Home ఎడిటోరియల్ ట్రంప్ దౌత్యం బెడిసికొట్టిందా?

ట్రంప్ దౌత్యం బెడిసికొట్టిందా?

edt

అనుకున్నంత అయ్యింది. ట్రంప్ తనకు నోబుల్ ప్రైజ్ తెచ్చి పెడుతుందని ఆశించిన ఉత్తరకొరియా మెట్టు దిగిరాలేదు. ట్రంపే స్వయంగా చర్చలు రద్దని ప్రకటించవలసి వచ్చింది. ఈ మొత్తం సినిమాని పరిశీలిస్తే ట్రంప్ మొదటి సగంలో హీరోగాను, రెండవ సగంలో కమెడియన్‌గాను మిగిలిపోయాడు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ కమెడియన్‌నుంచి హీరో స్థాయికి ఎదిగిపోయాడు. అసలు సినిమా డైరెక్టర్‌గా చైనా తెర వెనుక నవ్వుకుంది. జూన్ 12వ తేదీన ఈ చర్చలు సింగపూరులో జరగవలసింది. చర్చలను రద్దుచేస్తూ ట్రంప్ రాసిన లేఖలో నిరాశ ఆగ్రహం కనిపిస్తున్నాయి. ఈ చర్చలను ఉత్తరకొరియా రద్దు చేయకముందే తాను రద్దు చేయాలన్న తొందరకూడా ఆయనలో కనిపించింది. అలా తామే చర్చలు రద్దు చేసినట్లు చెప్పుకుని ప్రతిష్ఠ కాపాడుకునే ఈ ప్రయత్నం కూడా అమెరికాను నవ్వులపాలు చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ ఒక వ్యాపారవేత్త మాదిరిగా బిజినెస్ డీల్ ప్రయత్నాలు చేసినట్లుందే కాని ఒక సమర్థుడైన నేత మాదిరిగా వ్యవహరించినట్లు కనబడదు. ఉత్తరకొరియా కోరితేనే ఈ చర్చలని చెప్పుకోవడం, ఉత్తరకొరియా వైఖరి పట్ల ఆగ్రహావేశాల వల్లనే చర్చలు రద్దు చేస్తున్నామని చెప్పడం సాకులు తప్ప మరేమీ కాదని ప్రపంచదేశాలకు తెలుసు. ఉత్తరకొరియా ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. ఎక్కడా మాట తూలలేదు. అమెరికా వంటి అగ్రరాజ్యం దౌత్యనీతిలో ఇలా తడబడి కూలబడడడం విచిత్రం.
తాను చెప్పిందే ఎదుటివారు వినాలని శాసించడం చర్చలు కాదన్న విషయం అమెరికాకు తెలిసి రాలేదు. గొంతెమ్మ కోర్కెల వంటి డిమాండ్లకు ఉత్తరకొరియా తలూపుతుందని నమ్మడమే పెద్ద వైఫల్యం. ఉత్తరకొరియా ఒకవైపు హుందాగా వ్యవహరిస్తూ, మరోవైపు అమెరికా తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదన్న సంకేతాలు పంపడం దౌత్యనీతిలో పరిణతికి నిదర్శనం. చర్చలు వద్దు పొమ్మని ఉత్తరకొరియా నిరాకరిస్తుందన్న భయం అమెరికా అధ్యక్షుడిలో కలుగజేసింది ఉత్తరకొరియా. అందుకే తామే ముందుగా చర్చలు రద్దు చేయాలన్న తొందరను అమెరికా ప్రదర్శించింది. చర్చల రద్దు తర్వాత ఉత్తరకొరియాపై అసాధారణ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు ప్రారంభించారు. అత్యంత కఠినమైన ఆర్ధిక ఆంక్షలతో ఉత్తరకొరియా మెడలు వంచుతామని, మిలిటరీ చర్యలు తీసుకుంటామని ప్రకటనలు వచ్చాయి. ఈ బెదిరింపులకు జడిసి ఉత్తరకొరియా అధ్యక్షుడు మళ్ళీ చర్చల కోసం వస్తాడేమో అన్న ఆశ కూడా లోపల్లోపల ఉంది. ఇప్పుడు నిజానికి ఉత్తరకొరియాది పైచేయిగా ఉంది. చర్చలు వద్దని చెప్పింది ఉత్తరకొరియా కాదు. కాబట్టి అమెరికా చర్చలు కావాలంటే తమకు అభ్యంతరమేమీ లేదని చెప్పేస్థితిలో ఉంది. చర్చలు కావాలో వద్దో తేల్చుకునే బాధ్యత ఇప్పుడు అమెరికా నెత్తిన పడింది.
