ఒక నవలకు వస్తువు ముఖ్యమా, శిల్పం ముఖ్యమా అన్న చర్చ వస్తే, వస్తువు ఆత్మ అయితే, శిల్పం శరీరం. కనిపించని ఆత్మకు ఓ రూపమిచ్చి జీవాన్ని పోసేదే శిల్పం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి జీవంతో లేకపోయినా మరో దాని అస్తిత్వం దానంతటదే కాలగర్భంలో కలిసిపోతుంది. వస్తువు, శిల్పం జోడెద్దుల సవారీగా సాగితేనే అది సంఘంపై తనదైన ముద్ర వేసి, ఓ సజీవ పాత్రగా సమాజంలో నిలదొక్కుకుంటుంది. కాలంతో పాటు తన అస్తిత్వాన్ని సాగిస్తుంది. అలాంటి జోడెద్దుల సవారీయే ఏడు తరాల కుటుంబ చరిత్రను, ఆ కాలపు సమకాలీన సామాజిక వర్గ పరిస్థితులను, వలస బతుకుల వెతలను, వర్గాల మధ్య నెలకొన్న వివక్షను, ఆ వివక్షపై గర్జించిన ధిక్కార స్వరాన్ని మోసుకుని వస్తే అదే ప్రముఖ రచయిత ఎజ్రా శాస్త్రి అనుభవపు జీవిత పార్శ్వాలను నింపుకున్న ‘మా ఎర్ర ఓబన్నపల్లె’ నవల. ఒక నవలలో పాత్రలను సృష్టించడం కన్నా, సజీవ పాత్రలకు అంతే సహజంగా ప్రాణం పోయడం క్లిష్టమైన ప్రక్రియ. వస్తువుపై ఎంతో పరిశోధన, అవగాహన, అంకితభావం ఉంటే తప్ప ఆయా పాత్రలకు న్యాయం చేయడం కుదరదు. అలాంటి ఒకప్పటి రంగస్థలంపై కొలువుదీరిన పాత్రలకి, సహజ సిద్ధంగా ప్రాణం పోసి వస్తువుకు రచయిత జీవం పోశారు.
నవలలో రచయిత సంకల్పం కేవలం ఒక నవలను సృష్టించడంగా కనిపించదు. గడిచిన కాలమాన పరిస్థితులను వర్తమాన పరిస్థితులకు ముడి వేసి పాఠకుడిలో ఆలోచనా విధానాన్ని సృష్టించాలనే తపన కనబడుతుంది. ప్రస్తుత తరానికి తమ వర్గం గురించిన వాస్తవిక పరిస్థితులను తెలియజేయాలన్న స్పృహ కనబడుతుంది. ఆధునిక సమాజంలోనూ వేళ్లూనుకుపోయిన వివక్షను ఎత్తి చూపి, ఓ పరిష్కార మార్గాన్ని చూపాలనే భవిష్యత్ దృక్కోణం కనబడుతుంది. ఆ విధంగానే నవల నిర్మాణం సాగింది. ఈ వస్తువును నవలగా రచించడానికి రచయితకున్న అదనపు బలం ఏమిటో నవల చివరన పాఠకుడికి అర్థం అవుతుంది. ఈ నవలలో అడుగడుగునా కనిపించే వలస బతుకులు, ఆకలి కన్నీటి జాడలు, వివక్ష, పోరాటాలు ఇవన్నీ రచయిత బాల్య జీవితంలో ఓ అంతర్భాగం. పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టలేక హాస్టల్‌కి పంపితే, అమ్మ పొట్ట నింపడం కోసం, తమకు పెట్టిన ఆహారంలో కొంత దాచుకున్న రచయిత బాల్యం, ఎలా సాగిందో అర్థం అవుతుంది. ఆ అంతర్మథనం, భావోద్వేగం, కంట తడి, కసి నుండి ప్రాణం పోసుకున్న నవల ‘మా ఎర్ర ఓబన్న పల్లె’.
