Home ఎడిటోరియల్ రోగికి మాతృమూర్తి నర్స్

రోగికి మాతృమూర్తి నర్స్

International Nursing Day

 

సాధారణంగా ఆసుపత్రి అనగానే మనకు ముందుగా డాక్టరు గుర్తుకు వస్తారు. వైద్యుడిని మనం ప్రాణదాతగా వర్ణిస్తాము. సకాలంలో రోగి కోలుకోవాలంటే వైద్యుడు చేసే ప్రయత్నంతో పాటు, అక్కడ పనిచేసే నర్సుల పాత్ర కూడా చాలా కీలకం. వైద్యుడు రోగాన్ని నిర్ధారించి అవసరమైన మందులు రోగికి ఇస్తాడు. కానీ క్షేత్రస్థాయిలో రోగిమానసిక పరిస్థితిని నర్సులు మాత్రమే అంచనా వేయగలుగుతారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే రోగులు రోజుల తరబడి ఆసుపత్రిలో వైద్య సేవలు పొందాల్సిన అవసరం వుంటుంది. అటువంటి సమయంలో నర్సుల పాత్ర మరింత కీలకంగా వుంటుంది. మహిళలే నర్సులుగా వుంటారు కాబట్టి వారు సహనం, ఓర్పుతో వ్యవహరిస్తూ రోగి పట్ల సానుభూతి చూపిస్తారు. మందులను సకాలంలో వేసుకొనేలా రోగికి సూచనలిస్తారు. తమ సేవలతో రోగిలో ధైర్యాన్ని నింపుతారు. చికిత్స అనంతరం మనలో చాలామంది డాక్టరుకి ధన్యవాదాలు తెలుపుతుంటాము. అదే సమయంలో నర్సులను విస్మరిస్తుంటాము.

నర్సులు రోగులకు చేసే సేవలను గుర్తించి అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని 1953 నుండే జరపాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఆ తరువాత ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ చొరవతో 1965 నుండి “అంతర్జాతీయ నర్సుల దినోత్సవం” జరుపుతున్నారు. 1974వ సంవత్సరం నుండి ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు నాంది పలికిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుతున్నారు. “లేడీ విత్ ది లాంప్‌” గా పేరు పొందిన నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో జన్మించారు. ఆమె తండ్రి విలియం ఎడ్వర్డ్ షోర్ ప్రోత్సాహంతో నైటింగేల్ గ్రీకు, లాటిన్, ఇంగ్లీషు భాషలపై పట్టు సంపాదించారు. గణితం, భూగోళం, చరిత్రలపై అవగాహన పెంచుకున్నారు. 1852లో ఆమె ఐర్లాండ్ వెళ్ళి అక్కడ ఆసుపత్రులను పరిశీలించారు. అవి చాలా అపరిశుభ్రంగా వుండటం గుమనించారు.

ఆసుపత్రులను శుభ్రం చేయడం ద్వారా రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించవచ్చని ఆమె విశ్వసించింది. 1854లో క్రిమియన్ వార్ రావడంతో నైటింగేల్ టర్కీ వెళ్ళి అక్కడ సైనికులకు విశేష సేవలు అందించింది. యుద్ధంలో గాయపడిన సైనికులు కలరా, టైఫాయిడ్, డిసెంట్రీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు. వారందరికీ నైటింగేల్ దగ్గర వుండి సపర్యలు చేశారు. సైనికులకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఆమెను “లేడీ విత్ ది ల్యాంప్‌” గా పిలవడం ప్రారంభించారు. లండన్‌లో ఆమె థామస్ ఆసుపత్రిలో నర్సింగ్ స్కూల్‌ను స్థాపించింది. నర్సింగ్ రంగంలోకి ప్రవేశించే మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించింది. నైటింగేల్ మంచి రచయిత్రి కూడా. ఆమె “నోట్స్ ఆన్ నర్సింగ్‌” అనే పుస్తకాన్ని రచించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. జీవితాంతం ప్రజాసేవకే అంకితమైన నైటింగేల్ 1910 ఆగస్టు 13న తుది శ్వాస విడిచింది. ఆమెను “ది ఫౌండర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్‌” అని కూడా పిలుస్తారు.

భారతదేశం కూడా ఆమె పేరుతో ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. ఆమె జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం భారత రాష్ర్టపతి నైటింగేల్ పురస్కారాలను నర్సింగ్ విభాగంలో విశేష సేవలందించిన వారికి అందచేస్తారు. నర్సులు వైద్యులకు, రోగులకు అనుసంధానకర్తలుగా పని చేస్తారు. వారు రాత్రి వేళలో కూడా పని చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. రోగులు మధ్య ఎక్కువ కాలం గడపటం వల్ల నర్సులు ఇన్‌ఫెక్షన్‌కూ గురవుతారు. వీటన్నింటిని లెక్కచేయకుండా అనేక మంది మహిళలు ఈ వృత్తిలో చేరి రోగులకు విశేషమైన సేవలందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం నర్సులకు తోడుగా ఆశా కార్యకర్తలను నియమించింది. వారి కష్టనష్టాలను తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై వుంది.

Article about International Nursing Day