అనుకోని ఎదురుదెబ్బ ఇది. ఇలా బుర్ర బొప్పి కడుతుందని ట్రంప్ ఊహించి కూడా ఉండడు. అసలు ఉత్తరకొరియాతో చర్చలకు ముందు ఇరాన్ అణుఒప్పందం నుంచి తప్పుకోవడమే దౌత్యపరంగా పెద్ద తప్పు. అమెరికా మాటలను, ఒప్పందాలను నమ్మలేమన్న అభిప్రాయాన్ని కలుగజేశాడు. అప్పుడే ఉత్తరకొరియా ఎలా వ్యవహరిస్తుందో చాలా మందికి అర్థమైపోయింది. ఇప్పుడు ఉత్తరకొరియాను లొంగదీయడానికి కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధిస్తామని చెప్పడం కూడా కేవలం కిందపడ్డాం కాని ముక్కుకు మన్ను అంటలేదని చెప్పుకునే తిప్పలే. ఉత్తరకొరియా వాణిజ్యమంతా చైనాతోనే జరుగుతోంది. చైనా కూడా ఒప్పుకుంటేనే అమెరికా ఏమైనా చేయగలుగుతుంది. ఉత్తరకొరియాపై ఆంక్షలు అమలు చేయాలని చైనాను అమెరికా కోరినా, అది ఒప్పుకుంటుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే, ఉత్తరకొరియా, అమెరికాల మధ్య ఈ చర్చల వ్యవహారం ప్రారంభమైన తర్వాత తాము అందుకు తగిన విశ్వాస వాతావరణం ఏర్పరచడానికి అనేక చర్యలు చేపట్టామని ఉత్తరకొరియా వాదిస్తుంది. అణుపరీక్షలు నిర్వహించే ప్రదేశాన్ని కూడా ధ్వంసం చేశామని చెప్పింది. ముగ్గురు అమెరికా బందీలను విడుదల చేసి సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేశామని చెబుతుంది. ట్రంప్ వద్ద చెప్పడానికి ఏదీ లేదు. ఏకపక్షంగా చర్చలను రద్దు చేసుకున్నానని చెప్పుకోవడం తప్ప.
ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచడానికి అమెరికా చేసే ప్రయత్నాలకు చైనా మద్దతు లభించే అవకాశం లేదు. అణ్వాయుధ పరీక్షలను ఉత్తరకొరియా ఆపేయడం, అణ్వాయుధాలను త్యజించడానికి సిద్ధపడడం ఈ రెండు కారణాలు చాలు చైనా ఉత్తరకొరియాతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి. చైనా మద్దతు ఉన్నప్పుడు ఉత్తరకొరియాపై సైనిక చర్య వంటి సాహసం అమెరికా కలలో కూడా చేయదు. ఉత్తరకొరియా క్షిపణి సామర్థ్యం కూడా అమెరికా నగరాలను చేరుకుంది. మరోవైపు ఈ చర్చలవల్ల శాంతి సాధ్యమవుతుందని ఆశించిన ఉత్తరకొరియాకు నిరాశే మిగిలింది. దక్షిణ కొరియా సంప్రదాయికం గా అమెరికా మిత్రదేశం. కాని అమెరికా తన ప్రయోజనాల కోసమే స్నేహం చేసే దేశం. కాబట్టి కొరియా ద్వీపకల్పంలో శాంతి సాధన కోసం దక్షిణ కొరియా ఎంతో శ్రమించి ఏర్పాటు చేసిన శాంతి వాతావరణాన్ని ట్రంప్ అహంకారంతో చెడగొట్టడం దక్షిణ కొరియాకు కూడా నచ్చలేదు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ తన నిరాశను ఆగ్రహాన్ని దాచుకోలేదు. దక్షిణ కొరియా ప్రజలు ట్రంప్‌ను తిట్టిపోస్తున్నారు. కిమ్‌ను హీరోగా చూస్తున్నారు. దక్షిణ కొరియాలో కూడా కిమ్ ను హీరో చేసిన ఘనత ట్రంప్ దే. ఉత్తరకొరియా నియంతగా పేరుపడిన కిమ్ సంయుక్త కొరియా సదస్సు నిర్వహించి కొరియా ప్రజల్లో పేరు సంపాదించుకోవడమే కాదు, దౌత్యపరంగా గొప్ప పరిణతి ప్రదర్శించిన యువనేతగా పేరు సంపాదించాడు.
