Home ఆఫ్ బీట్ నిరంతర చలనశీల కవి సినారె

నిరంతర చలనశీల కవి సినారె

sinare

‘పరులకోసం పాటుపడని నరుని బ్రతు కుదేనికని ?
మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని ?’
– డా. సినారె
తనది ప్రగతిశీల మానవతావాదం అని చెప్పుకున్న మరణం లేని మహాకవి డాక్టర్ నారాయణ రెడ్డి. సాహితీ వ్యాసాంగాన్ని ఒక నిరంతర తపస్సుగా సాగించి తెలంగాణా మట్టికి జ్ఞానపీఠ గౌరవాన్ని సముపార్జించిపెట్టారాయన. ‘రాస్తూ రాస్తూ పోతాను సిరా యింకే వరకు, పోతూ పోతూ రాస్తాను వపువు వాడే వరకు’ అంటూ ‘ఇంటి పేరు చైతన్యం’లో పేర్కొన్న సినారె జీవితపు చివరి చర ణం వరకు కవిత్వం రాసారు. అది అక్షరాలా నిజం, మరణించిన రోజున కూడా వారి కవిత ‘మన తెలంగాణ’ పత్రికలో అచ్చయ్యింది. కవిత రా యనిదే రోజుగడవని చైతన్యమూర్తి సినారె.
1953లో వచ్చిన ‘నవ్వని పువ్వు’ నుండి సినారె మరణానంతరం వచ్చిన ‘కలం అలిగింది’ వరకు తెలుగు సాహితీ సుక్షేత్రంలోని అన్ని ప్రక్రియల్ని చేపట్టి సుసంపన్నం చేశారు.విద్యార్థి దశలో పద్యా న్ని రాసిన సినారె, గేయం, వచనం, పాట, కథా కావ్యం, రూపకం, ద్విపద, ప్రపంచ పదులు,గజల్, యాత్రా చరిత్ర, పాటోబయోగ్రఫీ వం టి ప్రయోగాలను చేపట్టి అద్భుతంగా నిర్వహించారు. 1970లో వచ్చిన వీరి ‘మంటలూ-మానవుడు’ కావ్యానికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అభ్యుదయ కవిత్వానికి అద్దంలా ఉన్న ఈ కావ్యం నేటి కాలానికి అద్దం పడుతుంది.
ఈ కావ్యం వచ్చి నాలుగున్నర దశాబ్దాలు గడిచినా ఇందులోని కవితలు సామాజిక స్వభావాన్ని కోల్పోలేదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కొనసాగుతూ విప్లవ సాహిత్యం యుగం ప్రారంభమై, అభ్యుదయ సాహిత్యం ఒడిదుడుకులకు గురౌతున్న సమయంలో అంటే తెలుగులో విప్లవ కవిత్వయుగం ప్రారంభమై చెరబండ రాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, వరవరరావు, శివసాగర్ వంటి కవులు ఉదృతంగా ఇదే సమయంలో విప్లవ కవిత్వం రాస్తు న్న సమయంలో ‘మంటలూ- మానవుడు’ కావ్యం వచ్చింది. ఈ కావ్యం మరోసారి ‘అభ్యుదయ కవిత్వ జెండా’ ఎగురవేసింది. ఏ శక్తులు అడ్డుకున్నా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సమాజం ఎప్పుడూ ముందుకే నడుస్తుందన్న అభ్యుదయ కవిత్వ లక్షణాలన్నింటిని పొదుముకున్న కావ్యం ఇది. ‘చైతన్య ప్రగతి’ కవితలో చైతన్య శంఖాన్ని ఊదారు సినారె. మనిషిలో చలనాన్ని రగిల్చి స్తబ్దతను దూరం చేయడమే అభ్యుదయ కవి లక్షణం అంటూ….‘చైతన్యమున్న మనిషి స్పందించక ఏమౌతాడు./ హృదయమున్న మనిషి ఎదురుతిరగక ఏం చేస్తాడు’/ ‘పదండి ముందుకు…. పదండి తోసుకు పోదాం పై పైకి’ అనే అభ్యుదయ తత్వం ఈ కావ్యంలో అడుగడుగునా కనిపిస్తుంది. ‘కవి’ కలానికి, కాలానికి రారాజు, కాలాన్ని కలం తాడుతో ముందుకు లాగుతాడు. లేకపోతే వెనక్కి నడిపిస్తాడు. అంతటి యోధుడు కవి అంటూ మనుషుల్ని ముందుకు నడిపించిన అభ్యుదయ కావ్యం ఇది. సమాజంలో అభ్యుద యం ఎల్లప్పుడు శ్రామిక వర్గం వైపే అభ్యుదయకవికి సమాజ స్వభావం,లోతులు తెలుసు. వర్గ సమాజ రూపురేఖలను అనేక రకాలుగా వివరిస్తూ ‘నీకు నాకు ఏం పోలిక’ కవితలో….
