Home ఎడిటోరియల్ శ్రీలంక విషాదానికి మూలమేది?

శ్రీలంక విషాదానికి మూలమేది?

Srilanka Blasts

 

 

దాదాపు 300 మంది మరణించి మరికొన్ని వందల మంది గాయపడిన శ్రీలంక బాంబు పేలుళ్ల ఘట న ఎంత దారుణమైనదో అంత ఖండించదగినది. ప్రపంచ వ్యాప్తంగా ఇంతవరకు జరిగిన టెర్రరిస్టు దాడులలో ఒకే రోజున ఒకే దఫాలో చోటు చేసుకున్న అతిపెద్ద నష్టాల్లో ఇది ఒకటి. శ్రీలంకతోపాటు ఎక్కడ ఏ టెర్రరిస్టు దాడికి పాల్పడే వారైనా అందుకు తమ కారణాలు తాము చెప్తారు. అవి ఒకోసారి స్థూలంగా చూసినపుడు కొంత విలువ ఉన్నవిగా కన్పించవచ్చు కూడా. కాని, కారణాలు విలువగలవి అయినా ఆ టెర్రరిస్టులు అనుసరించే ప్రతీకార పద్ధతులు మాత్రం ఏ విధంగానూ సమర్థించలేనివి. వారి దాడులకు గురవుతున్నది తమకు నిజంగా హాని చేస్తున్న వారు కాదు. ఏ హాని కూడా చేయని సామాన్య పౌరులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు, విదేశీయులు బలవుతున్నారు. ఒకోసారి అందులో తమపట్ల సానుభూతి చూపగల వారు కూడా ఉండవచ్చు. అందువల్ల టెర్రరిజం అన్ని విధాలుగానూ ఖండించదగినది.
శ్రీలంకలో ఈ నెల 21వ తేదీన జరిగిన దాడి కూడా ఇటువంటిదే. అందుకు బాధ్యత తమదని నేషనల్ తౌఫీఖ్ జమాత్ (ఎన్‌టిజె) అనే సంస్థ ప్రకటించింది. ఇది ఇంతకు ముందు అంతగా పేరు వినిపించని సంస్థ. అయినప్పటికీ ఒకేమారు నాలుగు నగరాలలో ఎనిమిది పేలుళ్లు ఇంతశక్తివంతంగా జరిపారంటే, ఆ సంస్థ అజ్ఞాతమైన రీతిలో ఎప్పటి నుంచో సంఘటితమవుతున్నదన్న మాట. ఆ సంస్థకు ఐఎస్‌ఐఎస్‌తో సంబంధాలు ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గాని ఇంకా ధ్రువపడలేదు. ఒకవేళ ఉన్నా లేకపోయినా ఆశ్చర్యపడనక్కరలేదు. ఈ మాట అనేందుకు తగు కారణాలున్నాయి.
శ్రీలంకలోని సింహళ జాతీయుల సింహళజాతివాదం అక్కడి బౌద్ధ గురువులతో కలిసి తమిళ జాతి వాదాన్ని చాలా వరకు అణచివేసిన తర్వాత, ముస్లింలను కూడా అణచివేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందుకు వారి నుంచి నిరసనలు, ప్రతిస్పందనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అటువంటి స్థానికమైన నిరసనల నుంచి చిన్నచిన్న సంస్థలు కొన్ని ఆవిర్భవిస్తూ వస్తున్నాయి. వాటిలో ఎన్‌టిజె ఒకటి అనుకోవాలి. అది నిజమైతే, ఐఎస్‌ఐఎస్‌తో నిమిత్తం లేకుండా కూడా ఎన్‌టిజె ఈ టెర్రరిజానికి పాల్పడి ఉండవచ్చు. ఇకపోతే శ్రీలంకలో ముస్లింల నిరసన నేపథ్యంలో అక్కడి జోక్యానికి ఐఎస్‌ఐఎస్ ప్రయత్నిస్తున్నదనే వార్తలు కొద్ది సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ దృష్టా ఆ కార్యకలాపాలతో పాటు ముస్లిం యువతను నియంత్రించేందుకు శ్రీలంక ప్రభుత్వం ఇజ్రాయెల్ సహకారాన్ని తీసుకుంటున్నదనే వార్తలు కూడా కొద్ది సంవత్సరాల నుంచి ఉన్నాయి. కనుక ఏది ఎట్లా జరిగి ఉన్నా ఆశ్చర్యపడవలసిందిలేదనాలి.