నిజానికి ఈ నవలకి ఆత్మ ఏడు తరాల కుటుంబ చరిత్ర కాదు. ఇది ఒక కుటుంబ ప్రాముఖ్యతను చాటి చెప్పాలని రూపుదిద్దుకున్న నవల కాదు. ఇక్కడ ఆ కుటుంబం అనాదిగా వివక్ష తాలూకూ అమానవీయ ఆధిపత్యానికి గురవుతూ, తమ చుట్టూ ఉన్న సమకాలీన సామాజిక వ్యవస్థలోని లోపాలకు, అణచివేతకు సాక్ష్యంగా నిలుస్తూ, ఎదిరిస్తూ, ఒక మాదిగ వర్గంలోని నాయకత్వ లక్షణాలకు, పోరాట పటిమకు, నీతికి, నిజాయితీకి ప్రతీకగా నిలచి కథానాయక పాత్ర పోషించింది. మాదిగలు, నిమ్న వర్గాల వారు శ్రమ జీవనానికి తప్ప, చదువుకు, నాయకత్వానికి పనికిరారని సమాజంలో పేరుకుపోయిన ఒక వివక్షాపూరిత ఆధిపత్య ధోరణిని ఎండగడుతూ, మాదిగల సత్తువను ప్రతిబింబించేలా సాగిన నవల ‘మా ఎర్ర ఓబన్నపల్లె’. ఈ నవలలోని మాదిగ వర్గస్థులు నిమ్న వర్గాలకు ప్రతీకలు. ఈ నవలలోని ప్రధాన పాత్రధారులైన ఎర్ర ఓబయ్య, ఎర్ర చెన్నయ్య, బాల నర్సయ్య, రాజు పాత్రలు నాయకత్వ లక్షణాలతో సాగి మాదిగల చైతన్యానికి, విలువలకు, పోరాట పటిమకు, నాయకత్వ లక్షణాలకు, నీతి నిజాయితీకి చిరునామాగా నిలచి, అయా బలహీన వర్గాలపై ఉండే చిన్న చూపును చూసే ఆలోచనా ధోరణిలో కొత్త ప్రశ్నలు రేకెత్తించే విధంగా పాత్రల శిల్పం సాగింది.
ఈ నవలలోని ప్రతి పాత్ర చిత్రణ విషయంలో, పాత్రల మధ్య సంభాషణలలో, ఆ కాలపు సామాజిక సంఘ పరిస్థితులను, వివక్షను శిల్పీకరించడంలో రచయిత నేర్పు ప్రదర్శించి విజయం సాధించారు. ఒక పాఠకుడికి ఈ నవల చదువుతున్నంత పూ ఆయా పాత్రల మధ్య తనో పాత్రగా, తనకు తాను ఓ నిశబ్ద పాత్రగా ప్రతిష్టించుకునే స్థాయిలో ఈ నవల నిర్మాణం జరిగింది. ఈ నవలలోని పాత్రలన్నీ అయా కాలమానాల్లో సజీవ పాత్రలైనా, ఒక పాఠకుడికి ఆయా పాత్రల్లో, సన్నివేశాల్లో ఉన్న వివక్షను, తన జీవితం చవిచూసిన అనుభవాలతో పోల్చుకుని, వాస్తవిక కోణంలో ఆలోచించే ధోరణిలో వస్తు నిర్మాణం సాగింది. ఒక రచన విజయం సాధించేది ఇక్కడే. అందులో రచయిత ఎజ్రా శాస్త్రి, నవల మా ఎర్ర ఓబన్న పల్లె సఫలమయ్యాయి. సజీవంగా కాలంతో పాటు ఈ పాత్రలు నిలిచిపోతాయి. ఈ నవల ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంత యాసతో సాగినా, ఇతర ప్రాంత పాఠకులకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించని రీతిలో రూపుదిద్దుకుంది. ఒక కొత్త యాసతో నవలను చదివిన అనుభూతినీ పాఠకులు పొందుతారు.
ఏడు తరాలలో రెండవ తరానికి చెందిన ఎర్ర ఓబయ్యతో నవలలోని పాత్ర మొదలవుతుంది. ఈ నవల మొదటి వాక్యం ‘వానపడక మూడేళ్లాయె’ వలస బతుకులను కళ్ళకు కట్టింది. కాలం కలిసిరాక పల్లెకు పల్లె అంతా వలస వెళ్లాల్సినప్పుడు, పార్వతమ్మతో ‘ఇంకో చోట రెండు గుడిసెలేసుకుంటే అదే ఊరవుద్ది’ అని అన్న ఎర్ర ఓబయ్య మాటల్లో ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతుంది. అన్న మాటకు తగ్గట్టే తన పేరుతోనే ఓ గ్రామం ఏర్పడడం, అంటే ఒక మాదిగ వ్యక్తి పేరుతో గ్రామం చరిత్రలో నిలబడడం, ఒక సగటు మాదిగ సాధించిన విజయం. నవలలో ఆ కాలం నాటి వివాహ వ్యవస్థలోని పలు ఘట్టాలను సైతం పాత్రల సంభాషణలతో అందంగా చిత్రించారు. సమాజంలో సంప్రదాయాలు ఓ భాగం. అలాంటి ముఖ్య ఘట్టాలను రచయిత అక్షరబద్ధం చేసి ఓ పూర్తి స్థాయి జీవన విధానం ఉన్న నవలగా తీర్చిదిద్దారు.