‘నీకు తెలియదు శ్రమలోని రుచి / నీకు తెలిసిందల్లా ఇంద్రజాల/పదవి వల్ల దక్కిన శచి…../ అమృతం కొనగలుగుతావు గానీ / అంబలి కొనగలుగుతావా?’ అంబలిని, అమృతాన్ని పోలుస్తారు కవి అంబలికే ఓటు వేయటం మరీ బాగుంది. అది కవిలోని వాస్తవ దృక్పథాన్ని తెలియజేస్తుంది.మరొక సందర్భంలో ధనిక, బీద వర్గాల జీవిత విధానంలో తేడాను విశ్లేషిస్తూ ‘కోట్ల కోట్లు గడించినా/చీట్ల పేక మీద నీ బతుకు/అర్ధ రూపాయి సంపాదించినా/ అమృ త తుల్యం నా మెతుకు’ కోట్లు నోట్లు మనిషి కడు పు నింపవనీ, ఎన్ని ఉన్నా ‘మెతుకు’ లేనిదే మని షి ‘బ్రతుకు’ లేదని కవి ఆంతర్యం చూడొచ్చు.
‘చెట్టంత ఎత్తుండడు / గుట్టంత లావుండడు / మెడలో పేగులుండవు / చెవులకు పుర్రెలుండవు / మనిషిలా ఉంటాడు / మనుషుల్లో ఉంటాడు’ అంటూ మనల్ని ఆలోచింప చేస్తూ, ఆ రాక్షసుడు ఎవరై ఉంటారని ఆలోచించే లోపే, అది ఎవరో కాదు, మనలోని స్వార్థమే ఆ రాక్షసుడు అంటా డు కవి. మనలోని ‘రాక్షసుడు’ నశించినపుడే ‘మనిషి’మనిషిగా మనీషిగా ఆలోచిస్తాడు అనే భావన ఎంత గొప్పదో కదా !
అభ్యుదయం ఎప్పుడూ పాతను పొమ్మం టూ కొత్తను రమ్మంటుంది. అందుకే కవి కొత్త ముఖం తొడుక్కో కవితలో ‘పాత ముఖాన్ని బహిష్కరించి/కొత్త ముఖాన్నిఆవిష్కరించాలి’ అంటూ మార్పు మనుషుల్ని ముందుకు నడిపిస్తుంది అంటాడు.నిరంతర చలనశీలకవి అయిన సినారె ఆనాడు బలంగా వచ్చిన విప్లవ కవిత్వం ప్రభా వం నుండి దూరంగా పోలేదు. ‘లోకంగుట్టు’లో విప్లవదృక్పథం కలిగిన తోటి కవిని గురించి చెబుతూ ‘ఆలోచనా ఆలాపన నాది / ఆక్రోశం ఉక్రోశం వాడిది’ అంటూ విప్లవ దృష్టి కన్నా తన దృక్పథం గొప్పది అంటారు. ఎవరిది ఏ మార్గమయిన తన మార్గం తనదే అంటూ….‘తమ్ముని గొంతుకలో శ్రుతి కలపలేకున్నా / దమ్ముని మాత్రం మెచ్చుకుంటున్నాను / రాజీపడే అవసరం ఇద్దరికీ లేదు / ‘రస్తా’లు వేరని చాటుతున్నాను’ అంటూ తాను విప్లవమార్గానికి వ్యతిరేకిని, విప్లవానికి కాదనే వివరణ ఇస్తాడు. మంటలు -మానవుడు కావ్యం మనుషులపై ఆయనకున్న మమకారానికి అద్దంపడితే, ‘మట్టి-మనిషి-ఆకాశం’ దీర్ఘ కవిత ప్రకృతి పరిమళాలను పాఠాలుగా గ్రహించి, మనిషి మానవ సంబంధాలను కాపాడుకోవాలనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ‘విశ్వంభర’ తర్వాత అంతటి గౌరవాన్ని పొందిన కావ్యం మట్టి-మనిషి-ఆకాశం. ఇతర భాషలోకి అనువదించబడి ఎంతో మంది మెప్పు పొందిన వచన కవితా రూపం ధరించిన కావ్యం ఇది.