చిరకాలంగా ఉన్న ముస్లింల నిరసన పరిణామాలు ఇపుడు ఈ స్థాయికి చేరటం శ్రీలంకకు ఒక పెద్ద సవాలు అవుతున్నది. తమిళ జాతీయ వాదాన్ని, ఎల్‌టిటిఇని అణచివేసినట్లు పూర్తి నమ్మకం కలిగి ఊపిరి పీల్చుకుంటున్న సింహళ జాతీయవాదులకు, బౌద్ధ గురువులలో తీవ్ర స్వభావం గలవారికి ఈ ఘటనలు మహా దిగ్భ్రాంతికరమైనవి. శ్రీలంక ఘర్షణలను పైపైన చూడటంగాక వాటి మూలాలలోకి వెళ్లినపుడుగాని ఈ విషయాలు సరిగా అర్థం కావు. ఆదివారం నాటి పేలుళ్లు జరిగిన నగరాలు, ప్రదేశాలు జాగ్రత్తగా గమనించదగ్గవి. మొత్తం నాలుగు నగరాలలో మూడు కొలంబో, నెగోంబో, దెహివాలా పశ్చిమాన ఉండగా, ఒకటి బట్టికలోవా తూర్పు తీరాన ఉంది. ఇవన్నీ ముస్లింలు మెజారిటీగా కాకపోయినా తగినంత సంఖ్యలో గలవి. పశ్చిమాన గల మూడింటిలో సింహళీయులు, తమిళులతో పాటు ముస్లింలు ఉన్నారు. బట్టికలోవాలో సింహళీయులు తక్కువ. పశ్చిమాన సింహళీయులది ఆధిపత్యం. వారికి అక్కడ తమిళులతో, ముస్లింలతో కూడా ఉద్రిక్తతలు శ్రీలంక ఇంకా బ్రిటిష్ వలస పాలన కింద ఉన్నప్పటినుంచే తలెత్తాయి. బట్టికలోవాలో తమిళులు, ముస్లింముల మధ్య ఉద్రిక్తతలున్నాయి. ఈ స్థితి ఉత్తరాన జాఫ్నా ప్రాంతంలోనూ ఉంటూ వచ్చింది.
ఆ విధంగా ఇది ముక్కోణపు ఉద్రిక్తత. ఈ ఘర్షణలో ముస్లింలు తక్కువ సంఖ్యలో గలవారు అయినందున, వారికి సింహళీయులవలె సైనిక బలంగాని, తమిళులవలె వివిధ మిలిటెంట్ సంస్థలుగాని లేనందున మొదటి నుంచి ఇద్దరి మధ్య నలిగిపోయారు. కొన్ని దశలలో ఇటు వైపు, కొన్ని దశలలో అటువైపు చేరి ఆత్మరక్షణకు ప్రయత్నించారు. ప్రధానంగా వ్యాపార రంగంలో గల ముస్లింలు అందుకు వీలుగా శాంతినే కోరుకుంటూ వచ్చారు తప్ప తమిళులవలె ప్రత్యేక ఈలం, ప్రత్యేక హక్కులు, ఫెడరల్ వ్యవస్థల వంటి డిమాండ్ల జోలికి ఎప్పుడూపోలేదు. పార్లమెంటులో, కేబినెట్‌లో కొద్దిపాటి ప్రాతినిధ్యం లభిస్తే అంతటితో సంతృప్తి చెందారు. బట్టికలోవాతో పాటు శ్రీలంకలోని దాదాపు అన్ని ప్రాంతాలను దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం సందర్శించిన నా దృష్టికి ఈ పరిస్థితులన్నీ అప్పటికే కన్పించాయి.
