Home ఆఫ్ బీట్ సహృదయ సాహిత్యవిమర్శ వైవిధ్యం

సహృదయ సాహిత్యవిమర్శ వైవిధ్యం

edt

కవిగా, కథారచయితగా, నాటక రచయితగా చిరపరిచితమైనటువంటి అమ్మంగి వేణుగోపాల్ గారిలో మరో గొప్ప సాహితీ కోణం సాహిత్య విమర్శ. ‘’పరిశోధన అనేది సత్యాన్వేషణ. ఎంపిక చేసుకున్న ఒక అంశం మీద కొత్త వెలుగులు ప్రసరింపజేయడం. ఇందుకు శాస్త్రజ్ఞానం, తర్క బుద్ధి, సహృదయత పరిశోధకుడికి తోడ్పడే శక్తులు ఇది పరిశోధన పైన అమ్మంగి వేణుగోపాల్ గారి అభిప్రాయం. ఇందులో కథ, కవిత, నవల, పరిశోధన, అనువాదాలు, గల్పికలు, నాటకాలు, వ్యక్తుల జీవితాలకు సంబంధించినటువంటి పదహారు రకాలైన ప్రక్రియల లోతుల్లోకి వెళ్ళి భిన్నమైన కోణాల్లో ఆవిష్కరించిన అరవై రెండు వ్యాసాలు ఉన్నాయి. ఆ విశ్లేషణలు కూడా మనో విశ్లేషణాత్మక ధోరణిలో, ప్రతీకాత్మక వాదంతో, తులనాత్మక పద్దతిలో ఇలా రకరకాల విమర్శనా పద్ధతుల ద్వారా ఆయా వ్యాసాల్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందులో తొలి వ్యాసంలోనే ‘ఆధునికాంధ్ర కవిత్వం సినారె పరిశోధన’ అన్న గ్రంథం పై చేసిన వ్యాసంలో పరిశోధన పట్ల అమ్మంగి గారికున్న విధేయతను గుర్తించవచ్చు కొన్ని సంవత్సరాల పాటు సాగే పరిశోధన ప్రక్రియలో పరిశోధకుడు జ్ఞానిగా రూపొందుతారు అని చెప్పడంలో పరిశోధన పట్ల వీరి కున్న అపారమైన భక్తి భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంతటితోనే ఆగకుండా’ ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయాలు’ అన్న అంశం మీద పరిశోధన ప్రారంభించిన నాటికి జ్ఞానిగా ఉన్న సినారే అది పూర్తయ్యే నాటికి విజ్ఞానిగా మారాడు. అనడంలో సినారే పైన వీరికున్న గౌరవం కూడా మనం గమనించవచ్చు. ‘’కవి – కవిత్వం అనే వ్యాసంలో కవిత్వంలో భాష అనే సంకేతాల సముదాయం భావంలోకి వికసించి అనేక రంగులను పరిమళాలను వెదజల్లుతుంది. అమ్మంగి నిశిత పరిశీలనా దృష్టికి అద్దం పట్టే ముఖ్యమైన వ్యాసం ‘కాల స్థలాలకతీతం కాపు బిడ్డ కావ్యం’. మామూలుగానే నవలా రచయితగా గోపీచంద్ అనే అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. పొందిన అమ్మంగి గారిపై విమర్శలో ప్రతీకాత్మకత, మనోవిశ్లేషణ ప్రభావం అధికంగానే ఉంటుంది. అదే విధంగా కాపుబిడ్డ కావ్యాన్ని ప్రతీకాత్మక ధోరణిలో విశ్లేషించడం గమనార్హం. ఇందులో శ్రీ తో ప్రారంభమైన ప్రార్థనా పద్యంలో సాధారణంగా శ్రీ అంటే లక్ష్మి లేదా సరస్వతిగా అభివర్ణిస్తారు. కానీ అమ్మంగి దృష్టి ఎంత సందర్భోచితంగా ఉందో ఈ విశ్లేషణ చూస్తే అర్థమవుతుంది. అది వారి మాటల్లోనే- విష్ణువు శ్రీదేవికి కాదు భూదేవికి కూడా నాథుడు. రైతు కూడా భూదేవికి నాథుడే సర్పరాజు విష్ణు శయ్యగా అమరి ఉన్నాడు. పంట భూమిలో ఎలుకలు వంటివి రైతుకు శత్రువులు వీటిని భక్షించే సర్పాలు రైతుకు పరోక్ష మిత్రులు. అట్లే నీటిలో నివసించే నారాయణుడు రైతు పంటకు నీళ్లిచ్చి కాపాడేవాడు.
