ఫాటికం”. రాయబారానికి వెళ్లిన కృష్ణుణ్ణి దుర్యోధనాదులు బంధించే ప్రయత్నం చేశారా? వ్యాస భారతంలో ఉన్నదా? ఇలాంటి సరదా సరదా అంశాల సమాహారం “స్వల్పం అనల్పం”.

“చిత్రం విచిత్రం” అనే ఆరో ప్రకరణమూ ఇలాటిదేగాని తేడా ఉంది. లోకంలో వ్యాప్తిలో ఉండి మూల గ్రంథాలలో కనిపించని విచిత్రాలు దృశ్యమాలిక ఇది. ఊర్మిళ నిద్ర, లక్ష్మణ రేఖలు వాల్మీకంలో లేవు. భీముడూ జరాసంధుడూ కలబడేటప్పుడు పరస్పరం పాదాభివందనం చేసుకున్నారు. భారతం ప్రకారం అత్యధిక శాతం రుషులు పశువులూ, శకటాలూ, భార్యలూ, సుతులూ కలవారు. విద్యా వివాదాల్లో ఓడిపోయిన వారికి బాధించడం నీళ్లల్లో ముంచడం, గుండు కొట్టించడం వగైరా శిక్షలుండేవి. భారతంలో వచ్చిన రామాయణ కథలో సీతాదేవికి అగ్నిపరీక్ష లేదు. సీతారామపట్టాభిషేకంతో కథ అయిపోయింది. ఉత్తర రామాయణం లేదు. వటపత్రశాయి అంటే ఎర్రన వర్ణన వేరు.

మార్కండేయ పురాణ కథనం వేరు. ఈ దినుసు చిత్రాలూ విచిత్రాలూ మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రక్షిప్తాల గురించి, అనంతర కాలంలోని కవుల కల్పనాచతురి గురించీ ఆలోచింప జేస్తాయి. మూల గ్రంథాలను శ్రమపడి క్షుణ్ణంగా అధ్యయనం చేసి వక్తవ్యాలనిపించిన వాటిని ఇలా మనకు అందించారు శ్రీ శివాజీగారు. వీరి కృషినీ, జిజ్ఞాసనూ, వివదిషనూ ఎంతగానో అభినందిస్తూ కృతజ్ఞతలు చెబుతూ, పాఠకులకు స్వాగతం పలుకుతున్నాను. చదవండి, మీకు శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఇదీ నా భరోసా. సెలవు.
( తల్లావజ్ఝల శివాజీ గ్రంథం త్రిపథకు రాసిన ముందు మాట)
                                                                                     బేతవోలు రామబ్రహ్మం

Articles about Ramayana, Andhra Mahabharatam