Home ఎడిటోరియల్ జీతం, పెన్షన్, బోనస్ కథా కమామిషు

జీతం, పెన్షన్, బోనస్ కథా కమామిషు

Central Government

 

ఈ మధ్య కేంద్ర ప్రభుత్వ ఏడవ వేతన సవరణ కమిషన్ సిఫారసులు తమకు ఇంకా అమలు చేయడం లేదని, కొందరు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి కరువు భత్యాన్ని తదితరాలను కలిపి కొత్త పేస్కేల్స్ అమలు జరపాలని కోరుతున్నారు. 2004 నుండి అపాయింట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు తమకు అంతకు ముందటివలె పెన్షన్ ఉండాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని కోరుతున్నారు. కొందరు పెన్షన్ పెంచాలని, బోనస్ పెంచాలని, కూలీలు పెంచాలని, తమకు డబుల్ బెడ్‌రూంలు కేటాయించాలని, ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులు, రేషన్ కార్డులు ఉన్నవారివలె లేనివారు కావాలని కోరుతున్నారు. ఇవన్నీ తాత్విక భాషలో కోర్కెలు. ఆశ్రితులు యజమానులను కోరే కోరికలు. కోరికలు తీరుస్తారని ఓట్లతో అధికారం అందిస్తుంటారు. కోర్కెలు దుఃఖహేతువు అన్నాడు బుద్ధుడు. కానీ ప్రపంచం కోర్కెల మీదే ఆధారపడి నడుస్తున్నది. దేవుళ్ళను కూడా కోర్కెలు తీరుస్తారనే మొక్కుతుంటారు.

ఈ మధ్య ఒకాయన ఇలాగే జీతాలు పెంచాలని కోరుతూ ఎదురయ్యారు. నేను అంతా విని జీతాలు సగానికి తగ్గించడం ఎలా? ఎలా అయితే జీతాలు సగానికి తగ్గించవచ్చు? ఎలా అయితే ఉద్యోగులు జీతాలు సగానికి తగ్గించడానికి ఒప్పుకుంటారు? ఈ విషయాలు ఆలోచించి, చర్చించి చెప్పమన్నాను. ఆయన తొలుత బిత్తరపోయి, ఆ తర్వాత సరేనని అన్నాడు. జీతాలు తగ్గించడం అంటే, ఇతర సౌకర్యాలు పెంచి జీతాలు తగ్గించడం అని చెప్పాను. ఉదాహరణకు ప్రభుత్వమే డబుల్ బెడ్‌రూం పథకం లాగా ఉద్యోగస్థులందరికి ఉచితంగా ఇండ్లు కట్టించి ఇవ్వడం. దానివల్ల ఇల్లు కిరాయి భత్యం ఇవ్వనవసరం లేదు. అలాగే సబ్సిడీపై రూపాయికి కిలో బియ్యం ఇచ్చినట్లుగా ఉద్యోగులకు అవసరమైన అన్ని సరుకులను సబ్సిడీపై అందిస్తే జీతాలు పెంచనవసరం లేదు.

మాట వరుసకు 1950, 60లలో జీతాలు 40, 60 రూపాయల పే స్కేలులో ఉండేవి. రూపాయి రూపాయిన్నర ఇంక్రిమెంటు ఉండేది. ఇప్పుడు 40 రూపాయలకు జీతం తగ్గించకపోయినా ఆనాటి ధరల ప్రకారం అవసరమైన సరుకులు, సేవలు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తే జీతాలు సగానికి పైగా తగ్గించవచ్చు. తద్వారా ఉద్యోగుల జీతాలు పెరగడం వల్ల మార్కెట్‌లో ధరలు పెరిగి, ఇతర ప్రజలు బాధపడి తమకు కూడా కూలీలు, జీతాలు పెరగాలని ఉద్యమించే ఒక నిరంతర చలనవలయం అవసరం తీరిపోతుంది. అందువల్ల నిరంతరం సబ్సిడీపై ఉత్పత్తులు, సేవలు అందిస్తే జీతాలు పెంచాల్సిన అవసరం లేదు. జీతాలు సగానికి తగ్గించవచ్చు అని వివరించారు. ఇది ఆలోచించాల్సిన విషయమేనని అన్నారు ఆయన. కొన్ని కంపెనీలలో, పరిశ్రమలలో 30, 40 ఏళ్ళ క్రింద కార్మికులు సబ్సిడీపై ఇవ్వాలని కోరి సాధించుకున్న రేట్లు నేటికీ కొనసాగుతున్నాయి. పావలాకు చాయ, ఆటానాకు టిఫిన్, రూపాయికి భోజనం, ఆయా కంపెనీలలో, పరిశ్రమలలో నేటికీ కొనసాగుతున్నాయి.