లక్ష్మీ విష్ణువులు భార్యాభర్తలుగా పరిచయం కావటంవల్ల రైతుభార్య, రైతు నాయకా నాయికలుగా వున్న కావ్యంగా ఇది సూచించబడుతున్నది. అని చెప్పడంలో శ్రీ అంటే భూదేవి అనీ, సర్పాలను ఎలుకలకు శత్రువులుగా, రైతులకు మిత్రులుగా, చివరికి ఆ లక్ష్మీనారాయణులను రైతు భార్యకు , రైతుకు సారూప్యం చేసి చెప్పడం అనేది అమ్మంగి విశ్లేషణ వైదుష్యానికి నిదర్శనం. అంతేకాకుండా కాపు బిడ్డలోని అంశం దేశీయమైనది కాబట్టి గంగుల సాయిరెడ్డి ఆ కావ్యంలో వాడిన పద్యాలు సీసం, తేటగీతి, ఆటవెలదిలాంటి దేశీయ ఛందస్సులోనే రచించారని అమ్మంగి గారు గుర్తించడం వారిలోని వ్యాకరణ ప్రతిభకు నిదర్శనమని చెప్పవచ్చు. స్వతహాగా కవి అయిన అమ్మంగి గారు ఇందులోనే ఒక చోట తెలుగు బంగారు ఆభరణంతో తళుక్కున మెరిసే రత్నాల వంటి సంస్కృత సమాసాలు పాఠకుల దృష్టిలో పడతాయి అని పదాలకు సౌందర్యాన్ని అద్ది తనలోని కవిని నిద్రలేపారు. సినారె ముక్తకాలు గురించి తెలియజేస్తూ చిన్న కవిత టీ ట్వంటీ మ్యాచ్ లాంటిదని చమత్కరించడంతో వారికి కవిత్వంపై ఉన్న మమకారం ఎంతో తెలియజేస్తుంది. సినారే పేరుకే కొత్త అర్థాన్ని చెప్పిన ఘనత అమ్మంగికే చెల్లింది. సి (Sea) – అంటే సముద్రం; నా – అంటే స్వార్థం అంటే మనిషి; రే ( Ray) – అంటే కిరణం. సముద్రానికి, ఆకాశానికి మధ్యన ఉన్న మనిషి కథే సినారే కవిత్వం అంటారు అమ్మంగి. ఎంత గొప్ప విశ్లేషణ కదూ ! ఇక వీరి ఆర్ విద్యాసాగర్ రావు క్షంతవ్యులు నాటకం ఒక పరిశీలన అన్న వ్యాసం అమ్మంగి విశ్లేషణ ప్రతిభకు పరాకాష్ట. స్వయంగా నాటక రచయిత కావడం వల్ల ఒక నాటకం గురించి ఇంత కూలంకషంగా చర్చించడం జరిగింది. రేడియో నాటకాల గురించి పరిచయంతో ప్రారంభం చేసి, విద్యాసాగర్ రావు రచనలను తెలుపుతూ వ్యాసంలోకి ప్రవేశించారు. క్షంతవ్యులు నాటకంలో తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు, కోడలు, ఒక బంధువు, మరొకరు బయటి వ్యక్తి ఇలా ఏడు పాత్రల మధ్య జరిగే మామూలు మధ్యతరగతి కుటుంబం కథ ఇది. ఆ కథలోని ప్రతి పాత్రను ఎంతో సునిశితంగా పరిశీలించారు అమ్మంగి. ఇందులో తల్లి మహాలక్ష్మమ్మ పాత్రను సినిమాలో సూర్యకాంతం పాత్రతో పోల్చి చెప్పారు. ఇక తండ్రి సుందర కామయ్యను బ్రెయిన్ చైల్ గా అభివర్ణించారు. ఇతను నాటకం ప్రారంభం నుండి ఒక చిన్న పాప బొమ్మను ఇష్టపడుతూ ఉంటాడు. దానిని తమ ఇంట్లో ఒక మనవరాలు పుడితే బాగుండునని అతని కోరికకు ప్రతీకగా చెప్పారు. చివరి రంగంలో బొమ్మ కిందపడి పగిలిపోతుంది. అప్పుడే అతని కోడలు గర్భవతి అన్న విషయం తెలుస్తుంది. అంటే ఇక ఆ బొమ్మతో అవసరం లేదు కాబట్టి పగిలి పోయినట్లుగా చిత్రించబడింది అని తన వ్యాసంలో చెప్తారు.