సింహళీయ తమిళ ఘర్షణ దశ ముగిసిపోయిన తర్వాత ఇపుడు సింహళీయ ముస్లిం ఘర్షణ దశ ముందుకు వస్తున్న సూచనలు కన్పిస్తున్నాయి. పైన సూచించినట్టు, సింహళీయులకు, ముస్లింలకు సత్సంబంధాలు మొదటి నుంచీ లేవు. ఏదో ఒక స్థాయిలో ఉద్రిక్తతలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తమిళ జాతీయవాదాన్ని అణచివేసిన తర్వాత సంవత్సరాలలో సింహళీయులు అదే ఊపులో ముస్లింములను ఒక స్థాయి అణచివేతకు, చిన్నస్థాయి దాడులకు గురి చేశారు. ఈ స్థితిలో ఇపుడొక కొత్త దశ మొదలవుతున్నదా అనే సందేహాలు కలుగుతున్నాయి. ముస్లింల వైపు నుంచి సాధారణ స్థాయిలో వ్యక్తమవుతూ వచ్చిన నిరసనలకు యువకులు టెర్రరిజం రూపం ఇస్తున్నారనుకోవాలి. అయితే వారు సింహళీయులపై, బౌద్ధ గురువులపై, ప్రభుత్వంపై వత్తిడిని సృష్టించవచ్చుగాని అంతకుమించి ఏదో సాధించగల అవకాశం ఎంతమాత్రం లేదు. అందుకు ఒక కారణం వారికి గాని, ముస్లిం జనాభాకుగాని అంతశక్తి లేదు. రెండవ కారణం ముస్లిం జనాభాకు ప్రధానంగా కావలసింది తమ వృత్తి వ్యాపారాలు సజావుగా సాగిపోవటం. అందుకు మిలిటెన్సీలు, టెర్రరిజాలు చుక్కెదురువంటివి.
శ్రీలంకలో అసలు సమస్య అక్కడి నాయకత్వపు వైఫల్యాలు. వలస పాలన కాలంలో సింహళీయ తమిళ ముస్లిం సమస్యలు ఎట్లుండినా, దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత మెజారిటీ సింహళీయులు అక్కడ సింహళ జాతి నిర్మాణానికి బదులు శ్రీలంక జాతి నిర్మాణానికి కృషి చేయవలసింది. పొరుగునే గల భారత దేశంలో ఎన్నెన్నో వైవిధ్యతలు ఉన్నా అందరినీ కలుపుకొని భారత జాతి నిర్మాణానికి జరిగిన ప్రయత్నాల వంటివి శ్రీలంకలోనూ జరిగి ఉంటే తమిళుల సమస్య ఎల్‌టిటిఇ రూపం వరకు వచ్చి ఉండేది కాదు. ముస్లింల సమస్య ఎన్‌టిజె స్థాయి వరకు వికటించేది కాదు.
భారతదేశంలోని మూలవాసులవలె శ్రీలంకలోనూ క్రీస్తు పూర్వం నుంచి మూలవాసి జాతులున్నాయి. వాటిని మధ్యయుగాలలోనే “విజయవంతంగా” అణచివేశారు. ఆ జాతులు ఒక సమస్య కావటం ఎప్పుడో ముగిసిపోయింది. కాని తమిళ, ముస్లిం సమస్యలు స్వాతంత్య్రానంతరం కూడా మిగిలాయి. మెజారిటీ సింహళీయ జాతి, దానికి సైద్ధాంతిక సమర్థనలను సమకూర్చిన బైద్ధ మఠాధిపతులు, స్వాతంత్య్ర కాలం నుంచి ప్రజాస్వామికంగా, ఆధునిక దృష్టితో, యావత్ శ్రీలంక జాతి భావనతో తగిన దార్శనికతను చూపలేదు. ఒక విధంగా చెప్పాలంటే సింహళ బౌద్ధ ఫాసిస్టు లక్షణాలను ప్రదర్శించారు. అందువల్ల కలిగే తీవ్ర దుష్ఫలితాలు ఏమిటో తమిళ మిలిటెన్సీ దశలో చవిచూసిన తర్వాత సైతం వారి వైఖరి మారకపోవటం గమనించదగ్గది. ఇప్పటికైనా సింహళీయ తమిళ ముస్లిం సమైక్యతతో శ్రీలంక జాతి నిర్మాణమే అక్కడి సమస్యకు పరిష్కారం.

టంకశాల అశోక్
9848191767

Articel on Sri Lanka bamb Attack