Home ఎడిటోరియల్ ఆప్ విస్తరణ!

ఆప్ విస్తరణ!

Article about Delhi AAP politics దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ, రాజధాని ఢిల్లీలో 23 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉండగా, అన్నాహజారే అవినీతి ఉద్యమం నుంచి ఉద్భవించిన, అప్పటి వరకు రాజకీయాలతో బొత్తిగా పరిచయం లేని అరవింద్ కేజ్రీవాల్ నెలకొల్పిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అసాధారణ మెజారిటీతో అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోడం చరిత్రలో నిలిచిపోయిన ఒక విశిష్ట ఘట్టం. 2020 లో జరిగిన ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బిజెపి కేవలం 8 సీట్లను సాధించుకోగా, ఆప్ 62 స్థానాలు గెలుచుకొని ఔరా అనిపించింది. అంతటి ఘన విజయం కల్పించిన ఆత్మ విశ్వాసంతో ఆప్ ఇప్పుడు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసి తన బలాన్ని పరీక్షించుకోవాలని సంకల్పించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఎన్నికలు జరుగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో, 2022 డిసెంబర్‌లో ఎన్నికలకు వెళ్లనున్న గుజరాత్‌లో కూడా పోటీ చేయాలని ఆప్ నిర్ణయించుకున్నది. ఢిల్లీ నగర వాసులను బాగా ఆకట్టుకొని తనకు విజయ దుందుభులు ప్రసాదించిన, నాణ్యమైన పౌర సదుపాయాలను చవకగా సమకూర్చే విధానాలనే ఈ రాష్ట్రాలలో ప్రయోగించి ప్రజలను తన వైపు తిప్పుకోవచ్చని ఆప్ ఆశిస్తున్నది.

2020 ఫిబ్రవరి 14న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కేజ్రీవాల్, ఆయన మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో అక్కడి ఒక మహిళ వెలిబుచ్చిన అభిప్రాయం గమనించదగినది. తన పిల్లల చదువులను దెబ్బ తీస్తున్న మంచినీటి సమస్యను, భారీ కరెంటు బిల్లుల బాధను కేజ్రీవాల్ ప్రభుత్వం తొలగిస్తుందని ఆశిస్తున్నానని ఆమె అన్నారు. ప్రజల దైనందిన అవసరాలను తీర్చడం ఆప్‌ను ఢిల్లీ ప్రజల దృష్టిలో ఆకాశమంత ఎత్తున నిలబెట్టింది. కేజ్రీవాల్ ఆ విధంగా దేశ రాజకీయాల్లోనే కొత్త వరవడిని సృష్టించారు. అయితే కేవలం నగర ప్రజలను మాత్రమే ఆకట్టుకునే విధానాలను హామీ ఇవడం ద్వారా ఆప్ ఇతర రాష్ట్రాల్లో విజయాలు సాధించగలదా? ఢిల్లీ నగర సమస్యలకు, రాష్ట్రాల్లోని ప్రజల అవసరాలకు తేడా ఉంటుంది కదా! ఆరోగ్యం, విద్య, ఎలెక్ట్రిసిటీ, ప్రజా రవాణా రంగాల్లో ఢిల్లీ నగరంలో ఆప్ విప్లవాలనే సృష్టించింది. అక్కడి ప్రజలకు ఎంతో ఊరటను కలిగించింది. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ సంవత్సరారంభంలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 27 స్థానాలు సాధించుకొని ఆప్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ గల మొత్తం 180 స్థానాల్లోనూ పోటీ చేయాలని సంకల్పించింది. ఢిల్లీ నగర వాసులకు ఆప్ ప్రభుత్వం 200 యూనిట్ల మేరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నది. ఇటీవల పంజాబ్, ఉత్తరాఖండ్ పర్యటనల్లో కేజ్రీవాల్ తాము అధికారంలోకి వస్తే అక్కడి ప్రజలకు 300 యూనిట్ల మేరకు ఉచిత కరెంటును ఇస్తామని చెప్పారు. మొన్న ఆదివారం నాడు ఉత్తరాఖండ్ వెళ్లిన ఆయన మరిన్ని వాగ్దానాలు కూడా చేశారు. యువతకు ఉద్యోగాలు వచ్చేంత వరకు రూ. 5000 నిరుద్యోగ భృతిని హామీ ఇచ్చారు. అధికారానికి వచ్చిన అర్ధ సంవత్సర కాలంలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగాల్లో స్థానిక యువతకు 80 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ప్రత్యేకంగా ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీలో మంచి ఫలితాలిచ్చిన అంశాల మీదనే ఆధారపడి ఇతర రాష్ట్రాల్లో ఆప్ నెగ్గుకు రాగలుగుతుందా అనే ప్రశ్నను కూడా ఈ సందర్భంగా వేసుకోవలసి ఉంది. అందులోనూ 400 పైచిలుకు శాసన సభాస్థానాలున్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో ఆప్ ఏ విధంగా నిరూపించుకోగలుగుతుంది అనేది ఆసక్తికరమైన ప్రశ్న.

అక్కడ సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. కేవలం మంచి ఆశయాలుం డడమే కాకుండా వాటిని ప్రజల వద్దకు తీసుకు పోగల గట్టి కార్యకర్తల బలగం అవసరం ఎంతైనా ఉంది. కేవలం ఆరు మాసాల వ్యవధిలో అంతటి స్థానిక యంత్రాంగాన్ని సమకూర్చుకోడం ఆప్‌కు సాధ్యమేనా? ఈ సమస్యను దృష్టిలో ఉంచుకునే ఆప్ ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఉద్యమంతో మమేకమై పని చేస్తున్నది. పంజాబ్, యుపి, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఓటు మొగ్గును రైతు ఉద్యమం బాగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజెపికి ఓటు వేయరాదని ఆ ఉద్యమ నేతలు ఇప్పటికే బాహాటంగా పిలుపు ఇచ్చి ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘గుజరాత్ నమూనా’ కొవిడ్ దెబ్బకు నామరూపాల్లేకుండా పోయింది. కొవిడ్ రెండవ అల సమయంలో మృత్యుముఖంలోని రోగులకు ఆక్సిజన్ కూడా సరఫరా చేయలేక, టీకాలు సకాలంలో అందరికీ వేయించలేక ప్రధాని మోడీ ప్రభుత్వం తీవ్ర అప్రతిష్ఠకు గురైంది. ఆయన గ్రాఫ్ కూడా విశేషంగా పడిపోయింది.అందుచేత కేజ్రీవాల్ ‘ఢిల్లీ నమూనా’ ఈ రాష్ట్రాల ప్రజలను విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Article about Delhi AAP politics