వీరి కొడుకులైనటువంటి శివం రామం ప్రవర్తనల్ని మనో విశ్లేషణాత్మక దోరణిలో వివరించడం జరిగింది. వీరి మొదటి కొడుకు శివం. ఇంట్లో వారి ప్రవర్తన గురించి తెలిసినా ఏమీ అనలేని మొహమాటస్తుడు. అటు తన భార్య పట్ల తన తమ్ముడికున్న దురుద్దేశం తెలిసినా అతనితో చెప్పలేకపోవడాన్ని ఆత్మన్యూనతగా నిరూపించారు అమ్మంగి. ఇక రెండో వాడు రామం వాడి మిత్రుడు కేశవరావు. వీరిద్దరికీ పరస్త్రీ పట్ల ఉన్న వ్యామోహాన్ని అమ్మంగి ఈ వ్యాసంలో వారి మానసిక వ్యాధిగా గుర్తించారు. శివం తన భార్యతో సహా వేరే కాపురం పెట్టడానికి వెళ్లడం అనేది వారి మానసిక వ్యాధికి శివం ఇచ్చిన కౌన్సిలింగ్ అని అనడం ఎంతైనా అమ్మంగి మనో విశ్లేషణాత్మక దోరణికి గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ విధంగా క్షంతవ్యులు నాటకంలో ఉండే ప్రతి పాత్రను ఒక అంశానికి ప్రతీకగా తీసుకుంటూ మనో విశ్లేషణాత్మక ధోరణిలో విశ్లేషించారు. అంపశయ్య నవీన్ అనగానే మనో విశ్లేషణాత్మక నవలా రచయితగానే అందరికీ తెలుసు. అలాంటి నవీన్ లోని విశ్లేషణాత్మక ధోరణిని తెలుగులో ఆధునిక నవల అన్న అంపశయ్య నవీన్ వ్యాస సంపుటిని ఎన్నుకోవడం అనేది అమ్మంగి మనో విశ్లేషణాత్మక జిజ్ఞాసను తెలియజేస్తుంది. ఇందులో ఒక చోట నవీన్ కు కాళోజీ నారాయణరావుకు మధ్య జరిగిన చర్చ గురించి చెప్తూ ప్రహ్లాద చరిత్ర కథను చెప్పి హిరణ్యకశిపుని రాజ్యహింసకు, నరసింహస్వామిని ప్రతిహింసకు ప్రతీకలుగా చెప్పారు అని చెప్పడంలో అమ్మంగిగారు ప్రతీకాత్మక విశ్లేషణలు ఎంతగా అభిమానిస్తారు అన్నవిషయం అర్థమవుతుంది. అమ్మంగి ఒక చోట అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం గురించి చెప్తూ అలిశెట్టి కవిత్వం చదువుతుంటే నవీన్ కు వరడ్స్ వర్త్ గుర్తుకువస్తే, నాకు కీట్స్ గుర్తుకు వస్తారు అనడంలో వారు ఎంతటి భావుక ప్రియులో కూడా తెలుస్తుంది. వీరి వ్యాస సంపుటిలో ప్రముఖ రచయితలైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వారు స్వామి, కాళోజీ లాంటి వారినే కాకుండా సురమౌళి, సామల సదాశివ, వల్లపురెడ్డి బుచ్చారెడ్డి, కన్నాస్వామి లాంటి మనం గుర్తు పెట్టుకోని అజ్ఞాత రచయితలను గురించి కూడా వీరి వ్యాసాల ద్వారా వారి సాహిత్యపు ఉనికిని తెలియజేశారు. తెలంగాణ మరిచిపోయిన సాహిత్యకారులలో సురమౌళిది ఓ ప్రత్యేక స్థానం. నాస్తిక లౌకిక భావాలతో కథల్ని రచించిన ఈ తెలంగాణ రచయితను చనిపోయేవరకు గుర్తుంచుకోకపోవడం మన దురదృష్టం. వీరు చనిపోయిన తర్వాత వీరి పదహారు కథల్ని సురవౌళి కథలు పేరుతో కవిలే సంస్థ పక్షాన ప్రచురించిన సంగిశెట్టి శ్రీనివాస్ అభినందనీయులు. ఈ విషయం అమ్మంగి గారి సుడిగుండాల నదిని ఎదురీదిన సురమౌళి వ్యాసంలో తెలియజేయబడింది.