ట్రంప్ చెప్పినట్లు ఉత్తరకొరియా తన ఆయుధ సంపత్తినంతా ధ్వంసం చేసి, ధ్వంసం చేసిన విషయాన్ని రుజువు చేసి, అవసరమైన వెరిఫికేషన్ చేసుకునే అవకాశంకూడా అమెరికాకు కల్పించడం అనేది పగటి కల అది జరగదన్న విషయం దౌత్యనీతిలో ఒనమాలు చదవని వారికి కూడా అర్ధమవుతుంది. కిమ్ చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పరచడానికి అవసరమైన చర్యలు కొన్ని తీసుకుని నైతికంగా తనదే పైచేయి అయ్యేలా చేసుకున్నాడు. ఆయుధబలం లేకపోతే అమెరికా నలిపేస్తుందన్న వాస్తవం కిమ్‌కు తెలుసు. ఈ వాస్తవం తెలిసిన వాడు ట్రంప్ కోరినట్లు ఆయుధాలన్నీ నాశనం చేసుకుంటాడా? ఎన్నటికీ ఆ పని చేయడు. కాని ట్రంప్ అహంకారంతో తన ఆదేశాలన్నీ కిమ్ పాటిస్తాడన్నట్లు మాట్లాడాడు. నైతికంగా తనదే పైచేయిగా నిరూపించుకున్న తర్వాత కిమ్ అదే నైతికతను అణ్వాయుధాలు కొనసాగించే అర్హత కోసం కూడా ఉపయోగిస్తాడు. అమెరికా చాలా దారుణంగా ఈ విషయంలో విఫలమైంది. ఉత్తరకొరియా ఇప్పుడు అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొందడానికి ఈ పరిస్థితులను వాడుకుంటుంది. ఉత్తరకొరియా అణ్వస్త్ర దేశంగా 2012 రాజ్యాంగంలోనే ప్రకటించుకున్నది. క్షిపణి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యే వరకు చర్చల మాట ఎత్తలేదు. ఆయుధబలం సముపార్జించుకున్న తర్వాతనే చర్చలపట్ల సుముఖత చూపించాడు. నో ఫస్ట్ యూజ్ పాలసీ, నో ట్రాన్స్ ఫర్ పాలసీవంటి ప్రకటనలతో అణ్వస్త్ర దేశంగా గుర్తింపు పొందే వాతావరణం ఏర్పాటు చేస్తున్నారు. 2003లో లిబియాలో ముహమ్మద్ గడాఫీని ఇలాగే ఒప్పించి అమెరికా అతని ఆయుధాల న్నీ స్వాధీనం చేసుకుని ఆ తర్వాత సైనికచర్యతో చంపేసింది. ఈ లిబి యా మోడల్‌గురించి కూడా అమెరికానేతలు మాట్లాడడం వారి అహంకారానికి, వాస్తవాలనుచూడలేని అంధత్వానికి నిదర్శనం. తన ప్రాముఖ్యాన్ని జరగని ట్రంప్ కిమ్ వ్యవహారంలో చైనా నిరూపించుకుంది. వైఫల్యాలతో కూలబడిన పరిస్థితిలో అమెరికా మిగిలింది.

* యుగంధర్