Home ఎడిటోరియల్ ప్రభుత్వ విద్యే మిన్న

ప్రభుత్వ విద్యే మిన్న

sampadakeyam

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థుల ఉత్తీర్ణత ఏటికేడు మెరుగుపడటమేగాక, మెరుగైన విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రచారం చేసుకునే ప్రైవేటు విద్యా సంస్థల కన్నా ప్రభుత్వం నడిపే జూనియర్ కాలేజీలు మెరుగైన ఫలితాలు సాధించటం మారుతున్న ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. ప్రభుత్వ విద్యపట్ల ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధకు, ఉపాధ్యాయుల నిబద్ధతాపూర్వక కృషికి ఇవి నిదర్శనాలు. మొన్న ప్రకటించిన ఇంటర్మీడియెట్ కోర్స్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో బాలురకన్నా బాలికలు మెరుగైన ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 3,98,657 మంది హాజరు కాగా 2,65,721 మంది అనగా 67.06 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 72.70 కాగా బాలుర ఉత్తీర్ణత 60.99 శాతం. మొదటి సంవత్సరం కూడా బాలికల్లో 68.85 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 56.36 శాతంతో ఎంతో వెనుకబడ్డారు. గత మూడు సంవత్సరాల ఫలితాలతో పోల్చి చూస్తే ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరం కోర్స్‌లో దాదాపు 5 శాతం, రెండవ సంవత్సరంలో 0.6 శాతం మెరుగైనట్లు విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విశ్లేషించారు.
ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గత సంవత్సరంతో పోల్చితే 3 శాతం పెరగటం మెచ్చగదింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలతోపాటు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, సార్వత్రిక ఆశ్రమ (రెసిడెన్షియల్ ) కాలేజీలన్నీ కలిసి ప్రైవేటు కాలేజీలకన్నా మెరుగైన ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం మీద రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 67.06 కాగా, గిరిజన సంక్షేమ కాలేజీలు 87 శాతం, సాంఘిక సంక్షేమ కాలేజీలు 86 శాతం, ఆశ్రమ జూనియర్ కాలేజీలు 81 శాతం, ప్రభుత్వ కాలేజీలు 70 శాతం, మోడల్ స్కూళ్లు 68 శాతం, ఎయిడెడ్ కాలేజీలు 55 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. కాగా ప్రైవేటు కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం 69. అయితే రెండు అంశాలు ప్రత్యేకించి గమనించదగినవి. ఉత్తీర్ణత శాతాల్లో జిల్లాల మధ్య వ్యత్యాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. రెండవ సంవత్సరం పరీక్ష ల్లో మేడ్చెల్, కుమరంభీం (ఆసిఫాబాద్) జిల్లాల్లో అత్యధికంగా 80 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, కేవలం 40 శాతం ఉత్తీర్ణతతో మహబూబాబాద్ అట్టడుగున ఉంది. ప్రథమ సంవత్స రం ఉత్తీర్ణతలో 79 శాతంతో మేడ్చెల్ అగ్రస్థానంలో ఉండగా, మెదక్ 42 శాతంతో అట్టడుగున ఉంది. ఈ అసమతౌల్యాన్ని అధిగమించటానికి ప్రత్యేక కృషి జరగకపోతే దీర్ఘకాలంలో సమస్యలోస్తాయని గమనించాలి. రెండు, సంక్షేమ, ఆశ్రమ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం ఘనం గా ఉన్నప్పటికీ, పరిపూర్ణ సంఖ్యల్లో చూచినపుడు ఉత్తీర్ణత సంఖ్యలు పరిమితం.
ద్వితీయ సంవత్సరం ఫలితాలను విశ్లేషిస్తే, బిసి సంక్షేమ ఆశ్రమ కాలేజీల నుంచి హాజరైన విద్యార్థులు 1123 కాగా ఉత్తీర్ణులు 953(శాతం 85). అలాగే జూనియర్ ఇంటర్మీడియెట్ పరీక్షకు హాజరు 1685, ఉత్తీర్ణత 1457 (86.47 శాతం). సాంఘిక సంక్షేమ ఆశ్రమ విద్యా సంస్థలు, సొసైటీ సంస్థల నుంచి హాజరు 8748, ఉత్తీర్ణత 7564 (86.4) శాతం. కాబట్టి ఈ ప్రత్యేక కేటగిరీ కాలేజీల సంఖ్యను పెంచటంతోపాటు, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో వసతులు, బోధన మెరుగుదలపై శ్రద్ధ పెంపు చేయాల్సి ఉంది.
201819 సంవత్సరం నుంచి ఇంజినీరింగ్ విద్యలో ప్రవేశానికి దేశానికంతటికీ ఒకే కామన్ పరీక్ష నిర్వహించే సూచనలు దృష్టా ప్రభుత్వ జూనియర్, రెసిడెన్షియల్ కాలేజీల విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు పెంచాలన్న ప్రభుత్వ ఆలోచన హర్షించదగింది. ప్రస్తుతం రాష్ట్రంలో జెఇఇ, నీట్, ఎంసెట్‌ల కొరకు 26 కోచింగ్ సెంటర్లు 1000 మంది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు శ్రీహరి చెప్పారు.
స్కూలు విద్యను పటిష్టవంతం చేసినపుడే విద్యార్థులు సరైన పునాదితో హైస్కూలు, కాలేజీ విద్యకు వస్తారు, మెరుగైన ఫలితాలు సాధిస్తారు. స్కూలు విద్యలో వారసత్వంగా వచ్చిన అస్తవ్యస్తతను అధిగమించటానికి, టీచర్ల నియామకంసహా ప్రభుత్వం చేబడుతున్న చర్యలు ఫలప్రదం కావాలని, విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం సగర్వంగా ముందుపీఠీకి రావాలని ఆక్షాంక్షించుదాం.