కథా రచయితగా నెల్లూరు కేశవస్వామి అనే వ్యాసంలో పసిడి బొమ్మ కథ గురించి చెప్తూ అందులో కథానాయిక రాధ ఒక సెక్స్ వర్కర్. ఆమెను చూసిన చిత్రకారుడు రాజా ఆమెను మోడల్ గా తీసుకుని ఒక చిత్రాన్ని గీస్తాడు. ఆ చిత్రం పూర్తయ్యే వరకూ ఆమెను ఎంతగానో అభిమానిస్తాడు. తన స్నేహితుడు శంకరానికి, ఇతర మిత్రులకి కూడా ఆమెను తన భార్యగా పరిచయం చేస్తాడు. చిత్రం పూర్తి కాగానే సౌందర్యాన్వేషణలో పడి రాధను వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రాధ శంకరం వద్దకు వస్తుంది. ఆ సమయంలో రాధ రాజా గురించి చెప్తూ, రాజా నన్ను బొమ్మలా వాడుకున్నాడు. ఆఖరికి నన్ను పెంటకుప్పలో పారేసి వెళ్లిపోయాడు అని చెప్పడం జరుగుతుంది. ఈ కథలో ఈ వాక్యం చాలా అర్థవంతమైనది. మరో చోట గరిక పోస గోస వ్యాసంలో రాజ్ కుమార్ రాసిన మన పొలమైతే మాత్రం/ బీడు పెరగకుండా ఉంటుందా/ కలుపు తీయకుండా ఉంటామా/ ఇప్పుడే కదా మునుం బట్టింది అన్న కవితా వాక్యంలో పొలాన్ని రాష్ట్రానికి, చీడ పట్టడమంటే రాష్ట్రంలో పెరిగిన చెడుకి, కలుపు తీయడమంటే చెడును ప్రక్షాళన చేయాలనే ప్రతీకల్ని చక్కగా అభివర్ణించారు. అర తెర తీసిన రంగస్థలం వ్యాసంలో పలకను తల్చుకుంటే /నల్లని చీకట్లను తరిమేందుకు / ఒక తెల్లని దీపంలా/ ఎదురొచ్చిన అక్షరంలా గుర్తొస్తుంది అని ఏనుగు నరసింహారెడ్డి కొత్త పలక కవిత గురించి చెప్తూ ,పలక అంటే కాన్వాసు. జానెడు పలక మీద అ అంటే అల అని క అంటే కల అని రాయటం ఉపాధ్యాయుడు నేర్పుతాడు. కవి అలల సముద్రాన్ని కలల ఆకాశాన్ని సృష్టించుకుంటాడు. ఈ అక్షర దృష్టి అంతా చీకటి నుండి వెలుతురులోకి చేసే ప్రస్థానం మాత్రమే ఇక్కడ అమ్మంగి కవిత్వాన్ని కాన్వాసుకు ప్రతీకగా చెప్తారు. వ్యాసాలకు తగ్గట్టుగా పేరు కూడా సరిగ్గా సరిపోయిందని చెప్పవచ్చు. కాబట్టి అమ్మంగి వేణుగోపాల్ సహృదయ సాహిత్య విమర్శ – వైవిధ్యం అనే ఈ వ్యాస సంపుటి ఒక పరిపూర్ణ విమర్శనా గ్రంథం అని అనడం అతిశయోక్తి కాదు.