ఈ విధానం ఆధారంగా జీతాలు సగానికి తగ్గించే ఉపాయాలు చెప్పండి అనేది నా అభిప్రాయం. ఉద్యోగస్థుల నోరు ఒక అంతులేని గుహ. ఎంత బొగ్గేసినా ఇంకా వేయ్యమంటుంది అని అన్నారు ఒకాయన. రూపాయి విలువ 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు డాలర్‌తో, పౌండ్‌తో సమానంగా ఉండేది. కాకపోతే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం కనుక మా ఫౌండ్ ఆరు పైసలు ఎక్కువ ఉండాలని పెట్టుకున్నారు. 1964 నాటికి డాలర్‌తో రూపాయి విలువ నాలుగున్నర రూపాయలు. 1966లో ఇందిరాగాంధీ మరింత తగ్గించి రూపాయి విలువను డాలర్‌తో ఆరున్నర రూపాయలకు దిగజార్చారు. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలర్‌కు డ్బ్బై రూపాయలుగా దిగజారిపోయింది. చాలా విచిత్రమైన విషయమేమంటే అమెరికాలో 20 ఏళ్ళక్రింద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ప్రారంభ జీతం నెలకు 5 వేల డాలర్లు. బ్రహ్మచారులకు 30 శాతం ఇన్‌కంటాక్స్ పెళ్ళయితే ఇన్‌కంటాక్స్ 20 శాతమే.

ఇప్పటికీ ప్రారంభ జీతం 5 వేల డాలర్లు. ఇప్పటికీ ఇతర సరుకులు, కిరాయిలు సుమారు 20 ఏళ్ళ క్రిందట ఉన్నట్టే ఉండడం చాలామంది గమనించే ఉంటారు. ధరలు పెరగకపోతే జీతాలు పెంచనవసరం లేదు. ధరలు పెరగడానికి హోల్ సేల్ వ్యాపారం, హోల్ సేల్ వ్యాపారులకు గోదాముల స్టాక్‌పై బ్యాంకులు వడ్డీకి ఇవ్వడం, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేసి ధరలు పెంచడం ప్రధాన కారణం. డిసెంబర్‌లో 25 రూపాయలకు ఉండే కిలో బియ్యం. ఆరు నెలలు గడిచేసరికి 45 రూపాయలు కావడంతో రైతుకు చెందకుండా బ్యాంకులు, హోల్ సేల్ వ్యాపారులు, బ్లాక్ మార్కెటీర్లు సగం దాకా కొల్లగొడుతున్నారు. ఏ ఉత్పత్తి లేకుండానే సగం దాకా ధరలు పెరుగుతున్నాయి. రైతులకు ఆ 25 రూపాయల లోపలే పెట్టుబడి, లాభం, వరదలు, కరువులు, పురుగు మందులు, వడ్డీలు, తమ శ్రమ విలువ, విత్తనాలు, భూమి విలువ అన్ని సర్దుకోవాలి. అది గిట్టుబాటు కాకపోవడంవల్లనే రైతుకు రైతుబంధుతో ఎకరానికి 5 వేలు ఇస్తే బాగుంటుందని పథకం ముందుకు వచ్చింది. ఇట్లాగే ఉచితంగా ఇల్లు, కరెంటు, నల్ల నీళ్ళు, పిల్లల చదువులు, వారి ఫీజులు, బట్టలు సబ్సిడీపై క్యాంటిన్‌లు, టివిలు, బైక్‌లు, కార్లు వస్తే జీతాలు పెంచాల్సిన అవసరం తగ్గుతుంది. జీతాలను ఈ పద్ధతిలో సగానికి ఎలా తగ్గించాలో సూచించాలని ఆ ఉద్యోగ సంఘ నాయకుడిని కోరాను. ఆయన ఏం చెప్తాడో చూడాలి.