‘సృష్టి’ అంటె కొందరంటారు ‘భూమి’ అని, మరికొందరంటారు ‘ఆకాశం’ అని, ఇంకొందరంటారు ‘జీవకోటి’ అని… కానీ సినారె గారి దృష్టిలో సృష్టి అంటే మట్టి-మనిషి-ఆకాశం. ఈ మూడింటి త్రివేణి సంగమమే సృష్టి. భూమిని, ఆకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో విషయాలు ఈ కావ్యంలో ఆవిష్కరించారాయన. భూమికీ, ఆకాశానికి మధ్య మనిషి ఉంటాడు. ఆకాశం దృష్టంతా మనిషి మీదే. పగలు సూర్యుని కంటి తో, రాత్రి చుక్కల కళ్ళలోంచి మనిషిని కనిపెట్టుకొని ఉంటుందట ఆకాశం. అందుకు కారణం మనిషి ఎక్కడ పశువుగా మారుతాడోనని భయమట ! ఈ కావ్యాన్ని చదువుతుంటె మనం చేసే ప్రతీ పనిని సూర్యాదిదేవతలు చూస్తూ ఉంటారనే విషయాన్ని కవి మనకు చెప్పకనే చెబుతున్నట్లు అనిపిస్తుంది. మనిషి ప్రకృతి నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉందని, భూమి గొప్పతనాన్ని చెప్తూ ‘తనువంతా ఎండిపోయి బీటలు వారినా / తనలోని తడిని కాపాడుకుంటుంది/తన కోసం కాదు, తన సంతతి కోసం’. మనిషికి – ప్రకృతికి విడదీయరాని సంబంధం ఉంది. ప్రకృతి అంటే మట్టి, ఆకాశం, నీరుల సంగమం అన్నారు సినారె.-‘ప్రకృతికీ మనిషికీ మధ్య / సృష్ట్యాదిగా అల్లుకున్న /బింబానుబింబ సంబంధమది’ ప్రకృతికి ఎంత శాంతమో అంత కోపము ఉందంటాడు. ప్రకృతికి కోపం వస్తే చెట్టు మనిషి ఒక్కటే, అంటూ-‘అన్నం పెట్టిన కడలి చేతులే / వేల సజీవ శరీరాలను వెదురుబొంగుల్లా / విసిరేస్తాయి / మతితప్పిన ప్రకృతి ముందు / చెట్టూ మనిషీ ఒక్కటే’ అంటారు. మనిషి నిరంతర అన్వేషి, ఎప్పటికైనా మనిషి ఆకాశాన్ని మడిచి తెచ్చి భూమి ఒంటికి చుట్టకపోతాడా అనేది కవి భావన. మనిషి సామర్థ్యం మీద కవికి ఎంత నమ్మకమో ఈ వాక్యాలు చదువుతుంటే తెలుస్తుంది. సృష్టి ఎలాగయితే ఎప్పుడూ ఒకేలా ఉండదో మనిషి కూడా నిత్య చైతన్యంతో నిలవాలనే గొప్ప సందేశం ఇస్తున్న కావ్యమే మట్టి-మనిషి-ఆకాశం. కవిత్వంలో ఎంతటి మానవతామూర్తిగా కనిపిస్తారో, వ్యక్తిగానూ అంతటి స్ఫూర్తి వారిది. నవ్వని పువ్వు, నాగార్జున సాగరం, అజంతా సుందరి వంటి కావ్యాలను రచిం చి మానవత్వాన్ని, ప్రేమను, శాంతాన్ని ఎంతగానో ప్రచారం చేసారు. మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ సామాజిక, సాంస్కృతిక జీవితానికి అంకితమైనట్టుగానే సినారే తెలుగు జాతీయతకు కట్టుబడి అందులోని చక్కటి సామాజిక విలువలను ప్రచారం చేసారు.అనువాదాలు, యాత్రాచరిత్రలు ఇలా తొమ్మిది పదుల వరకు కావ్యాలను, రూపకాలను, 3500 పాటలను రాశారు. మట్టిని-మనిషిని సమానంగా ప్రేమించిన మహామనీషి సినారె. తెలుగు నేలమీదే కాదు, భారతీయ సాహిత్యాకాశంలో వారిది మహోజ్వల స్థానం. తెలుగు అక్షర ప్రపంచం మీద చెరగని ముద్రవేసి, తెలుగు భాషను ప్రతీ తెలుగువాడి ఇంటి గుమ్మానికి తోరణంగా నిలిపిన మన కవి…. మహాకవి… డాక్టర్ సి. నారాయణ రెడ్ది…

