Home ఎడిటోరియల్ ఆశ్రిత పక్షపాతం!

ఆశ్రిత పక్షపాతం!

Article about Modi china tour

‘వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చున్నా ఫర్వాలేదు’ అన్నట్లుగా ఉంది మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా నిర్ణయం. ఉన్నతస్థాయి విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహకంగా ఆ మంత్రిత్వశాఖ ప్రభుత్వ రంగంలో మూడు, ప్రైవేటు రంగంలో మూడు సంస్థలకు “ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌” గుర్తింపు ఇచ్చింది. ప్రభుత్వ రంగంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బొంబాయి, ఢిల్లీ ఐఐటిలు, ప్రవేటురంగంలో బిట్స్ పిలాని, మణిపాల్ యూనివర్శిటీ ఆ గుర్తింపు పొందాయి. కాని ప్రైవేటురంగంలోని మూడవ ఇన్‌స్టిట్యూట్ పేరు విద్యావేత్తలను ఆశ్చర్యచకితుల్ని చేసింది. అది ఇప్పటికీ కాగితం మీదే ఉన్న జియో ఇన్‌స్టిట్యూట్. అది రిలయెన్స్ ఇండస్ట్రీస్ గ్రూపుకు చెందిందని జియోఫోన్ వ్యాప్తిని బట్టి ఇట్టే గుర్తించవచ్చు. జియోఫోన్ ప్రకటనల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో వినియోగించుకున్న ముఖేష్ అంబాని సంస్థ కొద్ది కాలంలోనే అతిపెద్ద టెలీకం కంపెనీల్లో ఒకటి గా కస్టమర్లను సంపాదించుకుని ఆ రంగంలోని ఇతర ప్లేయర్లకు దడపుట్టించటం చూస్తు న్నాం. కాబట్టి ఆ గ్రూపు నెలకొల్పబోయే జియో టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ కూడా అలాగే దూసుకుపోతుందని మంత్రిత్వ శాఖ ఆశించిఉండవచ్చు. ముందే ‘ఎక్సలెన్సీ’ టాగ్ ఇచ్చేస్తే అది దాని శీఘ్రతర ఎదుగుదలకు ప్రోత్సాహకరంగా పని చేస్తుందని భావించి ఉండవచ్చు.
కాని ఇటువంటిది మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందని ఊహించటం కష్టం. ఏదైనా ఉన్నత విద్యా సంస్థ అది ప్రభుత్వ, ప్రవేటు రంగం ఏదైనా కానీ నెలకొల్పిన అనంతరం స్థిరపడటానికి, వృద్ధిచెందటానికి, ప్రసిద్ధినార్జించటానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. కాని జియో ఇన్‌స్టిట్యూట్‌కు ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యత ‘ఆలు లేదు చూలు లేదు, కొడుపు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది. ఇందుకు సమర్థనగా హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ చెబుతున్నదేమంటే, ‘భూమి చేతిలో ఉంది, రూ. 9500 కోట్లు పెట్టుబడి పెట్టటానికి ప్రమోటర్లు సిద్ధంగా ఉన్నారు’ అని.
‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్’ టాగ్ కొరకు సంస్థలను ఎంపిక చేసిన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి తమ సిఫారసును గట్టిగా సమర్థిస్తూ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌ల కేటగిరీలో గ్రీన్‌ఫీల్డ్ ఇన్‌స్టిట్యూట్‌ల కొరకు నిర్దేశించిన ముందస్తు అవసరాలన్నిటినీ జియో ఇన్‌స్టిట్యూట్ నెరవేర్చిందని, అందువల్ల కొందరు చేస్తున్న విమర్శలు అసూయతో కూడినవని కొట్టిపారేశారు. ఆ సంస్థకు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ మాత్రమే ఇవ్వటం జరిగిందని, మూడేళ్లలో మౌలిక వసతులు, క్యాంపస్, ఫ్యాకల్టీ సమకూర్చుకునే షరతులపై అవగాహన ఒప్పందం సంతకాలు జరుగుతాయని ఆయన చెప్పారు. మూడేళ్ల తర్వాత సంభవమయ్యే దృశ్యాన్ని ఇప్పుడే విశ్వసించి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు ఇవ్వటంలో ఔచిత్యమేమిటో అర్థంకాదు. ఈ గుర్తింపు పొందిన సంస్థలు ఫ్యాకల్టీలో 25 శాతాన్ని విదేశీ ఉద్యోగులను నియమించేందుకు, సీట్లలో 25 శాతం విదేశీ విద్యార్థులకు ఇచ్చేందుకు, ఫీజు, కోర్సుల స్వరూపం నిర్ణయించుకునేందుకు స్వేచ్ఛ కలిగి ఉంటాయి.
అదీ అసలు విషయం. ఇన్‌స్టిట్యూట్ ఏర్పడే సమయానికే ఎటువంటి ప్రతిభా పాటవ నిరూపిత రికార్డు లేకుండానే విద్యార్థుల ప్రవేశానికి రంగం సిద్ధం చేయటం ఈ టాగ్ మంజూరు ఉద్దేశంగా విదితమవుతున్నది. దీనిపై విద్యావేత్తల తీవ్ర విమర్శల నుంచి గుక్క తిప్పుకునే ప్రయత్నంగా హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖ, ‘జియో ఇన్‌స్టిట్యూట్‌కు ఆ టాగ్ ఇప్పుడే ఇవ్వటం లేదు. మూడేళ్ల తర్వాత నిపుణుల కమిటీ నిర్దేశనలను సంతృప్తి పరిస్తేనే ఇస్తాం’ అంటూ డొంక తిరుగుడు సమర్థనకు దిగింది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇవ్వవచ్చు, ఆ సంస్థ మూడేళ్లకో ఐదేళ్లకో వ్యవస్థాపితమై అంతర్జాతీయ ప్రమాణాలు సంతరించుకుంటే అప్పుడు ఆలోచించవలసిన విషయంపై ఇప్పుడు అభిమాన నిర్ణయం చేయటం ఆశ్రిత పక్షపాతం కాదా? కాంగ్రెస్ (యుపిఎ) పాలనకు కొనసాగింపుగా మోడీ ప్రభుత్వం మరింత ఉత్సాహంతో అమలు జరుపుతున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంలో అంబానీ, అదానీ వంటివారు పొందుతున్న అధిక ప్రాధాన్యతకు ఇది మరో ఉదాహరణ మాత్రమే. సహజన్యాయ విరుద్ధమైన నిర్ణయాన్ని హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ వెనక్కి తీసుకుని జరిగిన తప్పును దిద్దుకోవచ్చు. అటువంటి విజ్ఞత మేల్కొంటుందా?