ఈమధ్య మరో చర్చ జరిగింది. ఒకావిడకు 102 ఏండ్ల వయస్సు. ముసలావిడ. వృద్ధాప్య పెన్షన్ వెయ్యి రూపాయలు తీసుకుంటున్నది. అందులో విశేషమేమీలేదు. అయితే ఆమె కొడుకులు, మనమళ్ళు ఉన్నత ఉద్యోగాల్లో, అమెరికాలో బతుకుతున్నారు. బాగా కలిగిన కుటుంబం వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకోవడం అన్యాయం అని వారి వాదన. ఈ పెన్షన్‌లు ముసలివాళ్ళకు అందడంలేదని, కొడుకులు కోడళ్ళు, మనమళ్ళు, మనుమరాళ్ళు గుంజుకొని ముసలావిడను అరుసుకోవడంలేదని, ఒకట్రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ ఊరి సర్పంచ్, ఆ వాడకట్టు ఇరుగు పొరుగు వారు, బంధుమిత్రులు ఈ విషయాలను పట్టించుకొని కౌన్సిలింగ్ చేయాలి. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే, యాసిడ్ దాడి చేస్తే, రేప్ చేస్తే సర్పంచ్‌ను, వార్డు మెంబర్లను, ఆ ఊరి కుల సంఘాల నాయకులను సస్పెండ్ చేయాలి, జైల్లో పెట్టాలి అని కొందరు ఆవేశంగా మాట్లాడారు. సర్పంచ్ అనేవారు ఆ ఊరికి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రివంటివారు. అన్ని పట్టించుకోవాలని అన్నారు. నా అభిప్రాయం కూడా అదే.

పెన్షన్ల గురించి మరొక విచిత్రమైన కేసు ఎదురైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే ఒక ప్రొఫెసర్ తల్లి నల్గొండలో తన ఊర్లో బతుకుతున్నది. తనకు వెయ్యి రూపాయల పెన్షన్ ఎందుకు వస్తల్లేదని కొడుకును పైరవీ చేసి ఇప్పించాలని డిమాండ్ చేసింది. అమ్మా నేను ఉద్యోగం చేస్తున్న కాబట్టి నీకు పెన్షన్ రాదు అని ఆయన చెప్పాడు. నువ్వు ఉద్యోగం చేస్తే నాకేందిరా! నేను ప్రభుత్వానికి ఓటేయలేదా? ప్రభుత్వం నా గురించి పట్టించుకోవద్దా? నేను నీమీద ఎందుకు ఆధారపడాలి? కొడుకు ఎప్పుడు పెడతడో అని ఎందుకు ఎదురుచూడాలి? నీ దయాదాక్షిణ్యాలమీద ఎందుకు బతకాలి. నేను కూడా కష్టపడి బతికిన. నాక్కూడా సర్కార్ వెయ్యి రూపాయల పెన్షన్ ఇయ్యాలి అని వాదించింది. నేను ఉద్యోగం వదిలేస్తే నీకు పెన్షన్ వస్తది అని కొడుకు జవాబు. వదిలేయ్ నాకేందిరా! నాకు వెయ్యి రూపాయలు పెన్షన్ కావాలని నిలదీసింది. బిత్తరపోవడం కొడుకు వంతయింది. ఆ ప్రొఫెసర్ ఈ సంగతి నాకు వివరించాడు. ఇలా ఆసరా పథకం ఎన్ని రకాల నూతన ఊహలను, ఆశలను సృష్టించిందో!. బీడీ కార్మికులకు చేసిన కూలి కాకుండా నెలకు వెయ్యి, (త్వరలో రెండు వేలు) ఆసరా, జీవన భృతి ఇస్తున్నారు. వారి పిల్లలు, ఆరోగ్యం, బట్టలు, స్కూలు ఫీజులు, ఇంటి సరుకులు అన్నిటా ఎంతో సౌలభ్యం పెరిగింది. దీన్ని జీవన భృతి అని అన్నారు. ఇలా జీతాలు సగానికి తగ్గిస్తే రూపాయి విలువ రెట్టింపు అవుతది. తిరిగి డాలరు, రూపాయి, ఫౌండ్, 1947లోవలె ఒకటికి ఒకటిగా సమానమయ్యే దశ ఎంతో దూరంలో ఉండదు.