ఓబయ్య వారసుడైన ఎర్ర చెన్నయ్య ఆనతి కాలంలోనే పెద్ద మాదిగగా మారి తండ్రికి తగ్గ వారసుడై, గ్రామంలో అగ్రవర్ణాలతో సమానమైన జన స్థాయిని పొందుతాడు. గ్రామాలపై పడి దోచుకుతినే రేగలగడ్డ దొంగల బారి నుండి ఓ మహిళను కాపాడడమే కాక, చాకచక్యంగా ఆ దొంగలను హతమార్చి, వారి నుండి బాధిత పది గ్రామాలకు పరిష్కారం చూపించిన ఘట్టం ఎర్ర చెన్నయ్యను కథానాయకుడి స్థాయికి చేరుస్తుంది. ఎర్ర చెన్నయ్య కాలంలోనే జవసత్వాలు తొడుగుకున్న పాత్ర కురేషుది. విద్యను అభ్యసించిన కురేషు, తక్కువ కాలంలోనే బ్రాహ్మణుల స్థాయిని తన విద్య ద్వారా అధిగమించి, తనపై చూపిన వివక్షపై ధిక్కార స్వరాన్ని ప్రకటిస్తాడు. పై స్థాయి వారి కుట్రలను నిరసిస్తూ, మాదిగోడికి తరతరాలుగా అన్యాయం జరుగుతున్నది. మీరంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చి సజీవ సమాధిలోకి కురేషు వెళ్లడం హృదయాలను తొలిచివేస్తుంది.
తన ప్రజలందరినీ ఏకతాటిపై తెచ్చి, ఆధిపత్య భావజాలాన్ని సమూలంగా రూపుమాపాలన్న అతని ఆశయం ఇంకా ఆశయంగానే ఉండడం మదిలో కలతను రేపుతుంది.ప్రతి పాఠకుడికి ఈ పాత్ర సజీవంగా ఉంటే బాగుండు అని అనిపించే విధంగా పాత్ర నిర్మాణం ఉంది. కానీ ఇది కథ కాదు, వాస్తవ దృశ్యం, జీవితం. కురేషు ఓ చరిత్ర. తరువాత ప్రధాన పాత్ర ఎర్ర చెన్నయ్య కొడుకు బాల నరసయ్య. మాదిగలను తక్కువ స్థాయిలో చూసే ప్రతీ ఒక్కరికీ ఈ పాత్ర ఓ సమాధానం. అడుగడుగునా ఈ పాత్రలో నీతినిజాయితీ తెగింపు కనిపిస్తాయి. ఇతని పాత్ర అడుగడుగునా పై స్థాయి వర్గంతో తలబడుతూ, వివక్షను ప్రశ్నిస్తూ సాగుతుంది. బాలనర్సయ్య కొడుకు రాజు పాత్ర నిజాయితీతో, ఆత్మ విశ్వాసంతో సాగుతుంది. అనేక సందర్భాల్లో తండ్రి బాల నర్సయ్య కుడి భుజంగా రాజు ఉండడం నవలలో గమనిస్తాం.
ఇలా నవలలోని ప్రతి సజీవ పాత్రకీ తన రచనా నైపుణ్యం, అనుభవంతో ప్రాణాన్ని నింపారు రచయిత. నవల చివరలో ‘వాడు చెప్తాడు మిగిలిన కథ’ అన్న వాక్యం వర్గ వివక్ష, వలసల బ్రతుకులు ఆనాటి నుండి ఈనాటికీ తమ వర్గం అనుభవిస్తూనే ఉన్నదని, ఇది మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూ, ఆ ప్రశ్నను సమాజానికి వదిలింది. ఇటువంటి జీవమున్న పాత్రలను, తన అక్షరాలతో సజీవంగా నిలిపిన రచయిత ఎజ్రా శాస్త్రికి అభినందనలు చెప్తూ, జవసత్వాలు తొడుగుకున్న ఎర్ర ఓబన్నపల్లెకు స్వాగతం.