‘ఎదురీదే చేతులుంటే
ఏరు దారులివ్వక ఏం చేస్తుంది ?
పయనించేఅడుగులుంటె బాటచేతులెత్తక ఏం చేస్తుంది ?

తనకరాలుపరికరాలు తగిన పాళ్ళలో సమన్వయించుకొని
చూపునుసాచిస్తుంటే శూన్యం
శిరసొగ్గుక ఏం చేస్తుంది. ?
పిడికిలి పిండే మనిషికి ఎడారి
అలలెత్తక ఏం చేస్తుంది ?’

మరణం లేని మహాకవి

స్వాంతంలో సత్కవితా సాగరాలు కలవాడా
పలుకులోన కర్పూరపు పరిమళాలు కలవాడా
భాషా సాహిత్య చలనచిత్ర సరోవరాలలో
పద్మాలను నవ్వించిన సినారె? వెలుగుల రేడా

వ్యాసానికి వ్యాసుడవు
కవన కాళిదాసుడవు
ప్రాజ్ఞులు పామరులలో
వెలిగే సుమభాసుడవు

కమ్మని పాటల కోకిలలున్నవి
పచ్చని పల్కుల చిలుకలున్నవి
ఓ సినారె ! హృదయవనంలో
హంసలు, నాట్యమయూరాలున్నవి

నీ శిరస్సు హిమశిఖరము
నీ మనస్సు మణిముకురము
నీ వ్రాతలు నీ చేతలు
తెలుగుజాతి దివ్యవరం
మట్టిలోన నీ పదాలు పెట్టినావు
చేతులతో ఆకసాన్ని ముట్టినావు
‘విశ్వంభర’ వలచె నిన్ను నారాయణ !
జ్ఞానపీఠ మూర్తిగ జై కొట్టిరావు

సంస్కృత పద పటు సమాస సౌందర్యం నీలో
సిరిపలుకుల తెలుగుతేనె మాధుర్యం మీలో
ఉరుదూ కోమల శైలీ మార్దవము సినారె !
మేళవించే వేణీత్రయ గాంభీర్యం నీలో

జానపదం మరువలేదు
జ్ఞానపథం విడువలేదు
మహాకవీ ! ఓ సినారె
మరణం నీకెపుడు లేదు

పోతన ఉన్నంతవరకు నీవుంటవు
పాలకురికి కవనంలా నీవుంటవు
నీ పాటలు ప్రతిచోట మోగుతుంటే
ఓ సినారె ! దివి నండే వింటుంటవు
డా.తిరుమల శ్రీనివాసాచార్య

వడ్డేపల్లి సంధ్య