ఒకావిడ ఆ 102 ఏళ్ళావిడ పెన్షన్ తీసుకోవడం, ఈ తల్లి తనకు కూడా పెన్షన్ రావాలని కోరడం తప్పు అని వాదించింది. ఈమె కూడా ఉద్యోగం చేసి హాయిగా పెన్షన్ మీదనే బతుకుతున్నది. మరి నీ బిడ్డ ఉద్యోగం చేస్తున్నది కాబట్టి నువ్వెందుకు పెన్షన్ తీసుకోవాలి? నీ బిడ్డ మీద ఆధారపడి బతకాలి కదా అని నేనన్నాను. ఈ చర్చ ఇంకా దూరం పోయింది. కొడుకులు, కోడళ్ళు, బిడ్డలకు ఉద్యోగాలు వస్తే, ఉద్యోగాలు ఇస్తే వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? వారిని తమ పిల్లలు సాదాలికదా! కుటుంబ సభ్యులందరిని కలుపుకొనే జీతం యిస్తున్నారుకదా!. అని కొత్త కోణం ముందుకు వచ్చింది. ఉద్యోగస్థుల పిల్లలు సంపాదనాపరులైనాక, వారి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినంక, ఉద్యోగాలు వచ్చినాక, వారి తల్లిదండ్రులకు పెన్షన్ బంద్ చేయాలి. అప్పుడే ఈ 102 ఏండ్ల ముసలావిడ, ప్రొఫెసర్ తల్లి పెన్షన్ పొందే హక్కు లేదని చెప్పడం సాధ్యం అనేది చర్చలో తేలింది. ఒక చిన్న చర్చ ఎంత పెద్ద తాత్విక, ఆర్థిక, మానవ స్వభావ చర్చకు దారితీసిందో ఆశ్చర్యం వేసింది. ఇది జీతం పెన్షన్ బోనస్ కథా కమామిషు.

అందువల్ల చెప్పవచ్చేది ఏమంటే నిజంగానే ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గిస్తే, వారి పిల్లలకు ఉద్యోగ కల్పన చేస్తే పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేసుకోగలిగితే జీతాల బరువు సగం కన్నా తక్కువకు దిగిపోతుంది. సబ్సిడీల వల్ల ఖర్చు కొంత పెరుగుతుంది. కానీ ఇల్లు కట్టించి ఇవ్వడం, హెల్త్ కార్డులు, ఉద్యోగ కల్పన వంటివాటివల్ల లక్షలాదిమందికి నూతన ఉపాధి లభిస్తున్నది. ఇళ్ళంటే గుర్తుకు వచ్చింది. గృహప్రవేశం నాడు ఇల్లు కట్టిన సుతారి, కూలీ మేస్త్రీలకు కొత్త బట్టలు పెట్టడం సంప్రదాయం. ఇది అదివరకు ఇచ్చిన కూలికి అదనంగా ఇచ్చే బోనస్ అన్నమాట. చదువు చెప్పినందుకు, చదువు అయిపోయిన తర్వాత కూడా కనపడ్డప్పుడు గురువులను గౌరవించడం ఒక బోనస్. ఈ బోనస్ అందుకునేవారు మంచి గురువు.

హోటళ్ళలో టిప్పులు ఇస్తారు. అమెరికాలో టిప్పులో కూడా యజమాని కొంత వాటా తీసుకుంటాడు. అది ఆయనకి బోనస్. పెన్షన్, బోనస్ అనేది అదివరకే చేసిన సేవలకు, కృషికి అదనంగా, అవసరమైన మేరకు, ఆత్మీయత మేరకు ఇచ్చే బోనస్. సమాజానికి సేవ చేసి, పిల్లలకు సేవ చేసి అలసిపోయిన వృద్ధాప్యంలో ఆసరా పథకం ఒక ఆశాకిరణం. పెన్షన్, బోనస్ ఒక ఆశాకిరణం. జీవితం పట్ల, ప్రభుత్వం పట్ల, కొడుకులు, బిడ్డలపట్ల ఆశను, విశ్వాసాన్ని పెంచే ఒక మంచి సంస్కృతి, సంప్రదాయం. దీన్ని కేవలం డబ్బు రూపంలో కొలవడం సాధ్యం కాదు. అది ఇచ్చే నైతిక మద్దతు, అదినెలకొల్పే విలువలు, సంస్కృతి గొప్పవి. ఏమైనప్పటికీ 102 ఏండ్ల ముసలావిడ, ఈ ప్రొఫెసర్ తల్లి, ఈ పెన్షన్‌పొందే అధికారి, ఆ సంఘ నాయకులు చేసిన చర్చలు అనేక కోణాలను, సామాజిక విలువలను ముందుకు తెచ్చిన విషయం మాత్రం వాస్తవం. వాటిని అనేక కోణాల్లో నూతన ఆలోచనలతో చర్చించడం ఎంతైనా అవసరం. అప్పుడే సమాజం నూతన ఆలోచనలతో కొత్త విషయాలను, కొత్త పథకాలను రూపొందించుకోవడం సాధ్యపడుతుంది.

Article about Amendment Commission Recommendations